– 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరిక
– 43 నుంచి నాలుగుకు పడిపోయిన వైసీపీ బలం
– అంతకుముందే మేయర్, డిప్యూటీ మేయర్ సహా 19మంది జనసేనలో చేరిక
తాజాగా బాలినేని తనయుడు ప్రణీత్ చేరిక
– తిరుపతిలోనూ జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
– ఒంగోలులో చక్రం తిప్పిన బాలినేని
– జనసేన ఖాతాలో తొలి కార్పొరేషన్
– తిరుపతిలోనూ కార్పొరేటర్ల చేరికలు
ఒంగోలు: మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ పూర్తి స్థాయిలో చతికిలపడింది. మాజీ మంత్రి, జనసేన కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పడంతో, ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీ బలం 43 నుంచి నాలుగుకి పడిపోయింది. నిజానికి అంతకుముందే.. బాలినేనితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
ఇప్పుడు బాలినేని తనయుడు ప్రణీత్ సహా మిగిలిన కార్పొరేటర్లు కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోవడంతో, ఒంగోలు కార్పొరేషన్‌పై తొలిసారి జనసేన జెండా ఎగిరేందుకు సిద్ధమవుతోంది.
దీనితో ఒంగోలుపై బాలినేని పట్టు ఏమిటన్నది మరోసారి స్పష్టమయింది. నిజానికి వారిని టీడీపీలో చేర్పించే ప్రయత్నాలు సఫలం కాలేదు. వారంతా తాము బాలినేనితోనే నడుస్తామని చెప్పడంతో, టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఒంగోలు కార్పొరేషన్ జనసేన ఖాతాలో పడటం ఖాయం. ఆ విధంగా రాష్ట్రంలో జనసేన తొలి కార్పొరేషన్ ఒంగోలు కానుంది.
అటు తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు జనసేన దళపతి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.