– కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్ ఖాన్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక చిన్న యుద్ధం నడుస్తోందని, తెలంగాణలో కేసీఆర్ లాంటి సెక్యులర్ లీడర్ దేశంలో ఎవరూ లేరని ప్రశంసించారు. యాదాద్రి టెంపుల్‌ను కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ముస్లింలు, ఇతర వర్గాల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కేబినెట్లో ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి లేరని ప్రశ్నించారు. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశారు. మహిళలకు ఫ్రీ బస్సు అంటూ బస్సు ఛార్జీలు పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ ముస్లింలను మోసం చేసిందని ఆరోపించిన కేటీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ముస్లింలు మోసపోలేదా అని ప్రశ్నించారు. బీహార్‌లో ముస్లింలు మోసపోయారని రాహుల్‌గాంధీ అంటున్నారని, మరి తెలంగాణ పరిస్థితి ఏంటని నిలదీశారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను కూడా రేవంత్ మోసం చేశారని ఆరోపించారు.
‘హైడ్రా’ పేరుతో రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నారని ఆరోపించారు. “ఇక్కడ కారు.. అక్కడ బేకార్ రేవంత్‌రెడ్డి ఉన్నారు” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రియల్ఎస్టేట్ కుప్పకూలిందని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో ముస్లింలు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరిన అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన నామినేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు. నన్ను పోటీకి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారని, నిన్నటి నుంచి తనను కొనేందుకు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారని, ఏమీ కావాలంటే అది చేసి పెడతామని ఆశ చూపారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.