Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శివా ?పార్టీ నాయకుడివా ?

ప్రవీణ్ ప్రకాష్ పై ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవిరావు ధ్వజం

రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను పొగుడుతూ, సెప్టెంబర్ 4 తరువాత బడి బయట పిల్లలు ఉంటే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవిరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ఓ ఐఎఎస్ అధికారి మాదిరి కాకుండా తన వ్యాఖ్యలు, చర్యలతో వైకాపా పార్టీ నాయకుడి మాదిరి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వాలంటీర్లు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందుతూ కొందరు వైకాపా కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ బూతు వరకూ తీసుకొచ్చి వైకాపాకు ఓటు వెయ్యాలని, లేదంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని బెదిరించారని అన్నారు. దొంగ ఓట్లను చేర్చడంలోను, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారివి ఓట్లు తొలగించడంలోనూ కొందరు వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రవీణ్ ప్రకాష్ కు తెలీదా అని ప్రశ్నించారు.

బడి బయట పిల్లలు ఉంటే వారిని గుర్తించి బడిలో చేర్పించడంలో విద్యా శాఖ పరిధిలోని ఎందరో ఐఎఎస్ అధికార్లు, జిల్లా, మండల విద్యా శాఖాధికార్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిరంతరాయం కృషి చేసారని అన్నారు. వారి మాదిరిగానే ప్రవీణ్ ప్రకాష్ కృషి చేసి తన సమర్ధత నిరూపించుకోవాలని, తప్పితే సెప్టెంబర్ 4 తరువాత బడి బయట పిల్లలు వుంటే తన ఐఎఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తాను రాజకీయ నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నట్టుగా వుందని విమర్శించారు. రాత్రి వేళల్లో పిల్లలను, బడుల్నీ పర్యవేక్షిస్తూ ఉపాద్యాయులను, పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తు న్నారని ..ఫలితంగా ఉపాధ్యాయుల మరణ రేటు పెరగ డానికి, స్వచ్చంద పదవీ విరమణకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ప్రవీణ్ ప్రకాష్ తన దుందుడుకు వైఖరిని మార్చుకొని ముందు ఉపాద్యాయులను శత్రువులుగా కాకుండా మిత్రులుగా చూసే ధోరణి అలవరచుకోవాలని హితవు పలికారు.

గౌరవ ప్రదమైన ఉపాద్యాయవృత్తిని కించపరిచేలా ప్రవీణ్ ప్రకాష్ గారి చేష్టలు ఉన్నాయి. దాని వలన విద్యార్థులలో ఉపాద్యాయులపట్ల చులకన బావం ఏర్పడితే నైతిక విలువలు పూర్తిగా లేకుండా పోయి సమాజం అతిప్రమాదంలోపడిపోతుందన్నారు.టీచర్లు ప్రశాంతంగా పిల్లలకు విద్యా బుద్ధులు అలవర్చే రీతిన అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చూడాలని, తప్పితే వాళ్ళలో మానసిక సంఘర్షణ పెంచడం సబబు కాదని అన్నారు.

కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి కోవర్టులుగా పని చేయడంతో పాటు, గ్రామాల్లోని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికార పార్టీ అండతో రాజ్యాంగేతర శక్తిగా మారి సామాన్య ప్రజలని వేధిస్తున్న తీరును ప్రవీణ్ ప్రకాష్ గుర్తించాలని అన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 3లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టారని, వారిని ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఆపలేక పోయారని ప్రశ్నించారు.

ఎపిపిఎస్సీ ద్వారా నియమితులై చట్టబద్ధంగా ఏర్పడిన సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని, కాని వారికి తగిన బాధ్యతలు అప్పగించక మానవ వనరులను పూర్తిగా వినియోగించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు మూలమైన పంచాయితీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. రాజ్యాంగ, చట్టబద్ధ మైన పంచాయితీ, సచివాలయ వ్యవస్థలు వుండగా, వైకాపా కార్యకర్తల్లా ఉపయోగపడతారని పెంచి పోషిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ప్రశంసించడం ఎంతవరకూ సరైనదో ప్రవీణ్ ప్రకాష్ ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE