Suryaa.co.in

Telangana

జాతర భక్తులను వదలని కేసీఆర్ సర్కార్

– అదనపు పన్నుతో భక్తులను దోచుకుంటున్న ప్రభుత్వం
– ‘ఈవెంట్’ పర్మిట్లతో ప్రివిలేజ్ టాక్స్ వసూలు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాల ద్వారా అనేది జగమెరిగిన సత్యం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మద్యం ద్వారా ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం మేడారం సమ్మక్క జాతర
sarakka భక్తులను కూడా వొదలని వైనం గమనించాలి. దేశంలో కుంభ మేళా తర్వాత అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క జాతర. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరుగు నాలుగు రోజుల జాతరకు కోటి పైన వచ్చే భక్తుల నుండి అక్కడ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి.

ఈ మొత్తాన్ని అంచనా వేయడం అంత సులభం కూడా కాదు. కానీ కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వారం రోజుల ఈవెంట్ లైసెన్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ. 6.00 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే మేడారం జాతరలో అసలు విశేషం. నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుల చెల్లింపు, కోళ్లు, మేకల బలి, మద్యపాన సేవనం మేడారం జాతరలో భక్తుల ఆనవాయితీయే కాకుండా ఈ జాతర సంస్కృతి కూడాను.

ఈ సంస్కృతిని ఆసరాగా చేసుకుని తెలంగాణ ఆబ్కారీ శాఖ కోట్ల రూపాయాల ఆదాయాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. వారం రోజుల వ్యవధికి బ్రాండి షాపుల లైసెన్సుల మంజూరు ద్వారా,
sarakka1 బ్రాందీ, బీరు అమ్మకాల ద్వారా రూ. 6.00 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా ఎంచుకున్నట్లు సమాచారం. 2018 జాతరలో రూ. 3.00 కోట్ల ఆదాయం, 2020 జాతరలో రూ. 4.60 కోట్ల ఆదాయం లభించగా 3120 కేసుల బ్రాందీ, 11 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.

ఈసారి మరో కోటి పైన అదనపు ఆదాయాన్ని నిర్దేశించుకుని ఐదు వేల బ్రాందీ కేసులు, 15 వేల బీరు కేసులు అమ్మకాలు జరపాలని అందుకోసం ఆబ్కారీ శాఖ కసరత్తులు చేస్తుంది. దానిలో భాగంగా స్థానికంగా ఉన్న బ్రాందీ షాపులకు సరుకు సరఫరా నిలిపివేయడమే కాకుండా చుట్టుపక్కల మండలాల్లోని బ్రాందీ షాపుల నుండి భారీగా మద్యం రవాణా కాకుండా కట్టడి చేస్తున్నారు.

ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో సుస్థిర అభివృద్ధిని మరచిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్న మద్యం వ్యాపారాన్ని ఇక్కడ జాతర ప్రజల నుండి కూడా లాగడానికి వెనుకాడడడం లేదు. తెలంగాణ రాష్ట్రం నుండే గాక ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటకతో పాటు దేశ నలుమూలల నుండి కోటి మందికి పైగా భక్తులు రానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసీలకు 22 ఈవెంట్ పర్మిట్లు (లైసెన్స్) లను ఎక్సయిజ్ శాఖ జారీ చేసింది. మేడారంతో పాటు పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెం, కన్నెపల్లి, నార్లాపూర్, కొత్తూర్, ఊరట్టం, వెంగళాపూర్, జంపన్న వాగు తదితర ప్రాంతాల్లో ఈ బ్రాందీ షాపులు ఏర్పాటు చేసారు.

వారం రోజులు పాటు మాత్రమే అమలులో ఉండే ఈవెంట్ పర్మిట్లకు ఒక్కొక్క లైసెన్స్ కు రోజుకు తొమ్మిది వేల రూపాయల ఫీజు చొప్పున ఎక్సయిజ్ శాఖ వసూలు చేస్తున్నది. లైసెన్స్ పొందిన వారికి విక్రయ స్థలాలను కేటాయించినందుకు ఏటూరునాగారం ఐటీడీఏ ఒక్కో షాపునకు రూ. 17 వేల మొత్తాన్ని వసూలు చేసి లైసెన్స్ జారీ చేస్తోంది. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేయడానికి ఎక్సయిజ్ శాఖ వారు సమ్మక్క సారక్క తాడ్వాయి మండల కేంద్రంలో ఒక సబ్ డిపో ఏర్పాటు చేసి 20 కోట్ల మద్యం నిల్వలను అందుబాటులో ఉంచారు.

సమ్మక్క జాతరలో 1998 వరకు మద్యం షాపుల అమ్మకం లైసెన్స్ లు బహిరంగ వేలం ద్వారా కేటాయించేవారు. ఆదివాసీల జాతరలో బెల్లం (బంగారం), కొబ్బరికాయలు ఆదివాసీలే అమ్ముతున్నారని, మద్యం అమ్మకాల అవకాశం కూడా తమకే ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఆదివాసీల డిమాండ్ మేరకు 2000 సంవత్సరం జాతర నుండి ఆదివాసీలకే మద్యం షాపులు కేటాయిస్తున్నారు. ఆదివాసీ సంఘాలకు కేటాయించిన బెల్లం, కొబ్బరికాయ షాపులతో పాటు మద్యం షాపులను తమ అనుచరులకు పంపిణీ చేస్తుంటారు. అయితే ఆదివాసీలకు స్వతహాగా మద్యం వ్యాపారం చేసే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆదివాసీయేతరులు తెరవెనుక ఈ మద్యం దందాను నిర్వహిస్తున్నారు.

“ఆదివాసీ సంస్కృతి బుట్ట దాఖలు”
ఆదివాసీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో వారే మద్యం తయారు చేసుకొని సేవించే హక్కు కల్పించబడినది. 1994 లో సంవత్సరం జాతరలో రాష్ట్రంలో మధ్య నిషేధం ఉండడంతో పూజారులకు మద్యం అందించడం వీలు కాలేదు దాంతో వారు మద్యం సేవించనిదే మేము సమ్మక్కను గద్దె పైకి తీసుకురామని మొండికేసినారు. అప్పటి అధికారులు, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఆదివాసీ సంస్కృతిని, హక్కులను గుర్తించి వారు వారి అవసరాల కోసం మద్యం తయారు చేసుకోవచ్చని ప్రభుత్వం జి ఓ తీసినారు.

దీన్ని బట్టి చూసిన వారి సంస్కృతిని గమనించిన వారి ప్రాంతాల్లో ఆదివాసీలే మద్యం తయారు చేసుకోవాలని స్పష్టమవుతుంది. కాని ఆదివాసీల సంస్కృతి ని పక్కకు నెట్టిన తర్వాతి ప్రభుత్వాలు అదే ఆదివాసీలతో ప్రభుత్వ మద్యాన్ని అమ్మించి కోట్లు గడించడం అసలు రహస్యం. మా జాతరలో మద్యం అమ్మకాలపై మా వద్దే లైసన్స్ ఫీజు, అదనపు పన్నులు వసూలు చేయడం సరికాదని ఆదివాసీ సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్న ఫలితం శూన్యం. గుడ్ విల్ చెల్లించి ఆదివాసీయేతరులు లబ్ది పొందడం గత రెండు దశాబ్ధాలుగా ప్రతి జాతరలో జరుగుతూనే ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ మద్యం లావాదేవీల్లో ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలు, పూజారుల సంఘం, ఐటీడీఏ, పోలీసు, ఎక్సయిజ్ శాఖ వారు లబ్ది పొందుతున్నట్లు ప్రచారం ఉండగా, జాతరలో 20 ఏళ్లుగా మద్యం షాపుల నిర్వహణలో మద్యం వ్యాపారులు లాభాలు గడించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ఇక అసలు విషయానికి వస్తే ఈ మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వానికి రూ. 6.00 కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. బ్రాందీ, విస్కీ, బీరు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే రేట్లు, ఆ మద్యాన్ని ప్రభుత్వం మద్యం వ్యాపారులకు విక్రయించే రేట్ల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే మతి పోవాలసిందే. ప్రస్తుతం బ్రాందీ కంపెనీల నుండి ప్రభుత్వానికి సరఫరా చేసే రేట్లు ప్రభుత్వం బ్రాందీ షాపులకు అమ్మే రేట్లు పరిశీలిస్తే బోధపడుతుంది.

ఆఫీసర్స్ ఛాయిస్ బ్రాండ్ ఫుల్ బాటిల్ ను 61 రూపాయలకు ప్రభుత్వానికి మద్యం తయారీ కంపెనీ సరఫరా చేస్తే, దాన్ని 458 రూపాయలకు మద్యం షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తుండగా, ఇంపీరియల్ బ్లూ రకానికి చెందిన విస్కీ ఫుల్ బాటిల్ 76 రూపాయలకు తీసుకొని 541 కి మద్యం వ్యాపారులకు సరఫరా చేస్తోంది. రాయల్ స్టాగ్ విస్కీ ఫుల్ బాటిల్ 120 తీసుకొని 666 రూపాయలకు, బ్లెండర్స్ ప్రైడ్ విస్కీని 200 తీసుకొని 1000 రూపాయలకు, బీర్ 26 కి తీసుకొని 133 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. సరఫరా చేసే రేట్లపై 20 శాతం అదనపు రేటు కలిపి ఎం.ఆర్.పి గా నిర్ణయంచి రిటైల్ వైన్స్, బార్ లకు సరఫరా చేస్తారు. ఎం.ఆర్.పి ధర నిర్ణయించే సమయంలో కూడా రౌండ్ ఫిగర్ కోసం చాలా ధర వ్యత్యాసాన్ని ముద్రించి ఆ వ్యత్యాస సొమ్మును కూడా ప్రభుత్వమే దండుకుంటుంది.

ఈ ధరలన్ని సాధారణ మద్యం షాపులకు సంబంధించినవి మాత్రమే. కానీ మేడారం జాతరలో దీనికి అదనంగా 25.5 శాతం ప్రివిలేజ్ టాక్స్ కలిపి వసూలు చేస్తున్నారు. ఈవెంట్ లైసెన్సుల రెంటల్, అదనపు టాక్స్ చెల్లించే వ్యాపారస్తులు వారి లాభాన్ని కలుపుకొని విపరీత రేట్లకు మద్యం విక్రయాలు జరిపి జాతరకు వచ్చిన పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది జాతర వరకు పరిశీలిస్తే రూ. 50 లక్షల మద్యాన్ని కంపెనీల నుండి కొనుగోలు చేసి జాతరలో ఈవెంట్ లైసెన్స్ ల ద్వారా అమ్మకాలు జరిపి రూ. 6.00 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రభుత్వం గడిస్తుంది. గత జాతరలో రూ. 4.6 కోట్ల పైన మద్యం విక్రయాలు సాగగా ప్రభుత్వం రూ. 4.0 కోట్లు సంపాదించింది.

ప్రతి జాతరలో మద్యం ధరలు విపరీతంగా పెంచుతున్న కారణంగా అధిక ధరలను భరించలేక భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలు, పేదలు ఎక్కువగా వచ్చే మేడారం జాతరలో సాధారణం కన్నా ధరలను పెంచి మద్యం అమ్మడం సరికాదంటున్నారు. భక్తుల సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అదనపు పన్నులు విధించి పేద ప్రజలను దోచుకోవడం సరికాదని పలు సంఘాల నాయకులు పౌర సమాజం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091

LEAVE A RESPONSE