– సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. సి హెచ్. కోటేశ్వరరావు
గుంటూరు : ప్రతిరోజు సబ్బుతో చేతులు కడుక్కోవడం అనే చిన్న అలవాటు ద్వారా, సురక్షిత ఆరోగ్య సమాజానికి బాటలు వేయవచ్చునని సిజిహెచ్ఎస్ ( సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.హెచ్.కోటేశ్వరరావు వెల్లడించారు.
బుధవారం గుంటూరు నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ లో ‘ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం’ సందర్బంగా అవగాహన సదస్సు జరిగింది. సదస్సు లో డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. చేతుల పరిశుభ్రత అనేది సూక్ష్మ జీవ వ్యాధుల వ్యాప్తి ని అరికట్టే అత్యంత సరళమైన ఆరోగ్య చర్య అన్నారు. భోజనానికి ముందు చేతులు కడకపోవటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ముఖ్యంగా చేతివేళ్ళ గోళ్ళల్లో ఎటువంటి మలినాలు లేకుండా తగు జాగ్రత్త వహించాలన్నారు. సబ్బుతో ప్రతి ఒక్కరూ కనీసం ఇరవై సెకన్లు పాటు చేతులు కడగాలన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చేతుల పరిశుభ్రత ప్రాధాన్యతను పెంచిందన్నారు. పిల్లల్లో చేతుల పరిశుభ్రత అలవాటు పెంపొందించడం, దీర్ఘకాల ఆరోగ్యానికి పునాది వేయవచ్చునని సూచించారు.
చేతుల శుభ్రతకు సంబంధించిన అంశాలను ప్రాథమిక దశ లోనే పాఠ్యంశాల ద్వారా విద్యార్థులకు భోధించాల్సిన అవసరం ఉందన్నారు. చేతుల శుభ్రతకు నాణ్యత గల శానిటైజర్లు, గ్లౌజులను తగిన సందర్భాల్లో ఉపయోగించాలని కోరారు. అనంతరం చేతులు కడిగే విధానాన్ని డాక్టర్ కోటేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ ఫార్మాసిస్ట్ అయోషా బేగం సిబ్బంది మురళీ కృష్ణ, రామారావు, మోహన్, వెంకట్వశ్వర్లు, మక్భుల్, రత్న రాజు పాల్గొన్నారు.