చేతులు కట్టుకుని చేవ చచ్చి బ్రతకవద్దు

0
50

-సిఐడి పోలీసులపై ఒక్కరైనా కేసు వేశారా?
-మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఐ పీ సీ 153 ఏ కింద కేసు నమోదు చేస్తారా?
-సునీల్ కుమార్ ను తప్పించాలని డిఓపిటి కార్యదర్శి కి లేఖలు రాస్తా
-సునీల్ కుమార్ పై తెలంగాణ సిఐడి పోలీసులు గృహహింస కేసు నమోదు
-కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తా
-సుప్రీం మార్గదర్శకాలను తుంగలో తొక్కి, 41ఏ నోటీసు ఇవ్వకుండానే అరెస్టులా?
-ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినంత మాత్రాన, ఏమైనా జాతులు, కులాల మధ్య ఘర్షణ జరిగిందా?
-జగన్ జీవితకాల అధ్యక్ష పదవిపై ఫిర్యాదు చేసింది నేనే
-సీఐడీ తీరుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫైర్

ఎంతోమందిపై సిఐడి పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారని, 41 ఏ, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని కోర్టులు కూడా తప్పుపట్టాయని, అయినా సిఐడి పోలీసులపై ఒక్కరైనా కేసు వేశారా? అంటూ నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాను సిఐడి పోలీసులపై కోర్టులో కేసు వేశానని, విచారణ ఆలస్యం అయ్యిందని… కానీ ఏదో ఒక రోజు విచారణ మాత్రం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క సిఐడి పోలీసుల బాధితులు కోర్టులను ఆశ్రయించి కేసులు వేయాలని, ఏదో ఒక రోజు విచారణకు వస్తాయన్నారు. అంతేకానీ చేతులు కట్టుకొని, చేవ చచ్చు బతకవద్దని సూచించారు. జర్నలిస్టులు సైతం, తమ తోటి జర్నలిస్ట్ అంకబాబును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు.

రాష్ట్ర ప్రజలను ఏపీ సిఐడి పోలీసుల బారి నుంచి కాపాడాలని కోరుతూ, ఏపీ సిఐడి చీఫ్ గా వ్యవహరిస్తున్న సునీల్ కుమార్ ను తక్షణమే తప్పించాలని డిఓపిటి కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, హోం మంత్రిత్వ కార్యదర్శి లేఖలు రాస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సునీల్ కుమార్ వ్యవహార శైలిపై ఇప్పటికే తాను 10కి పైగా లేఖలు రాశానని, అయినా ఆయన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటున్నారన్నారు. సునీల్ కుమార్ పై తెలంగాణ సిఐడి పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారని, ఆయన భార్య, మామలు కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఇతరుల ప్రాణాలను బలి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఒక వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ను మరొక గ్రూప్ కు ఫార్వర్డ్ చేస్తే, ఐపిసి 153 ఏ, కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినంత మాత్రాన, ఏమైనా జాతులు, కులాల మధ్య ఘర్షణ జరిగిందా? అంటూ ప్రశ్నించారు. కులాలు, జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై, ఐపిసి 153 ఏ, కింద కేసు నమోదు చేస్తారన్నారు.. కానీ ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు మాత్రం… ఒక గ్రూపులో వచ్చిన మెసేజ్ ను, మరొక గ్రూపులోకి ఫార్వర్డ్ చేసిన సీనియర్ జర్నలిస్ట్, వయోవృద్ధుడు అయిన అంకబాబు పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అంకబాబు గతంలో ఉదయం తెలుగు దినపత్రికలో పనిచేశారని, ఆయన కంటే తక్కువ హోదాలో సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పనిచేశారని పేర్కొన్నారు. ఈనాడు దినపత్రిక లోను పని చేసిన అంకబాబు, ప్రస్తుతం రిటైర్డ్ అయి ఇంటి వద్ద విశ్రాంతిని తీసుకుంటున్నారన్నారు. జర్నలిస్టుగా తనకున్న పరిచయాలతో వివిధ వాట్సాప్ గ్రూపులలో సభ్యుడిగా ఉన్న ఆయన, టైం టూ టైమ్ అనే వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సందేశాన్ని, మరొక గ్రూపుకు ఫార్వర్డ్ చేసినందుకు అంకబాబుపై సిఐడి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు.

అంకబాబు ను కనీసం చొక్కా కూడా పూర్తిగా వేసుకొనివ్వకుండా, లాక్కెళ్ళి జీపులో కూర్చోబెట్టారని ఆయన శ్రీమతి చెప్పిన విషయం విని బాధనిపించిందన్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ( డి ఆర్ ఐ )కు వచ్చిన సమాచారం మేరకు , దుబాయి నుంచి బంగారం తెచ్చి విక్రయించే స్వరూపారాణిని డి ఆర్ ఐ అదుపులోకి తీసుకుందని చెప్పారు . అయితే మూడు రోజుల తర్వాత నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి వీలు లేకుండా వెయ్యి రూపాయల విలువైన బంగారాన్ని తక్కువ గా తీసుకువచ్చిందన్న కారణంగా ఆమెపై బెయిల బుల్ కేసు నమోదు చేసి విడిచి పెట్టారన్నారు. అయితే ఆమె అదుపులోకి తీసుకోగానే, ఓ పెద్దమనిషి ఆఫీస్ నుండి, డి ఆర్ ఐ అధికారులకు ఫోన్లు వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు.

41 ఏ నోటీసులు ఇవ్వరా?
వివిధ ఐ పీ సీ సెక్షన్ల కింద ఒక వ్యక్తి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడానికి ముందు అతనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41 ఏ నోటీస్ కచ్చితంగా ఇచ్చి తీరాలన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కానీ ఏపీ సిఐడి పోలీసులు ఈ నిబంధనను పాటించడం లేదని ఆయన విమర్శించారు . జర్నలిస్ట్ అంకబాబుపై నమోదు చేసిన ఐ పీ సీ 153 ఏ, 120 బి, 505 సెక్షన్లు అన్ని కూడా 41 ఏ నోటీసు నిబంధనల కిందకే వస్తాయని అన్నారు. 41ఏ నోటీసులను ఇవ్వకుండా, జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తీసుకు వచ్చిన వారిని మెజిస్ట్రేట్ లు రిమాండ్ కు పంపడం పట్ల, హైకోర్టు సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ… అరెస్టుకు ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించిందన్నారు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ, ఏపీ సీఐడీ పోలీసుల ధమనకాండను ఖండించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా, సిఐడి పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సిఐడి పోలీసుల చర్యలపై న్యాయస్థానాలలో ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేయాలని, హైకోర్టును సైతం ఆశ్రయించి… సిఐడి పోలీసులు ఇలాంటి దుశ్చర్యల పాల్పడకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలు సైతం విసిగిపోయే విధంగా, ప్రైవేటు కంప్లైంట్లను దాఖలు చేస్తూ, సిఐడి పోలీసుల దుశ్చర్యలను ఎండ గట్టాలని పిలుపునిచ్చారు.

బుద్ధి ఉన్నా భయపడతారా?
సీనియర్ జర్నలిస్ట్ అయిన అంకబాబు అరెస్టును జర్నలిస్ట్ సంఘాల నేతలు, జర్నలిస్టులు ఖండించకపోవడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు బుద్ధిమంతులేనని… అయితే బుద్ధి ఉన్న, బుద్దిని భయం ఆక్రమించేసిందని, అందుకే తోటి జర్నలిస్టు అరెస్టు ని సైతం జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఖండించ లేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు . నిప్పులా బతికిన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును అకారణంగా అరెస్టు చేసి, కనీసం మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరు పరచక పోవడాన్ని జర్నలిస్ట్ సంఘాల నేతలు, పత్రికా, మీడియా సంస్థలు ఎందుకని ప్రశ్నించలేకపోయాయని అసహనాన్ని వ్యక్తం చేశారు.

కుప్పం కాదు… పులివెందులపై ఫోకస్ చేయి
అభివృద్ధి చెందిన కుప్పం నియోజకవర్గంపై కాదని, పులివెందులపై ఫోకస్ చేయాలనీ జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. పులివెందులలో కనీసం బస్టాండ్ కూడా లేదని, కడప జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ బకాయిలను చెల్లించలేదన్న కారణంగా మునిసిపల్ కమిషనర్, బస్సులను… బస్టాండ్ లోకి రాకుండా గేట్లు మూసి వేశారన్నారు. పులివెందులలో బస్టాండ్ నిర్మాణానికి, జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ను తెరిపించేందుకు ముందు కృషి చేయాలని సూచించారు.

కన్నతల్లికి అన్నం పెట్ట లేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు, పులివెందుల అభివృద్ధి కోసం పని చేయలేని జగన్మోహన్ రెడ్డి, కుప్పం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పంలో రోడ్లు గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల బాగానే ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా, వాటిని తొవ్వి రోడ్డు మధ్య లో బారికేడ్ల ను నిర్మించారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రోడ్లకు అడ్డంగా బారి కేడ్ల ను నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా పాఠశాలలను మూసివేసి, రాష్ట్ర నలుమూలల నుంచి స్కూల్ బస్సులలో ప్రజలను కుప్పంకు తరలించారన్నారు. కుప్పం ప్రజలను ఇళ్లల్లో బంధించి, ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ద్వారా సాధించింది ఏమిటని నిలదీశారు.

సీఈసీకి ఫిర్యాదు చేసింది నేనే…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసింది తానేనని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. జూలై 11వ తేదీన నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పత్రికలలో వచ్చిన ప్రకటనలను, మీడియా క్లిప్పింగులను అందజేశానని తెలిపారు. తన ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, తమ పార్టీ పెద్దలను వివరణ కోరిందని తెలిపారు.. జీవితకాల అధ్యక్షుని ఎన్నిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అందుకే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా, తాను అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నీ జీవితకాల అధ్యక్షునిగా ఎన్నుకున్నామని, కానీ ఆయన అంగీకరించలేదని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనపై రఘురామ స్పందిస్తూ, అదే విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా మరొక అబద్ధాన్ని చెప్పడం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. జీవిత కాలం అంటే ఐదేళ్లు కాదు కదా అంటూ రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. సాక్షి పేపర్ రాసింది కూడా తప్పని, తాను మాట్లాడింది కూడా తప్పేనని అంగీకరిస్తూ… అబద్ధం చెబితే సరిపోతుందన్నారు. ఒకవేళ నిజం చెబితే మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు పెట్టవలసి వస్తుందన్నారు. తాను అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయవలసి వస్తుందన్నారు.

ఎన్టీఆర్ లౌక్యం ప్రదర్శించారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ లౌక్యాన్ని ప్రదర్శించారని, ప్రస్తుత పరిస్థితులలో లౌక్యం ఎంతో అవసరం అని రఘురామకృష్ణంరాజు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారి రామ్ సింగ్ కడప కు వెళ్లడం శుభ పరిణామం అని పేర్కొన్న ఆయన, ఈ కేసు విచారణలో భాగంగా విజయ్ సాయి రెడ్డిని కూడా ప్రశ్నించాలన్నారు. త్వరలోనే డాక్టర్ సునీతా రెడ్డికి న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.