Suryaa.co.in

Andhra Pradesh

ఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం

  • నిత్యావసర సరుకుల కిట్లను ప్రతి బాధిత కుటుంబానికీ చేర్చే బాధ్యత తీసుకున్నాము
  • బాధితుల కష్టాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది
  • నిత్యావసరాలను ఇంటింటికీ చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా వివరాలు నమోదు చేసుకుని పంపిణీ
  • విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

‘గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఉగ్రరూపం దాల్చి విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలకు అపార నష్టం కలిగించింది. అంతటి విపత్తును ప్రభుత్వపరంగా నిర్విరామంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నాము. ప్రజలంతా సమష్టిగా, సమర్ధంగా ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ప్రభుత్వం తరఫున ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టాము’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం మీ వెంటుందన్న భరోసా కల్పించేందుకు, ప్రజల బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇదని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సాధారణ జీవన స్థితికి చేర్చే క్రమంలో ప్రభుత్వం తరఫు చేస్తున్న చిన్న కార్యక్రమం ఇదని తెలిపారు.

శుక్రవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచిత నిత్యావసర సరకులను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “వరదలు, వర్షాలు విజయవాడ నగరానికి అపార నష్టం కలిగించాయి. ప్రజలు గత ఆరు రోజులుగా ఈ విపత్తును ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యంత్రాంగం తక్షణం స్పందించి అద్భుతంగా సహాయక చర్యలు చేపట్టింది.

ప్రభుత్వంతో పాటు ఎంతో మంది పౌరులు సేవా భావంతో ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు అర్ధం చేసుకుని ప్రభుత్వంతో సహకరించారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, కందిపప్పు, వంటనూనె, రెండు కేజీల చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలు సరఫరా చేయాలని నిర్ణయించాం. వీటితో పాటు మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని ఐటమ్స్ ప్రజలకు అందచేస్తున్నాం.

1100 రేషన్ పంపిణీ వాహనాల ద్వారా అనేక జిల్లాల నుంచి యంత్రాంగం కదిలి వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ ఒక్క రోజులోనే 70 వేల మంది బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఉచిత కిట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ అందేలా ఏర్పాట్లు చేశాము. ఏ ఒక్క బాధితుడు మాకు సహాయం అందలేదు అన్న భావన కలగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలి.

వరదల కారణంగా ప్రజలు పడిన కష్టాన్ని, బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం. వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో సరుకులు తెప్పించాం. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేని వారికి కూడా మొబైల్ నంబర్, వివరాలు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించాం. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు సహకరించాలని కోరుతున్నాము. పండుగ పూట కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంద”ని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి వీరపాండ్యన్, ఆహార పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రతి వాహనం తనిఖీ చేసి..

అంతకు ముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన నిత్యావసర సరుకుల వాహనాలను మనోహర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లలో వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా అని లోడ్ చేసిన ప్రతి వాహనంలో చెక్ చేశారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాహన డ్రైవర్లకు, సిబ్బందిని ఆదేశించారు.

డ్వాక్రా మహిళల సేవలు అభినందనీయం

గొల్లపూడి మార్కెట్ యార్డులో నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యురాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి సేవలు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ప్యాకింగ్ చేయడం వారంతా పాలుపంచుకున్నారు. నాదెండ్ల మనోహర్  ఆ ప్రక్రియను పరిశీలించారు. ఈ విపత్తు సమయంలో డ్వాక్రా మహిళలు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.

LEAVE A RESPONSE