– చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఆసుపత్రికి వెళ్లే వృద్ధుల వరకు మేలు చేకూరింది
– సూపర్ జీఎస్టీ-సూపర్ సేవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
– లైబ్రరీ భవనం ప్రారంభం, అన్న క్యాంటీన్ నిర్మాణ పనుల పరిశీలన
రాప్తాడు: జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం పడిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రభుత్వానికి ఇంత భారం అయినప్పటికీ ప్రజల కోసం దీనిని అమలు చేసినట్లు చెప్పారు. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా ఆమె రాప్తాడులోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాల్మీకి జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు జీఎస్టీ పై వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే సునీత బహుమతులు అందజేశారు. పాఠశాలలో విద్యార్థులందరికి సొంత ఖర్చులతో నోటు పుస్తకాలు అందజేశారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణంలో 80 లక్షలతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో అదనపు గదుల నిర్మాణం ఇతర వాటి గురించి ఉపాధ్యాయులు ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకురాగా వాటన్నిటిని త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి తెలుసుకోవాలన్నారు. జీఎస్టీ పై చక్కగా అందరికీ వివరించే విధంగా విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారన్నారు. జీఎస్టీ గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న కారణంగా ప్రజలపై భారం పడుతుందని భావించి రెండు స్లాబులకు తగ్గించారన్నారు. దీనివలన చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఆసుపత్రికి వెళ్లే వృద్ధుల వరకు అన్ని వర్గాల వారికి మేలు జరిగిందన్నారు.
చాలా వాటి మీద ధరలు కూడా తగ్గాయన్నారు. రాప్తాడు సమీపంలోని పండమేరు వంక వద్ద కోటి 60 లక్షల రూపాయలతో పార్కు నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో రాప్తాడు మండలం కేంద్రం ఉండే విధంగా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె రాప్తాడులో నూతనంగా నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. పనులు వేగవంతంగా చేయాలని.. త్వరలోనే ఇక్కడ క్యాంటీన్ ప్రారంభం కావాలని ఆమె కాంట్రాక్టర్లకు సూచించారు.