Suryaa.co.in

Andhra Pradesh

కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేస్తాం

– సమన్వయంతో పని చేస్తాం.. ప్రగతి సాధిస్తాం
– కోటిపల్లి -ముక్తేశ్వరం బ్రిడ్జి రోడ్డు సాధిస్తాం
– కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం.
– మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ ధీమా

రామచంద్రపురం: సమన్వయంతో పని చేస్తాం.. అభివృద్ధిలో పోటీ పడతాం.. ప్రగతి సాధిస్తాం ఇదే మా నినాదం అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ లు వెల్లడించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణలు శుక్రవారం రామచంద్రపురంలో విస్తృత ప్రచారం చేపట్టారు.

తొలుత విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ, అనంతరం VSM ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన ఎన్నికల ప్రచార సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ సమాజం పట్ల ఎంతో అవగాహన ఉన్న విశ్రాంత ఉద్యోగులు, పట్టభద్రులు సమ సమాజ స్థాపన నిర్మాణానికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి పాలనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లు విశేష కృషి చేస్తున్నారన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు రూ.4 నుంచి 15 వేల వరకు ఇస్తూ చరిత్ర సృష్టించామన్నారు. రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ఉద్యోగ, ఉపాధి కల్పన, నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. గత వైసిపి పాలనలో జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తూ కూటమి పాలన సాగుతుందని, దీనికి విశ్రాంత ఉద్యోగులు, పట్టభద్రులు సహకారం అవసరం అన్నారు.

అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతిస్తుందన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు. ముఖ్యంగా కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తామని, అలాగే కోటిపల్లి – ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జి సాధిస్తామన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి తనతో పాటు మంత్రి సుభాష్ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని, ఇటీవల ఢిల్లీలోని కేంద్ర పెద్దలను కలిసి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ పాలలో ఉండగానే మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుని, కూటమి పార్టీ గెలుపుకు సంకేతాలు పొందామన్నారు. ఆ గెలుపే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 స్థానాలు గెలిచేందుకు దోహదపడిందన్నారు. అన్ని అంశాల్లో సమర్ధుడైన పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE