– మేం చేసిన దానికి కొనసాగింపే ఈ డేటా సెంటర్
– అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
– బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాడు
– జయచంద్రారెడ్డి ని ఎందుకు అరెస్టు చేయలేదు?
– ఆయన పాస్‌పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు?
– నకిలీ మద్యం. గూగుల్ డేటా సెంటర్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్
తాడేపల్లి: వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమ మద్యం అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యం ఫణంగా పెడుతున్నారు. వేల కోట్లు దోచేస్తున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బయట పడింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువుతో పాటు, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం రాకెట్ బయపడింది. 27,224 బాటిళ్లు దొరికాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు నకిలీ మద్యం బయట పడింది.
నకిలీ మద్యం వెనక ఉన్నది టీడీపీ ఇన్ఛార్జ్. ఆయన టీడీపీ అభ్యర్థి. జయచంద్రారెడ్డి. ఆయన గత ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. మరో వ్యక్తి జనార్థన్‌రావు. మరో వ్యక్తి సురేంద్రనాయుడు. వీరంతా ఒక మాఫియా. వారు గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేశారు.
నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఈనెల 3న బయట పడింది. ఇప్పటికీ 20 రోజులు గడిచాయి. అయినా మీ పార్టీ అభ్యర్థి, గత ఎన్నికల్లో పోటీ చేసిన, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి ని ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన పాస్‌పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు ఆయన్ను గత ఎన్నికల్లో తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డిగారి తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డిపై ఎలా నిలబెట్టారు?
2020 నవంబరులో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు బీజం పడగా, 2023, మే 3న దానికి శంకుస్థాపన చేశాం. అదొక్కటే కాదు. సబ్‌సీ కేబుల్. అంటే సముద్ర గర్భం నుంచి కేబుళ్ల ఏర్పటు. దాన్ని సింగపూర్ నుంచి తీసుకొచ్చే పనికి అంకురార్పణ కూడా అప్పుడే మొదలైంది.
ఈ సబ్‌సీ కేబుల్ అనేది, డేటా తేకపోతే, ఏ డేటా సెంటర్ రా దు. నాడు అదానీ డేటా సెంటర్‌కు మా హయాంలోనే ఫౌండేషన్ వేశాం. 2022లో. మా అందరి కృషి వల్ల, ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. నాటి ప్రాజెక్టు విస్తరణే ఇప్పటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు. దీనిపై 2022, అక్బోటరు 11న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం కూడా వచ్చింది. అది నోయిడాలో ఏర్పాటువుతుండగా, ఇక్కడ 2023, మే 3న విశాఖలో భూమి పూజ చేయడం జరిగింది.
సబ్‌సీ కేబుల్ ఏర్పాటు కోసం 2021, మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశాం. 2023, మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేశాం. 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం చూపిన చొరవ.. ఇవన్నీ వాస్తవాలు. ఈనెల 4న అలెగ్జాండర్ స్మిత్ సింగపూర్ నుంచి ఇక్కడ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌కు లేఖ రాశారు. డేటా సెంటర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపునకు సంబంధించింది. అంటే అదానీ ఇన్ఫ్రాకు సంబంధించి, మూడు కంపెనీలకు భూమి కేటాయింపు చూడమని రాసిన లేఖ అది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ గ్రూప్ ఏకంగా రూ.87 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి. అది ప్రపంచంలోనే చాలా పెద్దది. దాన్ని పూర్తిగా కడుతోంది అదానీ గ్రూప్. దాన్ని కట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. దానికి సంబంధించి హార్డ్‌వేర్‌ను గూగుల్ ఇస్తుంది. మన రాష్ట్రంలో అంతపెద్ద పెట్టుబడి పెడుతున్న అదానీ గ్రూప్‌కు క్రెడిట్ ఇవ్వాలి కదా? చంద్రబాబు వారికి కనీసం థాంక్స్ చెప్పాడా?
ఇక్కడ మరో ముఖ్య విషయం. సింగపూర్ నుంచి విశాఖ మధ్య 3,900 కిమీ. దూరం. అంత దూరం సముద్రంలో కేబుల్ వేయాలి. దాని కోసం కావాల్సినంత ప్రక్రియ అంతా, మా ప్రభుత్వంలోనే జరిగింది. అవన్నీ సైడ్‌లైన్ చేసి, కేవలం తన వల్లే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. వాస్తవానికివిశాఖలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్‌కు అవసరమైన అన్ని సమకూర్చింది మా ప్రభుత్వమే.
అయితే దాని వల్ల వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. కానీ, అది ఒక హబ్‌గా నిలబడుతుంది. ఎందుకంటే డేటా సెంటర్ అనేది ఒక నోడల్ పాయింట్. అలా అది ఒక కీ ఫ్యాక్టర్‌గా నిలబడుతుంది. అలా నాడే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం పడింది. అయితే మేము అదానీతో ఒప్పందంతోనే సరి పెట్టలేదు. ఇంకా చాలా అంశాలు ప్రస్తావించాం. 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని వారితో అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకున్నాం.
2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ రూ.5660 కోట్లు మాత్రమే. అదే 2009 నాటికి రూ.32,509 కోట్లకు పెరగ్గా, 2014 నాటికి రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ ఏకంగా రూ.57 వేల కోట్లు. ఇవనీ వాస్తవాలు. అదే తెలంగాణలో ఈరోజు ఐటీ ఎగుమతులు ఏకంగా రూ.2 లక్షల కోట్లు.
చంద్రబాబు అధికారం చేపట్టి దాదాపు ఏడాదిన్నర. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్. ఇప్పటి వరకు ఒక్క డీఏ ప్రకటించలేదు. చివరకు ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని ప్రకటించడంతో, ఒక డీఏ ప్రకటించారు.
ఆ డీఏ బకాయిలు కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామన్నారు. పెన్షనర్లకు 2027–28లో ఇస్తామని చెప్పారు. అలా గతంలో ఎవరూ ఆ పని చేయలేదు.
మామూలుగా, ఏ ప్రభుత్వంలో అయినా 5 ఏళ్లలో ఉద్యోగులకు 10 డీఏలు ఇవ్వాలి. కానీ, మేము 11 డీఏలు ఇచ్చాం. కోవిడ్ ఉన్నా అన్నీ అమలు చేశాం. కానీ చంద్రబాబు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ఒకే ఒక డీఏ ఇచ్చి, ఉద్యోగులకు దీపావళి కానుక అంటూ, విపరీతంగా ప్రచారం చేస్తూ కొత్త జీఓ తెచ్చారు. విద్యాదీవెన ఏడు త్రైమాసికాలు పెండింగ్. ఆరోగ్యశ్రీలో సేవలు బంద్. ఈరోజు కూడా ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నా చేస్తున్నాయి. తనకు కావాల్సిన ఒకరకి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్‌ను మేము వ్యతిరేకించడం లేదు. అది మేము తెచ్చిన ప్రాజెక్టు. దానిపై ఎవరో విమర్శలు చేస్తే, నన్ను ప్రశ్నిస్తే ఎలా? రాబోయే కాలమంతా ఏఐదే. దాంట్లో డేటా సెంటర్ చాలా కీలకం. మేం చేసిన దానికి కొనసాగింపే ఈ డేటా సెంటర్.
బాలికపై టీడీపీ నాయకుడి అత్యాచారం. ఒక నాయకుడు ఏఎస్పీని నిందించడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే.. ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తోంది. అవసరం లేని అంశాన్ని బాలకృష్ణ ప్రస్తావించాడు. ఆయన మద్యం సేవించి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాడు. దాన్ని స్పీకర్ చూడాలి.