ఆనందాన్వేషణ

– ఆనందం ఎలా దొరుకుతుంది?ఎక్కడ వెతుక్కోవాలి?
నీ ఆనందాన్ని నీలో వెదుక్కుంటేనే అధికంగా, అవిరామంగా, అగణనీయంగా, అనంతంగా ఆనందాన్ని పొందుతావు.ఎందుకంటే అందరికంటే అధికంగా నిన్ను ప్రేమించేది నీవు మాత్రమే, అందరికంటే అధిక సమయం నీతో ఉండేది కూడా నీవు మాత్రమే.నీ ఇష్టాయిష్టాలు, నీ మనోభావాలు నీకు తెలిసినంతగా మరొకరికి, మరెవరికీ తెలియవు. అతి తక్కువ సమయంలో నిన్ను నీవు శోధించుకునేందుకు, ఆనందాన్ని సాధించుకొనేందుకు నీకున్నంత అవకాశం మరెవరికీ లేదు.అవసరం, ఆవేదన, ఆనందం… ఈ అన్నింటి సమతూకం నీకు తెలుసు కాబట్టి – నీవు సంయమనంతో వ్యవహరించగలవు.నీ చుట్టూ ఉన్న పరివారాన్ని యావత్తూ ఆనందమయం చేసుకోగలవు.
ఇంకా నీవు విశ్వమానవుడివైతే, విశ్వంతో మమేకమై ఉంటే నీ ఉనికి యావత్తూ విశ్వసమానమై ఉంటుంది.
విశ్వమే నీవుగా అనుభూతి చెందుతూ ఉంటావు.నిజానికి మనం ఆనంద స్వరూ పులం. అమృత పుత్రులం, దుఃఖానికి చిరునామా మన దగ్గర లేదు. మన మనోభావనతో మాత్రమే మనకెదురైన సంఘటనలకు రూపకల్పన చేస్తాం, రంగులద్దుతాం, మెరుగులు దిద్దుతాం.
అంతే – అది మన అభిరుచి మేరకు మనమిచ్చే ఆకార వికారాలే తప్ప వాటి నిజస్వరూపాలు, స్వభావాలు కావు. మనమే సృష్టించుకున్న ఈ వికారాలకు మనమెందుకు బలికావాలి!?
ఇది ఎంత హాస్యాస్పదం! మనం వేసుకున్న భూతం వేషానికి, అద్దంలో చూసుకొని మనమే భయపడటం ఎంత పరిహాసాస్పదం!…
మనం గులాబీ తోటలో ఉన్నాం, ముళ్లుంటాయి, గుచ్చుకుంటాయి కూడా, ముళ్లను తప్పించుకోవడం నేర్చుకోవాలి…పువ్వును మాత్రమే కోసుకోవడం అలవరచుకోవాలి. తామర కొలనులో బురద ఉంటుంది.
బురదలో నుంచే తామరను లాక్కోవడం తెలుసుకోవాలి, ఏ అమృతప్రాయ అంశాన్నైనా అడుసులోంచే పొందే అవకాశం ఉంటుంది. నిజానికి అమృతం కూడా గరళంనుంచే దాన్ని తప్పుకొని వచ్చింది.
గొప్ప విషయాలకు వెలకట్టలేం, దాన్ని పొందేందుకు మనం వెచ్చించే శ్రమ మాత్రమే దాని విలువను మనకు తెలియజేస్తుంది.
అదీ కొంతమేరకే, అమృతం విలువ గరళాన్ని తొలగించుకోవడం మాత్రమే కాదు కదా?
అదృష్టవశాత్తు, ఈ లోకం అపురూపాల అమృత కలశాలమయం. దానికోసం మనం కొంతలో కొంతయినా మూల్యం చెల్లించుకోక తప్పదు.అది బాధాకరమైన విషయం కాదు. ఆ అమూల్యాల మూటలు మన సూక్ష్మ శ్రమలకు అందుబాటులో ఉండటమన్నదే అత్యంత గొప్ప విషయం.
ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగితే కష్టం , బాధ, శ్రమ అన్న పదాలకు అర్థాలు మారిపోతాయి.
పొందడం అన్న పదానికి పర్యాయపదంగా నిలుస్తాయి.ఈ సూక్ష్మ విషయాన్ని మనం గ్రహిస్తే- ఆనందం… పొందడంలో లేదు, పోగొట్టుకోవడంలోనూ లేదు, ఇది వస్తు మార్పిడి కాదు.లోకం తీరు అది, సృష్టి రహస్యం అది. తప్పదు.మనం చేయవలసిందల్లా సృష్టిలోని అనివార్య అసమతుల్యతనే సమతుల్యంగా తర్జుమా చేసి స్వీకరించడం!అప్పుడు ఆనందం బయటెక్కడో వెతుక్కోవలసిన వస్తువుగా భాసించదు, ఆనందమే మనమై ఉన్నప్పుడు ఎక్కడ వెదకాలి!? ఎవరు వెదకాలి!?

Leave a Reply