కృతజ్ఞత

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు, ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతణ్ణి శాంతపరుస్తాడు. ఆ సందర్భంలోనే ధర్మరాజు అడుగుతాడు. ఆశ్రయం ఇచ్చినవాని యెడల, ఆశ్రయం పొందినవాడు ఎలా నడచుకోవాలి అని! సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.

పూర్వం కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి, విషం పులిమిన బాణాన్ని లేడి మీదకు సంధించి వదిలాడు. అది గురి తప్పి, పూవులు కాయలతో పెరిగిన పెద్ద చెట్టును తాకింది. విషపు బాణం దెబ్బకు ఆ చెట్టు ఎండి మోడైపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక ఎప్పటి నుండో నివాసం ఉంటోంది. అది ఆ చెట్టును విడిచిపెట్టి పోకుండా, ఆ చెట్టు తొర్రలోనే కృతజ్ఞతతో ఉండి పోయింది.

చిలుక ఉదాత్త వైఖరిని ఇంద్రుడు తెలుసుకొన్నాడు. మనిషిగా రూపం మార్చుకొని, “ఈ అడవిలో గొప్ప గొప్ప వృక్షాలు, పూలు, ఫలాలతో అనేకం ఉన్నాయి. వాటిని ఆశ్రయించక, మోడువారిన ఈ చెట్టునే ఆశ్రయించుకొని ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు. అందుకా చిలుక “పండ్లు కాస్తున్నప్పుడు చెట్టును ఆశ్రయించుకొని ఉండి, ఎండిపోయి నప్పుడు వదిలిపోవటం కృతఘ్నత అనిపించుకోదా ఇంద్రా?’ అన్నది. పూర్వ జన్మలో ఈ చిలుక చేసుకొన్న పుణ్యంవల్ల గదా, మారు వేషంలో ఉన్న తనను గుర్తించగలిగింది అని ఇంద్రుడు. ఆశ్చర్యపడ్డాడు.

చిలుకతో ఏదైనా వరం కోరుకో అంటాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన వృక్షానికి పూర్వపు శోభను తిరిగి కలిగించమని వేడుకొంది. సరే అని ఇంద్రుడు చెట్టు వేళ్ళను . అమృతంతో తడిపి పూలు, పండ్లతో పూర్వం కంటే ఎక్కువ శోభను కలిగించాడు. తను చేసిన మంచి పనికి, ఆ చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకొంది.

చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతాభావం మెచ్చుకోదగ్గవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకొని జీవించిన సంగతి చిలుక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మరచిపోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కథలో చిలుక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంది.

– దీవి సుబ్బారావు

Leave a Reply