– కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
దావోస్: కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సిఇఓ ఎస్. రవికుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. రవికుమార్ తో భేటీ అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం.
విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించండి. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హైస్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ మాట్లాడుతూ… కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్న 80వేలమంది ఉద్యోగులను టైర్ -1 నుంచి టైర్ -2 నగరాలకు మార్చేందకు ప్రణాళికలను ప్రకటించాం. గ్లోబల్ స్కిల్ ఇనియేటివ్ లో భాగంగా జెనరేటివ్ ఎఐ అధునాతన సాంకేతిక నైపుణ్యాల్లో 10లక్షల మందికి సాధికారిత కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ తెలిపారు.