– రూ.45 లక్షల నిధులతో పూర్తి స్థాయిలో హాస్టల్ ఆధునికీకరణ
– ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం అండదండలు
– గొట్టిపాటికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, గ్రామస్థులు
– నాడు-నేడు అంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల దుబారా
– వైసీపీ ప్రభుత్వంలో సాంఘీక, సంక్షేమ హాస్టళ్లలో తగ్గిన విద్యార్థుల శాతం
-మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి\బాపట్ల: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన బాపట్ల జిల్లా సంతమాగలూరు ఎస్సీ వసతి గృహం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో పూర్వ వైభవం సంతరించుకుంది. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రేకులు విరిగి, బాత్ రూమ్స్ తలుపులు లేకుండా, శిధిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రూ.45 లక్షల నిధులతో పునర్నిమించారు.
నాలుగు నెలల క్రితం సంతమాగలూరు పర్యటనలో భాగంగా హాస్టల్ పరిస్థితిని, విద్యార్థుల దుస్థితిని చూసి చలించిన మంత్రి గొట్టిపాటి విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా హాస్టల్ భవనాన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా వైసీపీ హయాంలో సాంఘిక, సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి గురువుతున్న విషయాన్ని సంబంధిత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మంత్రి డోలా కూడా వెంటనే స్పందించి సంబంధిత శాఖ నుంచి నిధులను విడుదల చేశారు.
ఇలా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని… వసతి గృహానికి మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. పూర్తి స్థాయిలో ఎస్సీ హాస్టల్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులతో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం మంత్రి గొట్టిపాటి చూపుతున్న చొరవకు వారంతా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తగ్గిన విద్యార్ధులు…
పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న సంతమాగలూరు ఎస్సీ హాస్టల్ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సందర్శించారు. ఆధునికీకరించిన భవన సముదాయాలను, ఇతర ప్రాంతాలను మంత్రి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో సాంఘిక, సంక్షేమ హాస్టల్ భవనాలన్నీ నిర్వహణాలోపం, నిర్లక్ష్యంతో శిధిలావస్థకు చేరాయని తెలిపారు.
సంతమాగలూరు ఎస్సీ హాస్టల్ లో 2019 తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో మొత్తం 170 విద్యార్థులు ఉండేవారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఆ హాస్టల్ విద్యార్థుల సంఖ్య 30 పరిమితమయ్యిందని వాపోయారు. నాడు-నేడు, రేషనలైజేషన్ పేరుతో బడుగు,బలహీన వర్గాలను విద్యకు జగన్మోహన్ రెడ్డి దూరం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల చదువుకు అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.