Suryaa.co.in

Business News Features

హిండెన్‌బర్గ్.. అదానీ.. ఇండియన్ మార్కెట్!

హిండెన్ బర్గ్రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది అనే అంచనా ఉంటే లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఒకవేళ షేర్ ధర పడిపోతుంది అనే అంచనా ఉంటే తీసుకునే పొజిషన్ షార్ట్ లేదా షార్ట్ సెల్లింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దీనిని బెట్టింగ్ అనవచ్చు. డీప్ అనాలసిస్ లోకి వెళ్ళడం లేదు కాని స్టాక్ మార్కెట్లో లాంగ్ లేదా షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి కేవలం గెస్ వర్క్ కాకుండా కంపెనీ టెక్నికల్ అంశాలు, ఆయా పరిశ్రమలో జరుగుతున్న విషయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు వంటి అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

జనవరి 24న హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదాని సంస్థ మీద మార్కెట్లో షార్ట్ పొజీషన్ తీసుకున్న తర్వాతే తన పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. ఈ విషయం స్వయంగా ఆ సంస్థ ప్రచురించిన వ్యాసంలో “హిండెన్‌బర్గ్ సాధారణంగా కేసును వివరించే నివేదికను ప్రచురిస్తుంది మరియు లాభం పొందాలనే ఆశతో టార్గెట్ చేసిన కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేస్తుంది” అని తెలియజేసింది. ఈ కింది లింకు ఓపెన్ చేసి అదానీ మీద రాసిన వ్యాసంలో హిండెన్ బర్గ్ disclaimer ను కూడా చదవవచ్చు.

ఇదే విషయాన్ని రాయిటర్స్ కూడా who is behind hindenburg company that is shorting adani అనే శీర్షికతో ఒక న్యూస్ ఆర్టికల్ ప్రచురించింది. ఈ కింది లింక్ ద్వారా రాయిటర్స్ ఆ న్యూస్ ఆర్టికల్ చదవవచ్చు.
https://www.reuters.com/markets/who-is-behind-hindenburg-company-that-is-shorting-adani-2023-01-25/

అదానీ మీద హిండెన్ బర్గ్ రాసిన వ్యాసంలో నిజానిజాలను కాసేపు పక్కనపెడితే తను ప్రచురించే పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా ఆయా కంపెనీల షేర్ల ధరలు పడిపోతే లేదా పడిపోయేలా చేయడం ద్వారా లాభాలు ఆర్జించడం అనేది హిండెన్ బర్గ్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. హిండెన్ బర్గ్ ఇలాంటి పని చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో అమెరికాకు చెందిన లార్డ్ స్టోన్ మోటార్ కార్ప్, నికొలా మోటార్ కంపెనీ, క్లోవర్ హెల్త్, చైనాకు చెందిన కండి, కొలంబియా చెందిన టెక్నోగ్లాస్ కంపెనీల పైన ఇలాంటి వ్యాసాలు ప్రచురించి స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లను షార్ట్ సెల్లింగ్ చేసింది.

హిండెన్ బర్గ్ చరిత్ర
1937లో జర్మనీ దేశంలో హిండెన్ బర్గ్ లో హైడ్రోజెన్ ఎయిర్ బెలూన్ గాలిలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తున్న 100 మందిలో సుమారు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్వని మనుషుల నిర్లక్ష్యం, స్వార్థం వలన కలిగే అనర్థాలకి ఈ హిండెన్ బర్గ్ ఘటన ఒక ఉదాహరణగా తీసుకున్న నాథన్ అండర్సన్ అనే వ్యక్తి 2017లో Hindenburg Research LLC అనే సంస్థను స్థాపించాడు. ఇతను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్సియల్ అనలిస్ట్ మరియు ప్రత్యామ్నాయ పెట్టుబడుల విశ్లేషకుడుగా విశేష అనుభవం కలవాడు. ఇతని దెబ్బకు మార్కెట్లో ఎదురులేని అనేకమంది బిలియనీర్లు బికారిగా మారిపోయారు. పొంజి స్కీమ్స్ నడిపిన కొందరు జైలు పాలయ్యారు. నాథన్ అండర్సన్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్
https://www.linkedin.com/in/nathanzanderson

హిండెన్ బర్గ్ ఎఫ్ఫెక్ట్
అదానీ గ్రూప్ తన కంపెనీ షేర్లలో అవకతవకలకు పాల్పడుతుందని, ఖాతాలో మోసాలు చేస్తుందని, కంపెనీ రుణభారం నిర్దిష్ట స్థాయికి మించి ఉందనే ఆరోపణలతో హిండెన్ బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్టు అదానీ గ్రూప్ కంపెనీల మీద తీవ్రంగానే పడింది. గ్రూపులో వివిధ కంపెనీల షేర్లు 5-20% వరకు పతనం అవ్వడంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ₹4.17 లక్షల కోట్లు, భారత స్టాక్ మార్కెట్లు ₹10 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు 23 నష్టాలపాలయ్యాయి అంటే హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రభావం ఎక్కువగానే ఉందని అనిపిస్తున్నది. హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ ఇచ్చిన వివరణ మదుపరులకు సంతృప్తికరంగా లేకపోవడం వలన వచ్చే వారంలో కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్ కంటే ఎమోషన్స్ కి ఎక్కువగా స్పందించడం, సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇవ్వడం సాధారణంగా కనిపించే దృశ్యం. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ అదానీకి వ్యతిరేకంగా ఉంది. దానికి కారణం హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఒక్కటే కారణం కాదు, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాస్తవ విలువ కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి. ప్రైస్ కరెక్షన్ జరగడం అనివార్యం కూడా. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద రెండు రోజుల్లోనే 20 బిలియన్ డాలర్లు తగ్గడంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 7వ స్థానానికి దిగివచ్చింది.

హిండెన్ బర్గ్ రిపోర్టుతో లాభపడుతున్నది ఎవరు? అంటే మొదటి పేరు హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అనే చెప్పాలి. ఎందుకంటే రిపోర్టు బహిర్గతం అయితే స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుందో ముందే తెలుసు. అందుకే హిండెన్ బర్గ్ షార్ట్ పొజీషన్ తీసుకున్నది. హిండెన్ బర్గ్ షార్ట్ పొజీషన్ లో తీసుకున్న లాట్ ల సంఖ్య మీద స్పష్టత లేనప్పటికీ కొన్ని బిలియన్ డాలర్ల లాభం ఇప్పటికే సంపాదించి ఉండవచ్చు. ఇక రెండవది హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ఆధారంగా షార్ట్ పొజిషన్ తీసుకున్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా భారీగానే లాభాలు కళ్ళజూశారు. ఇక చివరగా గత రెండు ట్రేడింగ్ సేషన్ లలో షార్ట్ పొజిషన్ తీసుకున్న రీటైల్ మదుపరులు కూడా లాభపడ్డారు. నష్టపోయింది మాత్రం కొన్ని నెలల క్రితమే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కొని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసిన వాళ్ళు. ఇకపోతే అందరు అనుకుంటునట్లు అదానీ గ్రూప్ ప్రభావం LIC సంస్థ మీద అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో LIC పెట్టుబడులు, అందులో అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడుల శాతం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

హిండెన్ బర్గ్ లేవనెత్తిన 88 అంశాల మీద అదానీ గ్రూప్ సవివరమైన వివరణ ఇవ్వాలని, ఆ అంశాల మీద సెబీ దర్యాప్తు చేయాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అకౌంటింగ్ ఫ్రాడ్స్, షేర్ ప్రైస్ మ్యానిపులేషన్, అనేవి సాధారణ నేరాలు కావు.

LEAVE A RESPONSE