అంగన్ వాడీ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వానికి ఇంత బాధ్యరాహిత్యమా?

-జగన్ రెడ్డి మోసపు హామీలు.. మంత్రుల మొక్కుబడి చర్చలు..
• అంగన్ వాడీ సిబ్బంది సమ్మెపై ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదు
• మంత్రి బొత్స, సకల శాఖల మంత్రి సజ్జల అంగన్ వాడీ సిబ్బందితో తూతూమంత్రంగా చర్చలు జరపడం బాధాకరం
• ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామంటున్న ప్రభుత్వ మాటలు.. అంగన్ వాడీ సిబ్బందికి జగన్ ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయడం కాదా?
• లక్షకు పైగా అంగన్ వాడీ సిబ్బంది రోడ్లపై కూర్చొని గొంతెత్తి అరుస్తుంటే స్పందించి, వారితో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?
• మంత్రి ఉష శ్రీ చరణ్ తన శాఖను విస్మరించి, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు గ్రానైట్, ఇసుక, మద్యం దోపిడీల్లో మునిగి తేలుతున్నారు
• జగన్ రెడ్డి తక్షణం స్పందించి, అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
• లేకుంటే వారితో పాటు ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన యానిమేటర్స్, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లతో పాటు ఇతర విభాగాల అసంతృప్తి, ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది
– టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

నాలుగేళ్ల 8 నెలల పాలనలో ఏనాడూ జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు, అంగన్ వాడీ కేంద్రాల్ని పట్టించుకోలేదని, అబద్ధాలు..మోసాలతో అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలను వంచించి అధికారంలోకి వచ్చిన జగన్, 16 రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నా కళ్లుండి చూడలేని దుస్థితిలో ఉన్నాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్ వాడీ అక్కచెల్లెమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన జగన్ రెడ్డికి, నేడు తమ కుటుంబాలు, పిల్లలను వదిలే సి రోడ్లపైకివచ్చి, నిరసన తెలియచేస్తూ, గొంతెత్తి నినదిస్తున్నఆడబిడ్డలు, వారి వేదనా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నాం. జగన్ ను నమ్మిన పాపానికి అంగన్ వాడీ సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, వాలంటీర్లు సహా దాదాపు 4లక్షల పైచిలుకు నేడు రోడ్లపైకి వచ్చి, తమ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రికి చీమకుట్టి నట్టు కూడా లేదు.

అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోంది అనడానికి మంత్రి బొత్స, సకల శాఖల మంత్రి సజ్జల వ్యాఖ్యలే నిదర్శనం
అంగన్ వాడీ సిబ్బందితో ప్రభుత్వం తూతూమంత్రంగా చర్చలు జరుపుతోంది. నిజంగా రోడ్లెక్కిన వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, సకల శాఖల మంత్రి సజ్జల నిన్న అంగన్ వాడీ విభాగంతో జరిపిన చర్చలు కేవలం మొక్కుబడిగా జరిపినట్టున్నాయి. అంగన్ వాడీ సిబ్బంది డిమాండ్లపై స్పందిస్తూ … “మీ డిమాండ్లు నెరవేర్చడం కుదరదని, తరువాత చూద్దామని, సంక్రాంతి తర్వాత మాట్లాడదామని, ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామని” చెప్పడం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందో అర్థమవుతోంది.

మరలా మీ ప్రభుత్వమే వస్తుందని కలలు గంటున్నారా అని బొత్సను, సజ్జలను ప్రశ్నిస్తున్నాం. అసలు స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి లేకుండా అంగన్ వాడీ సిబ్బందితో మంత్రి బొత్స, సజ్జల ఏం చర్చలు జరిపారు? అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు.. బాధలు కూడా పట్టించుకునేంత తీరికలేకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? నిద్రాహారాలు లేకుండా అంగన్ వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె గురించి ముఖ్యమంత్రికి తెలియదని మంత్రి బొత్స చెప్పడం నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం.

16 రోజులుగా అంగన్ వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? సంబంధిత శాఖా మంత్రి ఏం చేస్తున్నారు? 16 రోజుల్లో ఒక్కరోజు కూడా ఆమె అంగన్ వాడీ సిబ్బందితో ఎందుకు మాట్లాడ లేదు. మంత్రి పదవి దొరికిందని.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా మంత్రి ఉషశ్రీ చరణ్ మద్యం, గ్రానైట్, ఇసుక దోపిడీల్లో మునిగితేలుతూ, ప్రజలసొమ్ము కొల్లగొట్టే పనిలో తీరిక లేకుండా గడుపుతున్నారు.

సాక్షి మీడియాలో దుష్ప్రచారం తప్ప.. ఇప్పటివరకు జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బందికి ఒరగబెట్టిందేమీ లేదు
అంగన్ వాడీ సిబ్బందిపై జగన్ రెడ్డి ఎందుకు ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తు న్నారో సమాధానం చెప్పాలి. సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేసుకోవడం తప్ప అంగన్ వాడీ సిబ్బందికి ముఖ్యమంత్రి ఏం ఒరగబెట్టింది లేదు. చంద్రబాబు నాయుడు అంగన్ వాడీ కార్యకర్తల జీతాన్ని రూ.4,000 నుంచి రూ.10,500ల కు పెంచారు. గత ప్రభుత్వం చేసిన సాయాన్ని తానే చేసినట్టు ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడం నిజంగా ఆయన దిగజారుడుతనమనే చెప్పాలి. తాను అధికారం లోకి వచ్చాక కేవలం రూ.1000లు పెంచిన జగన్ రెడ్డి, మొత్తం అంగన్ వాడీ సిబ్బందిని తానే ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడు.

అంగన్ వాడీ సిబ్బంది సమ్మె చేపడితే వారిని భయభ్రాంతులకు గురిచేసి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సచివాలయ సిబ్బంది, యానిమేటర్స్, వాలంటీర్లతో అంగన్ వాడీ కేంద్రాలు నడిపేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరైందేనా? సమ్మె చేస్తున్నవారితో సంప్రదింపులు జరపకుండా, నియంత్రత్వధోరణితో ముందుకెళతారా? తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ, సకల భోగాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి, అంగన్ వాడీ సిబ్బందికి గతంలో ఇచ్చిన హామీలు గుర్తులేవా? వారేమైనా తాడేపల్లి ప్యాలెస్ రాసివ్వమనో, తన ఆస్తులు రాసివ్వమనో ముఖ్యమంత్రిని కోరారా? తెలంగాణ కంటే ఎక్కువగా జీతాలు పెంచి, గ్రాట్యుటీ అమలుచేస్తామని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని గతంలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం కూడా తప్పేనా?

చంద్రబాబు హాయాంలో అంగన్ వాడీ సిబ్బందికి వర్తించిన ప్రభుత్వ పథకాలు.. జగన్ రెడ్డి పాలనలో ఎందుకు వర్తించడంలేదు?
చంద్రబాబునాయుడి హాయాంలో అంగన్ వాడీ సిబ్బందిని ప్రతి ప్రభుత్వ పథకం వర్తించింది. జగన్ పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా అందకుండా చేశారు. కేవలం నెలకు రూ.1000లు పెంచి, సంవత్సరానికి రూ.12వేలు ఇస్తూ, అంగన్ వాడీ సిబ్బందిని అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హుల్ని చేస్తే వారెలా బతకాలి? సకాలంలో వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుంటే అంగన్ వాడీ కేంద్రాల విద్యుత్ బిల్లులు ఎలా కడతారు? కేంద్రాలను ఎలా నిర్వహిస్తారు? చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం, ఇతర సేవలు ఎలా అందిస్తారు? ఇవన్నీ చాలవన్నట్లు జగన్ రెడ్డిని అండతో పేట్రేగుతున్న వైసీపీనేతలు, కార్యక ర్తలు అంగన్ వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు.

తమకు ఎదురవు తున్న వేధింపులపై నోరెత్తలేని స్థితిలో అంగన్ వాడీ సిబ్బంది భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా బయటకొచ్చి జరిగిన అన్యాయం చెప్పకుంటే వారికి ఎలాంటి న్యాయం దక్కడంలేదు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో స్థానిక ఎంపీటీసీ అంగన్ వాడీ కార్యకర్తను వేధిస్తుంటే, ఆమె పోలీసుల్ని ఆశ్రయిస్తే, చివరకు ఆమెనే బెదిరించే స్థాయికి వచ్చారు. ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన సాయం ఏదీ అందించకపోగా..ఈ విధంగా వైసీపీ కామాంధుల వేధింపులు తట్టుకొని అంగన్ వాడీ సిబ్బంది ఎలా బతకాలి..ఎలా పనిచేయాలి?

నా అక్కచెల్లెమ్మలు అంటూ కబుర్లు చెప్పకుండా జనాల్లోకి వస్తే, ఆడబిడ్డలు, ముఖ్యంగా అంగన్ వాడీ సిబ్బంది పడే బాధ ఏమిటో జగన్ రెడ్డికి తెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అంగన్ వాడీ సిబ్బంది న్యాయబద్ధమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కరిస్తుంది.” అని ఆచంట సునీత హామీ ఇచ్చారు.

Leave a Reply