* బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* గొల్లపల్లి రిజర్వాయర్ లో జలహారతి
* రిజర్వాయర్ ద్వారా చెరువులకు నీటి విడుదల చేసిన మంత్రి
* ‘గొల్లపల్లి’తో తరలొస్తున్న పరిశ్రమలు
* చంద్రబాబు విజన్ కు ‘గొల్లపల్లి’ నిర్మాణమే నిదర్శనం
* కుప్పం వరకూ ప్రతి ఎకరాకూ నీరందిస్తాం
* హంద్రీ-నీవాతో రాయలసీమ సస్యశ్యామలం
* తట్టమట్టి కూడా వేయని జగన్
* అర్హులందరికీ ఇళ్లు : మంత్రి సవిత
పెనుకొండ : రాయలసీమను రతనాల సీమగా మార్చడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద కుప్పంలోని చివరి ఎకరాకూ నీరందిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. గొల్లపల్ల రిజర్వాయర్ ద్వారా 265 చెరువులకు నీరందించే కార్యక్రమాన్ని మంత్రి సవిత బుధవారం చేపట్టారు. ముందుగా గొల్లపల్లి రిజర్వాయర్ లో జలహారతి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం చెరువులకు నీళ్లు నింపడానికి గొల్లపల్లి రిజర్వాయర్ గేట్లు తెరిచారు. ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయన్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా, గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేశారన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగునీటి కష్టాలు తప్పాయన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగానే కియా, దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. హంద్రీ-నీవా జలస్రవంతి పథకం కింద కుప్పంలోని చివరి ఎకరాకు కూడా సాగునీరందిస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా, సస్యశ్యామంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
హంద్రీ నీవా పనులు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం మేర పూర్తయ్యాయన్నారు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, హంద్రీ -నీవా పనులు నిలిచిపోయాయన్నారు. మరోసారి సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో హంద్రీ-నీవా పనులు ప్రారంభమయ్యాయన్నారు.
2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. అన్నమయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తిగా అటకెక్కించేశారన్నారు. ఎన్నికల ముందు హంద్రీ-నీవా పనులు పూర్తి చేస్తామని చెప్పిన జగన్…గెలిచిన తరవాత తట్టమట్టి కూడా వేయలేదని మండిపడ్డారు.
లండన్ కు వెళ్లి వైద్యం చేయించుకున్నా జగన్ మానసిక పరిస్థితి మెరుగుపడలేదని, 2.0, 3.0 అంటూ ఆయన ఇంకా భ్రమలోనే బతికేస్తున్నారని మంత్రి సవిత ఎద్దేశా చేశారు. వైసీపీ చచ్చిపోయిందని స్వయంగా జగనే ఒప్పుకున్నారన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోకుండా స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లూ గాల్లో తిరిగిన జగన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడిందన్నారు. ఆయన మాటలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.