Suryaa.co.in

Andhra Pradesh

హామీ మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు?

* అశాస్త్రీయ, అసంబద్ధ విభజనతో అన్యాయం
* పుంగనూరు కలుపుతూ మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయండి
* అన్నమయ్య జిల్లాలో కలిపి ఉపయోగం ఉండదు
* సీఎం చంద్రబాబుకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేఖ

అమరావతి: ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగదని, ప్రజల్లో విశ్వసనీయత పొందలేరని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు మదనపల్లె జిల్లా ఏర్పాటు అవసరం, గత హామీని గుర్తు చేస్తూ ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. పుంగనూరు నియోజకవర్గంలోని అయిదు మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జిల్లాల విభజనలో జరిగిన అన్యాయం మొత్తం ఈ లేఖలో ఆర్సీవై పేర్కొన్నారు.

లేఖ మొత్తం ఇదే…

గౌరవ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు..
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి..

విషయం: మదనపల్లె జిల్లా ఏర్పాటు గురించి.. ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ లేఖ..

అయ్యా..

మీరు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి. రాజకీయంలో, పరిపాలనలో మీకున్న అనుభవం దేశంలో చాలా అరుదు. ఇంతటి ఘనత వహించిన మీరు, ఇచ్చిన హామీలను విస్మరించడం.. ఒకే అంశంపై విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడడం సబబు కాదేమో ఆలోచించగలరు.. తాజాగా మీ మంత్రివర్గం తీసుకున్న “పుంగనూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడమే ఓ ఉదాహరణ”..

అన్యాయం.. పరిష్కారం!
2022 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అశాస్త్రీయంగా.. అసంబద్ధంగా జరిగిన జిల్లాల విభజన కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగింది. అందులో మదనపల్లె కూడా ఒకటి.ఈ సమస్య మీ దృష్టిలో కూడా ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఈ సమస్యపై హామీ ఇచ్చారు. “మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, పుంగనూరు నియోజకవర్గం మొత్తాన్ని అందులో కలుపుతామని” మీరే హామీ ఇచ్చారు! కానీ నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల, రొంపిచర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతామని ప్రకటించారు.

పులిచర్ల మండలాన్ని మాత్రం చిత్తూరులో ఉంచుతామన్నారు. కానీ ఇది శాశ్వత పరిష్కారమా? ఇదేనా మీరు ఇచ్చిన హామీ? ఇదేనా మీరు చేస్తున్న న్యాయం? ఈ అశాస్త్రీయత, అసంబద్ధతో మీకు, జగన్ మోహన్ రెడ్డి గారికి తేడా ఏముంటుంది? తక్షణమే మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించి, పుంగనూరు నియోజకవర్గంలోని మొత్తం మండలాలను ఆ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను!

జిల్లా విభజనలో లోపాలు సరిచేసి, అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తే.. మీరే కొత్త సమస్యలు సృష్టించడం రాష్ట్రానికి అన్యాయమే! ఈ వినతిని పరిశీలించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.

LEAVE A RESPONSE