Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, అక్టోబర్ 13: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా సుపరిపాలనను ఇంటి ముంగిటకే అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు గ్రామంలో రూ.61.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్ లను ప్రవేశపెట్టి పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. పెన్షన్, బియ్యం కార్డులు, ఇళ్ళపట్టాలు, తాగునీటి సమస్యల పరిష్కారం, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ, భూ సమస్యలు, శిశు సంక్షేమం, డెయిరీ వంటి అనేక రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా అర్జీ పెట్టుకున్న 72 గంటల్లో అందజేస్తున్నామన్నారు.
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమన్నారు. సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సాగుకు సంబంధించిన అన్నిరకాల సేవలను అందిస్తున్నామన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. అనంతరం సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, ఎండీవో వెంకటరమణ, పంచాయతీరాజ్ ఏఈ సూరిబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చుక్కా నాగలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE