– ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పనిచేయవద్దు
– సమస్య వస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు
– ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టడమా?
– అరెస్టు రికార్డులను మా ముందు ఉంచండి
– పోలీసులకు హైకోర్టు వార్నింగ్
– మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది
– అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు
– హైకోర్టు ధర్మాసనం అక్షింతలు
అమరావతి: పోలీసుల ఓవరాక్షన్‌పై హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రభుత్వంలో ఉండేవారి కోసం పనిచేస్తే సమస్యలొస్తాయి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని ఘాటుగా హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన తమ మేజిస్ట్రేట్ల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టి, వాంగ్మూలాలు సృష్టిస్తున్న పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే తమకు బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగిపోతోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ఏదో ఒక కేసులో ఎవరో ఒకరిని అరెస్టు చేయాలన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. కేసుల విషయంలో పోలీసులు కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దని, పరిధి దాటి పనిచేస్తే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఎవరూ మిమ్మల్ని కాపాడరని సున్నితంగా హెచ్చరించింది.
మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమకుమార్ అరెస్టుపై ఆయన కుమారుడు హైకోర్టు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలో ఇష్టానుసారంగా నమోదవుతున్న కేసుపై సీరియస్ అయ్యింది. పోలీసులకు కీలక సూచనలు చేసింది. పెద్దల మెప్పుకోసం కాకుండా.. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పనిచేయాలని సూచించింది. పోలీసులు ఏం చేస్తున్నా కోర్టు చూస్తూ ఊరుకుంటుందని భ్రమ నుంచి బయటకు రావాలని సూచించింది. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయడం తప్పు కాదని, కానీ, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని కోర్టు అభిప్రాయపడింది.
మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమకుమార్ అరెస్టుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రేమ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? అని ప్రశ్నించింది. నాటకరూపంలో ప్రభుత్వాన్ని సెటైరికల్‌గా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించడం తప్పా..? అని పోలీసులను కోర్టు నిలదీసింది. ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం అవుతుందా..? అని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
సోషల్ మీడియాలో ప్రేమ్‌కుమార్ రీల్ చూసి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎలా రియాక్ట్ అవుతున్నారు? వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్చడ్డారంటూ కేసు పెడతారా? అరెస్టు సమయంలో పోలీసులు రికవరీ చేసింది రూ.300 మాత్రమేనని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రేమ్‌కుమార్ అరెస్టు రికార్డులను తమకు అందించాలని కర్నూలు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునం దర్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.