Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి హామీ అమలు చేస్తాం

– మే నెలలో తల్లికి వందనం
– ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమలు
– అన్నదాత సుఖీభవ పథకంలో 20వేలు
– వచ్చే విద్యాసంవత్సరానికి డీఎస్సీ సెలక్షన్ పూర్తి
– ఇంకా రోడ్ల విషయంలోనే కొంచెం అసంతృప్తి ఉంది
– అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం అమలు పై మాట్లాడిన చంద్రబాబు ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. పథకాన్ని అమలు చేస్తామన్నారు. మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

రైతుకు భరోసా కల్పించే విషయంలో తాము చెప్పినట్లుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ. 6000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 14 వేలు కలిపి, మొత్తం రూ. 20వేలు ఇస్తామన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి ఉద్ఘాటించారు. ఇక దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు పింఛను పెంచామన్నారు. సాధారణ పింఛన్‌ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు. రూ. 33 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పింఛన్లు ఇచ్చే దేశంలోనే ఏకైక కార్యక్రమం ఇది అని సీఎం చంద్రబాబు చెప్పారు . ఎన్ని కష్టాలు ఉన్నా గవర్నమెంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్‌ అందరికీ సమయానికి జీతాలు ఇస్తున్నామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామని సీఎం చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటిన్లు మూసేశారని, ఇప్పుడు తాము తిరిగి ప్రారంభించామన్నారు. పేదలకు దీపం కార్యక్రమం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా 93 లక్షల మందికి దీపం 2 అందుతోందన్నారు.

వచ్చే విద్యాసంవత్సరానికి డీఎస్సీ సెలక్షన్ పూర్తి చేసి బడులు తెరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక మత్స్యకారులకు సైతం అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు రూ. 20 వేలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం వారికి హాలిడే ఇస్తామని.. ఆ హాలిడే కంటే ముందుగానే ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామన్నారు.

పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా
స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కు కేటాయించామని, పరిశుభ్రంగా ఉండే ప్రతి నియోజకవర్గానికి అవార్డులు ఇస్తామని అన్నారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే, పల్లె పండుగ కింద ఒకే రోజున రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టి, అన్ని వర్క్ లకు నిధులు ఒక్కరోజులో మంజూరు చేసిన ఘనత భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కింది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా, అవి అప్పుడప్పుడు చేసేవాళ్లు. కానీ పవన్ బ్రహ్మాండంగా నాయకత్వం వహించి ముందుకు తీసుకెళుతున్నారు. అది అందరికీ స్ఫూర్తిదాయకం.

గతంలో ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించి, సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ తీసుకువచ్చిన ఘనత పవన్ కే చెల్లింది. ఇప్పుడు పంచాయతీ శాఖను బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారు. అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ ఇంకా రోడ్ల విషయంలోనే కొంచెం అసంతృప్తి ఉంది. ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నట్టుంది. ఫర్వాలేదు. సంకల్పం ఉంటే మార్గాలుంటాయి. మనం కలసికట్టుగా కృషి చేద్దాం అన్నారు.

LEAVE A RESPONSE