Suryaa.co.in

Editorial

పల్లె పక్కలో ‘షిర్డిసాయి’ బాంబు

  • పల్లెగుండె పగులుతోంది

  • క్వార్ట్‌జైట్ గనుల పేలుళ్ల భయంతో బీతిల్లుతున్న ఓర్వకల్లు

  • 2022లో 150 ఎకరాల లీజు తీసుకున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్

  • పేరుకు గ్రామానికి దూరంగా గనుల పేరుతో అనుమతి

  • కానీ పల్లెజనం మధ్యలోనే షిర్డిసాయి గనుల బాంబు

  • 200 మీటర్లలోపు తవ్వకాలకు ఎలా అనుమతిస్తారన్న జనం

  • వ్యతిరేకిస్తున్న ఓర్లకల్లు గ్రామం

  • జగన్ జమానాలో ఇచ్చిన లీజును ఎందుకు రద్దు చేయరు?

  • పీసీబీ ప్రజాభిప్రాయసేకరణలో వెల్లువెత్తిన నిరసన

  • మొక్కుబడిగా పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ

  • తవ్వకాలు అంగీకరించేది లేదంటూ రోడ్డెక్కిన మహిళలు

  • గతంలో షిర్డిసాయి కంపెనీపై టీడీపీ నేతల ఆరోపణలు, ఫిర్యాదులూ

  • కూటమి వస్తే చర్యలు తీసుకుంటామని టీడీపీ హామీ

  • ఇప్పటికే షిర్డిసాయి కంపెనీ ఉల్లంఘనలపై కోర్టులో కేసు వేసిన సోమిరెడ్డి

  • అధికారంలోకి వచ్చినా షిర్డిసాయికి ఇంకా ‘రెడ్డి’కార్పెట్‌పై విస్మయం

  • ఉల్లం‘గనుల’పై ఉక్కుపాదం మోపరా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

పర్యావరణ నిబంధనల ప్రకారం ఇళ్లకు 200 మీటర్లలోపు గనుల తవ్వకాలు అనుమతించకూడదు. 33 శాతం పచ్చదం ఉండాలి. గని ప్రాంతం చుట్టూ రక్షణ కంచె వేసి, అక్కడ కాలుష్యం వ్యాప్తి చెందకుండా చెట్లు పెంచాలి. ఎందుకంటే దాని ప్రభావం అక్కడి ఇళ్లపై పడుతుంది కాబట్టి. ఇవన్నీ తవ్వకాలు జరిపే కంపెనీలు పాటించాల్సిన నిబంధన. అవి ఉంటేగానీ అనుమతులు ఇవ్వకూడదన్న ప్రభుత్వ నిబంధనలు!

కానీ ఆ కంపెనీకి ఇలాంటి నిబంధనలకు మినహాయింపు. కారణం ఆయన గత పాలకుడు జగనన్నకు ఆప్తుడు. కడప వైసీపీ ఎంపి అవినాష్‌రెడ్డికి వ్యాపార భాగస్వామి అని, గతంలో టీడీపీ చేసిన ఆరోపణ. ఇంకా ముసుగుతీసి మొహమాటం లేకుండా చెప్పాలంటే.. టీడీపీ ఆరోపణ ప్రకారం, ఆ కంపెనీ జగనన్న బినామీ. పేరుకే విశ్వేశ్వరెడ్డి. పెత్తనమంతా అవినాష్‌రెడ్డి అన్నది టీడీపీ సూత్రీకరణ.

మరి అలాంటప్పుడు నిబంధనలు ఎలా అమలవుతాయి? మన పిచ్చికాకపోతే! సదరు కంపెనీ మన ఇంటిమనిషిదే కాబట్టి, జగనన్న సర్కారు దానికి 150 ఎకరాల భూమి లీజుగా ఇచ్చేసింది. అది ఎక్కడంటే… సరిగ్గా పల్లెజనం పక్కలో. పర్యావరణశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తే, ఇక రేపో మోపో ఒక ఫైన్ మార్నింగ్ పేలుళ్లు షురువవుతాయి. తర్వాత పల్లె గుండె పగులుతుంది. అందుకే జనం తిరగబడ్డారు. మా పక్కలో బాంబులు పేలుస్తారా? అని, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన పీసీబీ అధికారులను నిలదీశారు.

మరిప్పుడు కూటమి సర్కారు ఏం చేస్తుంది? గతంలో ఇచ్చిన మాట ప్రకారం, జగనన్న సర్కారు ఇచ్చిన లీజు రద్దు చేస్తుందా? లేదా ప్రజావ్యరేకతను పక్కనబెట్టి, పాత పాలకుల మాదిరిగానే ఆ ‘షిర్డిసాయి’కి దణ్ణం పెడుతుందా? అన్నదే ఇప్పుడు ఆ పల్లెజనం ఉత్కంఠ. ఎందుకంటే అది ది గ్రేట్ బిజినెస్‌మెన్, జగనన్నకు దేవుడిచ్చిన తమ్ముడు విశ్వేశ్వరరెడ్డికి చెందిన, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి. అందుకే పల్లెజనంలో ఇలాంటి అనుమానాలు!

కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. పల్లెజనం గుండెలు ఏ క్షణమైనా పగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కారణ ం వైసీపీ అధినేత జగన్-కడప ఎంపి అవినాష్‌రెడ్డి జమిలిగా ప్రేమించే, షిర్డిసాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఆ గ్రామంలో క్వార్ట్‌జైట్ గనుల తవ్వకాలకు సిద్దమవడటమే.

నిజానికి జగన్ సర్కారు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి 2022లో 150 ఎకరాల లీజును కేటాయించింది. తవ్వకాలకు అవసరమైన క్వార్ట్‌జైట్ గనుల భూములను, వైసీపీ సర్కారు ఆ కంపెనీకి లీజుకు ఇచ్చింది. ఆ సందర్భంలో.. తాము గ్రామానికి దూరంగా తవ్వకాలు చేసుకుంటామని, గనులు కూడా అక్కడే ఉన్నాయంటూ పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలో అందమైన అబద్ధాన్ని లిఖితపూర్వకంగా షిర్డిసాయి కంపెనీ రాసిచ్చింది. వారయు కాలుష్యం సున్నా స్థాయిలోనే ఉంటుందని, సదరు రాసిచ్చిన మరో అందమైన అబద్ధం.

కానీ అది దేవతావస్త్రాల కథేనని, ఇప్పుడు ఓర్వకల్లు గ్రామస్తుల ఆందోళన తో బయట ప్రపంచానికి వెలుగుచూసింది. నిజానికి పర్యావరణ నిబంధనల ప్రకారం ఇళ్లకు 200 మీటర్లలోపు గనుల తవ్వకాలు అనుమతించకూడదు. కానీ షిర్డిసాయి కంపెనీ తవ్వకాలు జరిపే ప్రాంతానికి 200 మీటర్లలోపే తమ ఇళ్లు ఉన్నాయని, పల్లెజనం అధికారులకు ఫిర్యాదు చేసింది. షిర్డిసాయి కంపెనీకి తవ్వకాలకు అనుమతి ఇసే,్త తమ ఇళ్లు నాశనమవుతాయని పల్లెజనం ఘొల్లుమంటోంది.

‘మాగుండెల్లో బాంబులు పెడుతున్న షిర్డిసాయి కంపెనీకి ఎలా అనుమతిస్తార’ంటూ ఓర్వకల్లు గ్రామంలో, ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన కాలుష్యనియంత్రణ మండలి అధికారులపై గళమెత్తింది. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఇచ్చిన అనుమతులపై ఉవ్వెత్తున నిరసన ఎగసిపడుతున్నా, వారి గోసను పట్టించుకోని పీసీబీ గణం, కేవలం 2 గంటల్లోనే అభిప్రాయ సేకరణ తంతును ముగించడం బట్టి.. పీసీబీ పెద్దలు కూడా ‘కంట్రోల్ బ్లాస్టింగ్’ ముసుగులో.. షిర్డిసాయికి భక్తితో ప్రణమిల్లుతోందన్న అనుమానాలు పల్లెజనంలో తొంగిచూస్తున్నాయి.

సహజంగా మైనింగ్ చేసే ఏ కంపెనీ అయినా.. ఇలాంటి వ్యతిరేకత వస్తుందన్న ముందుచూపుతో, ‘కంట్రోల్ బ్లాస్టింగ్’ నిర్వహిస్తామని పీసీబీకి చెబుతుంటుంది. తర్వాత దానిని ఎవరూ పట్టించుకోరు. దాని గురించి పీసీబీకి పట్టదు. ‘ఎవరి వ్యాపారం వారికి సాగిపోతు’ంటుంది. జగనన్నకు మేళ్లు చేసిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కూడా సరిగ్గా అదే పనిచేసిందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

నిజానికి షిర్డిసాయి కంపెనీ జరపతలపెట్టిన తవ్వకాలకు సమీపంలోనే.. 50 హెక్టార్ల వరకూ పంటభూములున్నందున, తవ్వకాలు జరిపితే అవి నాశనమవుతాయన్నది రైతుల ఆందోళన. భూమిపై ఆధారపడి బతికే త మ నోటికాడ కూడును దూరం చేసే అధికారం షిర్డిసాయి కంపెనీకి ఎవరిచ్చారన్నది రైతన్నలు సంధిస్తున్న ప్రశ్న.

గతానుభవాలు గుర్తించని సర్కార్

గతంలో ఇదేవిధంగా నివాస ప్రాంతాలు, పంటపొలాల్లో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన సందర్భంలో, జరిగిన విషాదాలను పాలకులు మర్చిపోవడమే ఆశ్చర్యం. గుట్టపాడులో ఇలాగే బ్లాస్టింగ్ నిర్వహించినప్పుడు, భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. గతంలో ఇదేమాదిరి షాద్‌నగర్ మండలంలోని ఒక కంపెనీ నుంచి వెలువడిన వాయు కాలుష్యం కారణంగా, సిలికోసిస్ వ్యాధిలో చాలామంది మృతి చెందిన విషాదాన్ని గుర్తించకుండానే.. నాటి జగనన్న సర్కారు ఓర్వకల్లు గ్రామంలో, తన మేలు కోరే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు 150 ఎకరాలను తవ్వకాలకు లీజు ఇవ్వడం దారుణం. ఇంకో విచిత్రమేమిటంటే.. జగనన్న సర్కారు షిర్డిసాయి కంపెనీ తవ్వకాలకు అనుమతించిన 200 మీటర్లలోపే, ఆయన పేరుతో నిర్మించిన జగనన్న కాలనీలు ఉండటం!

సిలికోసిస్‌తో మృత్యువు ఒడిలోకి..

సహజంగా ఇలాంటి కంపెనీలు జరిగే తవ్వకాలు, ఇతర మైనింగ్ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల సమీప ప్రాంతాల్లో నివసించే జనాలను.. సిలికోసిస్ వ్యాధి మింగేస్తుంటుంది. ఆ బ్లాస్టింగ్, కంపెనీ నుంచి వెలవడే కాలుష్యం పీల్చిన జనం, త్వరగా మృత్యువు ఒడిలో ఒరిగిపోతారు. ఇది ఒక్క ఓర్వకల్లుకు మాత్రమే పరిమితమైన విషాదం కాదు. ఎక్కడైనా జరిగిదే ఇదే. ఇక షిర్డిసాయిపై కొరడా ఝళిపించాల్సింది కూటమి సర్కారే!

ఈ నేపథ్యంలో కూటమి సర్కారు.. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు క్వార్ట్‌జైట్ గనుల తవ్వకాలపె,ై ఏవిధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి ఈ కంపెనీ జగన్-అవినాష్‌రెడ్డి బినామీ అని, నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు జరిపారంటూ.. అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి పట్టాభి విరుచుకుపడ్డారు.

ఐదేళ్ల ముందు షిర్డిసాయి కంపెనీ టర్నోవర్, ఇప్పటి టర్నోవర్ల డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఆ కంపెనీకి అక్రమంగా భూములు కేటాయించారని, వాటిని రద్దు చేయాలని ఎలుగెత్తారు. అసలు ఎన్నికల ముందు వరకూ షిర్డిసాయి కంపెనీ అక్రమాలపై టీడీపీ పెద్ద యుద్ధమే చేసింది. మాజీమంత్రి సోమిరెడ్డి అయితే.. షిర్డిసాయి కంపెనీ అక్రమాలపై, కోర్టులో వేసిన కేసు ప్రస్తుతం విచారణలో ఉండటం ప్రస్తావనార్హం.

ఇప్పుడు షిర్డిసాయి కంపెనీని అమితంగా ప్రేమించి, దానికి చేతికి ఎముక లేకుండా వేల కోట్ల మేళ్లు చేసిన జగన్ సర్కారు కూలిపోయి, కూటమి సర్కారే అధికారంలోకి వచ్చింది. అయినా ఓర్వకల్లులో ప్రజాభిప్రాయసేకరణ చేసిన పీసీబీ అధికారులు.. కేవలం రెండు గంటల్లో ఆ తంతును ముగించడంతో, ‘షిర్డిసాయి కంపెనీ లౌక్యం’పై సహజంగానే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం.. షిర్డిసాయి కంపెనీకి ఇచ్చిన 150 ఎకరాల లీజును కూటమి సర్కరు రద్దు చేస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.

LEAVE A RESPONSE