* విజయవాడ-గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం
* రోడ్డు ప్రమాద బాధితుడికి సపర్యాలు చేసిన మంత్రి
* తన ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆసుపత్రికి తరలింపు
* మంత్రి సవిత స్పందించిన తీరుపై ప్రశంసల వెల్లువ
గుంటూరు/తాడేపల్లి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు. అధికార దర్పం కంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయస్థితిలో పడివున్న వృద్ధుని లేపి, సపర్యాలు చేశారు. తన కాన్వాయ్ లోని వాహనంలోకి ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు, పాదాచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి, తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు. క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ-గుంటూరు హైవేపై వడ్డేశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెలుతున్నాడు. తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెలుతున్న వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అదే సమయంలో అటుగా వెలుతున్న మంత్రి సవిత…తన కాన్వాయ్ ను ఆపి, వృద్ధుడికి నీరు తాగించి సపర్యాలు చేశారు.108 వాహనం వచ్చే వరకూ ఆగకుండా, కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కార్ట్ వాహనంలో సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైపై ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి వాహనదారులు, పాదాచారులు కొనియాడారు. గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు.