– రాప్తాడు నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే పరిటాల సునీత హామీ
– 3 మండలాల రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు పంపిణీ
– కోళ్ల పెంపకం యూనిట్లు కూడా అందజేత
– పరిటాల కుటుంబం గురించి మరోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు
– ప్రకాష్ రెడ్డి ట్రాప్ లో వైసీపీ శ్రేణులు పడవద్దన్న పరిటాల సునీత
రాప్తాడు: అనంతపురం జిల్లా వంటి కరవు ప్రాంతంలో రైతులకు డ్రిప్పు స్ప్రింక్లర్లు ఎంతో అవసరమని.. అందుకే 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా వీటిని సబ్సిడీపై అందించేలా చూస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల రైతులకు సబ్సిడీపై మంజూరైన డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందజేశారు. మూడు మండలాలకు చెందిన 840 మంది రైతులకు ఇవి మంజూరు కాగా.. బుధవారం రోజు 214 మంది రైతులకు వీటిని అందజేశారు. వీటి విలువ రెండు కోట్ల 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఇందులో అనంతపురం రూరల్ మండలంలో 195 మందికి, ఆత్మకూరు మండలంలో 314 మందికి, రాప్తాడు మండలంలో 331 మంది రైతులకు వీటిని మంజూరు చేశారు. రాప్తాడు మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, అధికారులు, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. మరోవైపు ఈ మూడు మండలాలకు చెందిన రైతులకు పెరటి కోళ్ల పెంపకం యూనిట్లను కూడా మంజూరు చేశారు.అనంతపురం రూరల్ మండలంలో 54మందికి, ఆత్మకూరు మండలంలో 55 మందికి, రాప్తాడు మండలంలో 20మందికి చొప్పున మొత్తం 129మందికి మంజూరు చేశారు. వీటిని అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రిప్పు, స్ప్రింక్లర్లను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి మంజూరు కాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు ఎన్నికల చివరి ఏడాదిలో అరకొరగా మంజూరు చేశారన్నారు.
వైసీపీ శ్రేణులు ప్రకాష్ రెడ్డి ట్రాప్ లో పడవద్దు
అధికారంలో ఉండగా కనీసం గ్రామాలకు రోడ్లు కూడా వేయలేని ప్రకాష్ రెడ్డి… అధికారం పోయాక రాజకీయ కక్షలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా గ్రామాలకు రోడ్లు వేశామని.. ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అలాగే బీటీ రోడ్లు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేశామన్నారు. త్వరలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రకాష్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.