Suryaa.co.in

Telangana

జర్నలిస్టులకి ఆరోగ్య .. జీవిత బీమా

– బడ్జెట్ లో తగిన నిధుల కేటాయింపు
– జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై ఆలోచిస్తున్నాం
– హెచ్ యూజే -2025 డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ : జర్నలిస్టులకి హెల్త్ ఇన్సూరెన్సు కల్పించడంతో పాటు జీవిత బీమా కల్పించేదానిపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తామన్నారు. ఇండ్ల స్థలాల సమస్యను ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రెటేరియేట్ లో హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ) 2025 డైరీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్ , జగదీష్ జర్నలిస్టుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా, జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకి ప్రతి ఏడాది రూ.10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం లో జర్నలిస్టుల హెల్త్ స్కీం కలిపి అన్ని ప్రయివేట్ , కార్పొరేట్ హాస్పిటల్స్ లో జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల కోసం రైతు బీమా అమలు చేస్తున్నట్లు.. అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బీమా కింద జీవిత బీమా అమలు చేయాలని కోరారు. ఏదేని కారణంతో జర్నలిస్టు చనిపోతే.. వారి కుటుంబాలకు పరిహారం కింద రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలు అందేలా ప్రభుత్వం జర్నలిస్టు బీమా పథకం తీసుకురావాలని కోరారు. సానుకూలంగా స్పదించిన డిప్యూటీ సీఎం… జర్నలిస్టుల ఆరోగ్య బీమా , జీవిత బీమా, హెల్త్ కార్డులపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుని ఇంటి దగ్గర రెండు మూడు నెలలు రెస్ట్ లో ఉండే జర్నలిస్టులకూ కుటుంబ పోషణ కోసం ఆర్థిక సహకారం అందించే విషయమై పరిశీలన చేస్తామన్నారు. ఇండ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ యూ జే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ బట్టిపాటి రాజ శేఖర్, నాయకులు రామకృష్ణ, చిట్యాల మధుకర్, క్రాంతి, ప్రశాంత్ , కొడవటి నవీన్, సీనియర్ జర్నలిస్టులు యాదగిరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE