– విభాగాధిపతులనుంచి స్పందన కోరిన మంత్రి సత్యకుమార్ యాదవ్
– పనితీరు మదింపునకు 20 అంశాలను సూచించిన మంత్రి
అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ – సెప్టెంబర్, 2025) వైద్యారోగ్య మంత్రిత్వ శాఖలోని 10 వివిధ విభాగాల పనితీరును సమీక్షించడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన పంథా చేపట్టారు. ఈ కాలంలో ఆయా విభాగాలు సాధించిన ఫలితాలు, సమస్యలు/అడ్డంకులు పరిష్కారం, సాధించిన మార్పు ఆధారంగా పనితీరు బాగా ఉందా, సంతృప్తికరంగా ఉందా లేదా అని మీరే చెప్పాలని 10 విభాగాధిపతులకు మంత్రి సూచించారు. 20 అంశాల ఆధారంగా పనితీరును మదింపు చేయాలని మంత్రి సూచించారు.
ఏప్రిల్ – సెప్టెంబర్ కాలానికి సంబంధించి వివిధ విభాగాలు అందించే సమాచారం ఆధారంగా మంత్రి సత్యకుమార్ వైద్యరోగ్య శాఖ పనితీరును సమీక్షించనున్నారు. 14,000 ప్రభుత్వ డిస్పెన్సిరీలు, ఆసుపత్రులు, పలు ఆరోగ్య పథకాల అమలుకు సంబంధించి వైద్య సేవలు, పధకాల అమలు నాణ్యత, ఫలితాల మదింపుపై దృష్టి సారించిన మంత్రి వినూత్నంగా విభాగాధిపతుల నుంచే పనితీరు అంచనాలు కోరడం విశేషం. పనితీరు, ఫలితాలను నిర్దిష్టంగా అంచనా వేయడానికి స్పష్టమైన కొలమానాలుండాలని భావించిన మంత్రి… ఆ దిశగా 20 అంశాలను సూచించారు.
వైద్య సేవలు, పథకాల అమలులో మెరుగుకోసం ఆయా శాఖలు ప్రవేశపెట్టిన/సాధించిన ఐదు మార్పులు ఏవి, ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిలో పరిస్కారం చేసిన వాటి వివరాలు, నూతన మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సిబ్బంది నియామకాలు, ఓపీ, ఐపీ సేవల్లో ప్రగతి, డయాగ్నోస్టిక్ సేవల సంఖ్య, పరికరాల కొనుగోలు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు, బడ్జెట్ కేటాయింపులు, గత 6 నెలల్లో ఖర్చు వివరాలు, వైద్య సేవల విస్తరణ, నూతన సేవల ప్రారంభం మొదలైనవి.
వివిధ విభాగాధిపతుల నుండి ప్రత్యక్షంగా పనితీరు అంచనాపై స్పష్టమైన స్పందన, 20 వివిధ అంశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా త్వరలో మంత్రి చేపట్టానున్న సమీక్షపై మంత్రిత్వ శాఖలో చర్చ జరుగుతోంది.