ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తక్షణమే వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి
• ఆర్థిక మంత్రి లేకుండా జరిగిన చర్చల్లో ఆర్థికపరమైన విషయాలు ఎలా కొలిక్కి వస్తాయో ఉద్యోగసంఘం నేతలే చెప్పాలి.
• ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ సబ్ కమిటీకి మధ్య జరిగిన చర్చలపై నిజంగా ఇరువర్గాలు సిగ్గుపడాలి.
• ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పేవరకు జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.21వేలకోట్లు చెల్లించాలనే విషయం వారికి కూడా తెలియదు.
• రూ.21వేల కోట్లలో మార్చి 31 నాటికి రూ.5,500కోట్లు ఇస్తామన్న మంత్రి బొత్స మాటలు ఎంతవరకు నమ్మొచ్చని ఉద్యోగసంఘం నేతలు ఆలోచించారా?
• నెలనెలా రూ.4వేలకోట్లు అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్న జగన్ రెడ్డి సర్కార్ ఒకేసారి రూ.5,500 కోట్లు చెల్లిస్తుందంటే ఉద్యోగ సంఘాలు ఎలా నమ్ముతున్నాయి?
• ఒకటో తేదీన జీతాలిస్తే చాలనే దుస్థితికి ఉద్యోగుల్ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం, వారి డిమాండ్లు పరిష్కరిస్తుందా?
• జగన్ సర్కార్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలి.
• ఫిబ్రవరి 29న రిటైరయ్యే బండి శ్రీనివాస్ ఉద్యోగుల పక్షాన తాను పోరాడతాను అనడం ఎంతవరకు కరెక్ట్?
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి ఉద్యోగసంఘాలు, ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ మధ్య జరిగిన చర్చలపై నిజంగా ఇరువైపుల వారు సిగ్గుపడాలని, సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డే చర్చలకు రాలేదని, మరోసభ్యుడైన మంత్రి ఆదిమూలపు సురేశ్ స్కైప్ ద్వారా 5 నిమిషాలు మాట్లాడి తప్పుకున్నారని, కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రమే చర్చల్లో పాల్గొని మమ అనిపించారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“ ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే 1వ తేదీన జీతాలు ఇవ్వాల ని. ఎరియర్స్, ఇతర బకాయిల చెల్లింపు కంటే జీతాలు ఒకటో తేదీన రావాలనే ఎక్కువశాతం ఉద్యోగులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం కచ్చితంగా ఉద్యో గులకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన సొమ్ముని ఫలానా సందర్బంలో, ఫలానా తేదీనాటికి ఇస్తామని ప్రభుత్వం చెప్పలే కపోవడం నిజంగా సిగ్గుచేటు. నిన్న జరిగిన చర్చల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి సత్య నారాయణ చెప్పిన లెక్కలపై ఉద్యోగులే అవాక్కయ్యారు.
జీ.పీ.ఎఫ్ అమౌంట్, టీఏ, డీఏలు, సీపీఎస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్, పీఆర్సీ ఎరియర్స్, డీఏ ఎరియర్స్ వంటి వన్నీ కలిపితే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.21 వేల కోట్లు చెల్లించాలి. అసలు అంతమొత్తం మార్చి 31నాటికి ఈ ప్రభుత్వం ఇస్తుందా? బొత్స సత్యనారాయణ కొన్ని అయితే తమప్రభుత్వం చెల్లి స్తుంది అన్నారు. ఆ కొన్నింట్లో జీపీఎఫ్ కు సంబంధించిన రూ.800 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఇన్సూరెన్స్ బకాయిలు రూ.300కోట్లు, ఉద్యోగు ల టీఏ, డీఏలు, పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవుల బకాయిలు రూ.500 కోట్లు, మెడికల్ బిల్లులు ఉన్నాయి.
అవన్నీ కలిపినా కూడా రూ.5,500 కోట్ల వరకు ఉన్నాయి. అసలు ఈప్రభుత్వం ముఖం చూసి ఎవరైనా సరే ఒక్క నెలలో రూ.5,500కోట్లు ఇస్తారా? డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి.. ఎలా వస్తాయో తెలియకుండా బొత్స మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని చెప్పడం ఏమిటి? అలానే డీఏ ఎరియర్స్ 7 వాయిదాల్లో చెల్లిస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా? ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి తక్షణమే పూర్తి సమాచారంతో శ్వేతపత్రం ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయి పెట్టిందో తెలుస్తుంది.
జగన్ సర్కార్ చెల్లించాల్సిన ఉద్యోగుల బకాయిల్ని తర్వాత రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందనే గ్యారెంటీ లేదు నెలనెలా జీతాలకోసం అప్పులు తీసుకొచ్చే జగన్ సర్కార్ మార్చి 31కి ఉద్యోగులకు రూ.5,500కోట్లు చెల్లిస్తుందా?
జగన్ సర్కార్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.21వేలకోట్లు వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుందా అంటే..గ్యారెంటీ లేదు. గతంలో టీడీపీప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై జగన్ రెడ్డి మాట్లాడుతూ, ఆ ప్రభుత్వం చెల్లించాల్సింది వాళ్లే చెల్లించు కోవాలి .. మాకేం సంబంధంలేదు అన్నాడు. మరిప్పుడు జగన్ రెడ్డి సర్కార్ ఉద్యోగులకు బకాయిపెట్టిన సొమ్ముని వచ్చే ప్రభుత్వం మాత్రం ఎలా చెల్లిస్తుంది? ఉద్యోగుల బకాయిలే కాదు.. కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల బకాయిలు సహా అన్ని బకాయిలు చెల్లించాకే జగన్ రెడ్డి మాట్లాడాలి.
ఉద్యోగుల డీఏ ఎరియర్స్ అనేవి కేంద్రప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఇవ్వడంలేదు. సీపీఎస్ కింద ఉద్యోగుల సొమ్ము 10శాతం చెల్లిస్తే, ప్రభుత్వం తరుపున 10శాతం చెల్లించాల్సిన సొమ్ము రూ.2,200కోట్లు ఉంది. ఆ మొత్తం వెంటనే ఉద్యోగుల అకౌంట్లలో పడకపోతే వారి భవిష్యత్ ఏంటి?
ఇన్ని బాకీలు..ఇంత పెద్ద మొత్తం బకాయిలు చెల్లించకుండా జగన్ సర్కార్ తప్పించుకొని వెళ్లిపోతే తరువాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు చెల్లిస్తాయి? ఏ నెలకు ఆ నెల రూ.4వేలకోట్లు అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్న జగన్ రెడ్డి సర్కార్ వచ్చే నెలాఖరునాటికి రూ.5,500 కోట్లు చెల్లిస్తుందని చెబితే ఉద్యోగ సంఘాలు ఎలా నమ్ముతున్నాయి?
ప్రభుత్వం చెప్పే మాటల్లో ఎంతనిజాయితీ ఉందో ఉద్యోగ సంఘం నేతలు ఆలోచించుకోవాలి
నిన్న జరిగిన చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక మాటన్నారు. పీకమీద కత్తిపెడే పనులు కావు అని. అలా ప్రభుత్వానికి పీకపై కత్తిపెట్టి ఏదైనా ఒక పీఆర్సీ నియామకమో, ఐఆర్ చెల్లింపులో సాధించుకుంటే మంచిది. ఉద్యోగ సంఘనేతలకు ఒక విన్నపం. ప్రభుత్వం చెప్పే దానిలో నిజాయితీ ఎంత ఉందో ఆలోచించాలి. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలుఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం వచ్చే నెలాఖరునాటికి రూ.5,500కోట్లు ఇస్తుందని చెబితే నమ్మడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.
సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని నమ్మి మునిగిపోయి నట్టే, ఇప్పుడు కూడా ఈప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగులు మోసపోవాలా అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం పోతే…తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ చేస్తుంది అనేది అసందర్భమే. ఉద్యోగసంఘాలు ప్రభుత్వంతో పోరాడే విధానం అయితే ఇదికాదు. జేఏసీ ఛైర్మన్ నేత బండి శ్రీనివాస్ ఫిబ్రవరి 29న రిటైర్ అవుతున్నారు. 16 రోజుల్లో రిటైరయ్యే వ్యక్తి చేసే ఉద్యమంలో ఎంత మాత్రం నిజాయితీ ఉంటుంది. అలాంటి వ్యక్తిని నమ్మి ఉద్యోగులు ఆయన వెంట నడవాలా?
16రోజుల్లో రిటైరయ్యే వ్యక్తి రూ.21వేల కోట్ల డిమాండ్లను సాధిస్తామని చెప్పడం ఎలాంటి వైఖరో ఉద్యోగులే ఆలోచించుకోవాలి. బండి శ్రీనివాస్ కు.. బొత్స సత్యనారాయణ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సాధారణ ఉద్యోగులు, వారి కటుంబసభ్యుల పరిస్థితే దారుణంగా ఉంటుంది. ఇలాంటి కల్లబొల్లి మాటలతో ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు.
ఆర్థికమంత్రి లేకుండా ఆర్థిక పరమైన చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలపై మిగతావారి మాటల్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకోగలం?
ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న ప్రభుత్వం తరుపున ఏర్పాటైన సబ్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆర్థిక శాఖ మంత్రి లేకుండా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై మిగతావారు చెప్పే మాటలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకోగలం. సజ్జల గానీ, ఇతరులు గానీ ఎవరూ ఉద్యోగుల పక్షాన మాట్లాడలేదు. బొత్ససత్యనారాయణ చివరిగా మరలా కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేశారు.
డబ్బుకు సంబంధించిన వ్యవహారాలపై ఏం మాట్లాడతారు? తాము చేపట్టే ఉద్యమాల్ని ఉద్యోగసంఘం నేతలు ఒక ప్రహసనంగా మారుస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో కూడా ఉంది. గతంలో పీఆర్సీ అప్పుడు ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది. అలానే ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లపై కూడా ప్రభుత్వం కచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ మాటలు..చేతల ద్వారా వారి నిజాయితీని నిరూపించుకోవాలి. ఛాయ్ బిస్కట్ల చర్చలాగా ఏదో మాట్లాడాం అనడం సరైన పద్ధతి కాదు. నిరర్థకమైన ప్రయోగాలతో ఉద్యోగుల్ని నష్టపెట్టవద్దు ” అని అశోక్ బాబు హితవు పలికారు