– వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి
మేడ్చల్: కనిపించే దైవం గోవు.. గోమాతకు పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసిన పుణ్యం లభిస్తుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గోవులో సకల దేవతలు నిలయమై ఉంటారని పేర్కొన్నారు. మేడ్చల్ పరిధిలోని జవహార్ నగర్ మున్సిపాలిటీలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని హిందూ సేవ సమితి అనే స్వచ్ఛంద సంస్థ గో శాల ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆవులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గోమాతకు పూలమాలవేసి నైవేద్యం అందించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ మానవ లోకానికి గోవు అందించే వైద్య సేవలను వివరించారు. గోమాత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తో పాటు విసర్జక పదార్థాల్లో కూడా ఆయుర్వేదం కలిగి ఉందని చెప్పారు. గోమాత కనిపించే ప్రత్యక్ష దైవం అని ఉదహరించారు.
ముఖ్యంగా పాడి పరిశ్రమ వృద్ధి సాధించాలంటే గోమాత తోనే సాధ్యమన్నారు. వ్యవసాయానికి వెన్నెముకగా ఉంటూ, రైతుకు ఉపాధి అవకాశాలను కల్పించి కుటుంబ పోషకురాలిగా అన్నదాతకు అండగా ఉంటుందన్నారు. గోవు హిందువుల విశ్వాసానికి మూలమని.. ప్రతి ఒక్కరూ గోహత్య నిషేధ చట్టం కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆవు వల్ల కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందన్నారు.
ఆవు వల్ల లభించే ఔషధ పదార్థాలు కేవలం హిందువులకు మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి మనిషికీ ఉపయోగపడుతుందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఉత్సవాలు సందర్భంగా గోశాల ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని, గోశాల నిర్వహకులను బాలస్వామి అభినందించారు.
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గోవిందు రాటి, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిలుకూరి అఖిలేష్, స్థానిక నాయకులు, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.