– డిజిటల్ సాధికారతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం
– ప్రజాభిప్రాయం ఆధారంగా మరింత మెరుగైన సేవలు
– పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి
– 7,100 మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు
– అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
– ఉచితంగా బస్సు సర్వీసులను నడుపుతున్నాం
– 6 వస్తువుల నిత్యవసర సరుకుల ప్యాకేజీ ప్రతిఒక్కరి హక్కు
– వరద ప్రభావిత ప్రజలు గట్టిగా అడిగి తీసుకోండి
– ఏ పనిచేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తాననే పేరు నాకుంది
– సాయమందించడం సమష్టి బాధ్యత.. ప్రతి ఒక్కరూ ఇందుకు కదలాలి
– వరదలకు ముందు విజయవాడ.. వరదలకు తర్వాత విజయవాడ అనుకునేలా
విజయవాడను తయారుచేసుకుందాం
– ఇందుకు మాస్టర్ ప్లాన్ తయారుచేసి, అమలుచేస్తాం
– ఎన్ని సమస్యలున్నా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం
– తప్పుచేసినా కొందరిలో తప్పుచేశామనే బాధలేదు
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఈ రోజు మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. మొదట కొల్లేరు వరకు వెళ్లాను. తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేరుగా కృష్ణానదిని సముద్రం నుంచి ఇక్కడివరకు మొత్తం చూశాను. బుడమేరులో పని ఇంకా ముమ్మరంగా జరుగుతోంది. నేను ఇన్‌స్పెక్షన్ చేసిన బుడమేరు వంతెన, మధురానగర్‌లో ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో మొత్తం తొలగించమని స్పష్టమైన ఆదేశాలిచ్చాను.
ప్రధానంగా బుడమేరు గండి పూడ్చాలి. దీనివల్ల దాన్నుంచి నీరు ఇక్కడకు రాకుండా ఆగుతుంది. ఉన్ననీటిని బయటకు పంపాలి. అప్పుడే మేము చేసిన పనికి సార్థకత ఉంటుంది. ఈరోజు ఆరో రోజు. చాలా శ్రమిస్తున్నాం. మూడు గండ్లు ఉంటే రెండింటిని పూడ్చాం. మిగిలిన ఒక గండివల్ల 40 శాతం నుంచి 50 శాతం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. నిన్న 9,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు కొంతమేర పెరిగింది. ఇప్పుడు మళ్లీ తగ్గింది.
దాదాపు 3,500 క్యూసెక్కులు వస్తోంది. అయితే రాత్రికిగానీ తెల్లవారు లోపల గండిని పూడ్చనున్నాం. చాలా కష్టంగా ఉంది. దీనికోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాం. ఈ పనిపై మంత్రి అదేపనిగా ఉన్నారు. మిలటరీ కూడా వచ్చారు. ఇప్పటివరకు మేము చాలా పనులు చేశాంగానీ ఈ పని మాకు కొత్తగా ఉందని.. అయినా మీతో కలిసి ఈ పనిని ఎలాగైనా పూర్తిచేస్తామని వారు అన్నారు. ఎక్కడా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం పడలేదు. ప్రస్తుతానికి అయితే ఇన్‌ఫ్లోస్ రావని నమ్మకం. ఏదేమైనా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ముందుకెళ్తున్నాం.
ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత మెరుగైన సేవలు
ఐవీఆర్ఎస్ ద్వారా మేము ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. అర్బన్ ఏరియాలోని 149 సచివాలయాలు, రూరల్ ప్రాంతంలోని 30 సచివాలయాల పరిధిలోని ఇన్‌ఛార్జ్‌లకు ఫీడ్‌బ్యాక్ ద్వారా వచ్చిన సమాచారాన్ని పంపించి, తగిన చర్యలు తీసుకోమంటున్నాం. చివరిమైలు వరకూ రీచ్ కావడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాం.
76.2 శాతం మంది మా ప్రాంతంలో శానిటేషన్ బాగా జరిగిందని చెప్పగా, ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయా అని అడిగితే 62 శాతం మంది ఇంకా నీళ్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్ క్యాంపులు సేవలందిస్తున్నాయా అడిగితే 76 శాతం మంది పనిచేస్తున్నాయని చెప్పారు. మరోవైపు ఆహార నాణ్యత బాగుందా అని అడిగితే 80 శాతం మంది బాగుంది అని చెప్పారు. ఎక్కడైనా క్వాలిటీ బాగోలేకపోతే బాగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
శుక్రవారం 3,12,300 ఆహార ప్యాకెట్లు, 11,54,000 నీటి బాటిళ్లు, 4,51,000 పాల ప్యాకెట్లు, 5.70 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 74 వేల క్యాండిళ్లు, 50 వేల అగ్గిపెట్టెలు పంపిణీ చేశాం. అదే విధంగా 284 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. ఇవి 400 ట్రిప్పులు తిరిగాయి. మరో 24 ట్యాంకర్లు శానిటేషన్‌కు పనిచేస్తున్నాయి.
1,29,000 నీటి కనెక్షన్లలో 1,16,803 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పంపుల్లో ఇబ్బందుల వల్ల 12,197 కనెక్షన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు
7,100 మంది శానిటేషన్ వర్కర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. 12 వేల 46 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను తొలగించారు. 458 కి.మీ. మేర రోడ్లను శుభ్రం చేశారు. 110 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. ఇవి ఇప్పటికి 10 వేల ఇళ్లను శుభ్రం చేశాయి. రాత్రికి 15 వేలు అవుతాయని ఆశిస్తున్నాం. యుద్ధప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే పనులు చేస్తున్నాం. ఉచిత బస్సులు నడుపుతున్నాం.
ఇంటిదగ్గరే ఉంటే ఆలోచనలతో మానసికంగా ఆందోళన ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకోవడానికి, ఆందోళన తగ్గించడానికి వీలుగా ఈ సర్వీసులను నడుపుతున్నాం. టెలీ కమ్యూనికేషన్‌కు సంబంధించి 15 తప్ప మిగిలిన అన్ని సైట్లు క్లియర్ అయ్యాయి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్.. ఇలా వివిధ సేవలు అవసరమయ్యేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా సేవలు అందుబాటులో ఉండేలా చేయడం జరుగుతుంది.
అర్బన్ కంపెనీతో ఇప్పటికే మాట్లాడాం. రేట్లు కూడా రేషనలైజ్ చేస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్లకు రేటింగ్ కూడా ఉంటుంది. సంక్షోభాన్ని కూడా ఓ అవకాశంగా తీసుకొని నైపుణ్యమైన పనివారిని అందుబాటులో ఉంచడం, సరైన శిక్షణ ఇవ్వడం, ఉపాధిని సృష్టించేదానికి ఆలోచిస్తున్నాం. ఇందుకోసమే డిజిటల్ సాధికారతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. సెల్‌ఫోన్‌ను ఉపయోగించుకొని ఇంటిదగ్గరే ఉండి ఏయే సేవలు పొందొచ్చు? అవసరమైన ప్రొడక్ట్‌లను ఎలా పొందొచ్చు? మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ నేర్పించడం కోసం పెద్దఎత్తున డిజిటల్ ఎంపవర్‌మెంట్‌కు వెళ్తున్నాం.
ప్రతి వార్డులో ఇద్దరుముగ్గురిని లేదంటే అయిదారుగురిని పెట్టి శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణ ఫలితాల ఆధారంగా సక్సెస్ రేటునుబట్టి గౌరవ వేతనం ఇస్తాం. ఇదికూడా ఇంటిదగ్గర కూర్చొని పది రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల ఎకానమీలో బాగా మార్పులు రాబోతున్నాయి.
సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటున్నాం
డ్రోన్లతో మొదటిసారి ఆహారాన్ని అందించాం. మనిషి వెళ్లలేని చోటుకు డ్రోన్ వెళ్లగలిగింది. దీన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే పరిస్థితి వస్తుంది. కష్టంలో ఉన్నానని ఎవరైనా ఫోన్ చేస్తే జీపీఎస్, ప్రోగ్రామింగ్ ద్వారా అక్కడికి డ్రోన్‌ను చేర్చి వారి కష్టాన్ని తీర్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేక మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నాం.
ఒక్క డ్రోనే కాదు.. ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్‌ఫోన్.. ఈ మూడూ ఉపయోగించుకొని వాటిని కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, అనలిటిక్స్‌తో అనుసంధానం చేసి సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకుపోతున్నాం. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటున్నాం.
ప్రతి కుటుంబానికి ఈరోజు నుంచి మూడురోజుల్లో 100 శాతంమేర నిత్యావసర సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో చక్కెర, లీటరు పామాయిల్, రెండు కిలోల ఉల్లిపాయలు, రెండు కిలోల బంగాళాదుంపలు ఇస్తున్నాం. ఆరు సరుకులతో ఒక ప్యాకేజీ ఇస్తున్నాం. ఇక్కడ చిన్నా పెద్దా అనే వ్యత్యాసం చూడటం లేదు.. పేద, ధనిక అనేదాన్ని చూడటం లేదు. వరదలు అందరినీ సమానంగా చూశాయి. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తించేలా చూస్తున్నాం.
ఈ ప్యాకేజీ సమాచారాన్ని.. ప్యాకేజీ కింద ఏమేం వస్తువులు ఇస్తున్నామో తెలియజేస్తూ నా పేరుమీద అందరికీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతా. ప్రజలకు ఒకటే చెబుతున్నా. ప్యాకేజీలో ఏయే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకునే హక్కు మీకుంది. గట్టిగా అడిగి తీసుకోమని చెబుతున్నా. నేనంటే ప్రజలకు ఓ విశ్వాసం.. నేను ఏ పనిచేసినా పద్ధతి ప్రకారం చేస్తాననే పేరుంది.
ఈ ప్యాకేజీ మీకు అందేవరకు ఆహారాన్ని పంపిణీ చేస్తాం. మీకు ఫుడ్ అవసరమా అని మేము అడగబోతున్నాం.. మీరిచ్చే సమాధానాన్నిబట్టి సరఫరా చేస్తాం. ప్యాకేజీ ఇచ్చిన రోజు డ్రై ఫుడ్ కింద 150 గ్రాముల నూడిల్స్, ఆరు ఆపిల్స్, ఆరు బిస్కట్ ప్యాకెట్లు, 6 లీటర్ల నీరు, 2 లీటర్ల పాలు అందజేస్తాం. ఆ తర్వాత కుక్డ్ ఫుడ్‌ని నిలిపేస్తాం. వారికివారు వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసులు ఏమేం కావాలో అవి అందిస్తాం. శానిటేషన్ చేసి ఎక్కడా అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు అన్ని ఇళ్లు, రోడ్లు క్లీన్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. డ్రెయిన్లు క్లీన్ చేస్తాం.
మేము ఎన్ని ఇచ్చినా కూరగాయలు విషయంలో రేట్లు బాగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే రూ. 2, రూ. 5, రూ. 10 కూరగాయలు అందజేస్తాం. ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్‌లోనే ఉంటాయి. ఈరోజు 40 మెట్రిక్ టన్నుల కూరగాయలు తెచ్చాం. రేపు వీలైతే ఇంకా పెంచుతాం. సర్వస్వం కోల్పోయి ఏమి చేయాలో దిక్కోతోచని పరిస్థితుల్లో ఉన్నాం.
బట్టలు కూడా లేని పరిస్థితి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మోటారు వాహనాలు వంటివి పోవడం జరిగాయి. వీటన్నింటికీ ఏమి చేయాలో ఆలోచిస్తున్నాం. ఇదిలా ఉంటే బుడమేరుకు మూడు గండ్లు ఉంటే గుర్తించి, ఆరోజు సరిచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా తప్పుచేసిన వారిలో బాధ లేదు. బుడమేరు మొత్తం కబ్జాలు జరిగాయి. ఇవన్నీ కలిపి విజయవాడలో ఉన్నవారికి శాపంలా మారాయి.
సర్వం కోల్పోయి చిక్కుల్లో ఉన్నవారికి ఏ విధంగా సాయపడాలా అనేదానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాం. ఈ రోజు నేను వెళ్లినపుడు చూస్తే ఇక్కడ తెలుగుదేశం, ఎన్‌డీఏ ప్రభుత్వం ఉందన్న ఒక నమ్మకం వారి ముఖాల్లో కనిపిస్తుంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ.. ఈ ముగ్గురూ ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఒక విశ్వాసముంది.. ఒక నమ్మకముంది అని చెబుతున్నారు.
ఇంకోపక్క చూస్తే ఖజానా ఖాళీగా ఉంది. రూ. 10 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఎఫ్ఆర్‌బీఎం కూడా పర్మిట్ చేసే పరిస్థితి లేదు. అయినా సర్వశక్తులూ ఒడ్డుతున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేస్తున్నాం. సహాయం కోసం మొదటి రిపోర్టు రేపు ఉదయం వారికి పంపించి రిలీజ్ చేస్తాం.
సాయమందించడం సమష్టి బాధ్యత
రాష్ట్రంలో, బయట ఉన్నవారిని.. నాపైన, ఇక్కడి ప్రజలపై అభిమానమున్న వారిని ఒకటే కోరుతున్నాం. మీరు కూడా మీ సీఎస్ఆర్‌గానీ.. సొంత డబ్బులు ఉపయోగించి.. ప్రతి ఒక్కరూ ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాలని కోరుతున్నా. పెద్దఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వ్యక్తులు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు.. ఇలా ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు కూడా ముందుకు రావాలి.
సమాజం పట్ల బాధ్యతకలిగిన ప్రతిఒక్కరూ ముందుకురావాలని కోరుతున్నా. మీరు చేయగలిగింది చేయమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఇల్లూ నిలదొక్కుకోవాలంటే ఏమిచేయాలి? వ్యాపారస్థులు మళ్లీ నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? అనే దాన్ని ఆలోచిస్తున్నాం. ఇందుకు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రుణాలు రీషెడ్యూల్ చేసే విషయంపైనా వర్క్ చేస్తున్నాం.
ఆపదలో ఉన్నవారిని అందరం కలిసి ఆదుకోవాల్సిన అవసరముంది. బీమా కట్టిన ప్రతి ఒక్కరికీ సెటిల్‌మెంట్‌ను ఫాస్ట్ ట్రాక్‌లో చేస్తున్నాం. కొర్రీలు పెట్టకుండా అవసరమైతే ప్రభుత్వం నుంచి ఏమైనా క్లియరెన్స్‌లు ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్లు ఏమైనా అవసరమైతే ఇస్తాం.
ఇవన్నీ చేసి మళ్లీ విజయవాడలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. హుద్‌హుద్ సమయంలో విశాఖ తరహాలోనే విజయవాడను కూడా వరదలకు ముందు.. వరదలకు తర్వాత అని మాట్లాడుకునేలా తయారుచేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రజలను అందరికీ ఒకటే కోరుతున్నాం. ఇది రాజధానిలో భాగం.
ఇక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి నష్టం రాకుండా చూసుకునే బాధ్యత అందరిపైనా ఉంది. దీనికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అమలుచేస్తాం. ప్రకాశం బ్యారేజీని 15 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ చేసేలా మెరుగుపరిచే విషయమై ఆలోచిస్తున్నాం. ప్రాజెక్టును మెరుగుపరచడంపై కేంద్రంతో కూడా మాట్లాడుతున్నా.
ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితమవుతాం
శనివారం వినాయకచవితి జరుపుకుంటూనే ప్రజలకు సేవచేద్దాం. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితమవుతాం. ఇక్కడ కూడా వినాయకచవితిని జరుపుకుందాం. దీన్ని భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు