Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు

– 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని ఎలా చెబుతారు?
– ఇంగ్లీష్‌లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా ఉద్యోగాల గురించి రాస్తారా?
– కొత్త ప్రాజెక్టులకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేరుతో జరుగుతున్న దందాపై విచారణ జరిపించాలి
– రూ.15 వేల కోట్లు విద్యుత్‌ ఛార్జీల భారం
– కాకినాడ క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సందర్భంలోనూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని వైయస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. అసెంబ్లీలో చంద్రబాబు తమ గొప్పలు తాము చెప్పుకోవడానికే పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు. అయిదేళ్ళ పాలనలో హామీల అమలు గురించి కాకుండా, విజన్‌–2047 లక్ష్యాల సాధన గురించి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.

తమ పార్టీ గవర్నర్‌ను గౌరవించలేదనడం సరికాదని స్పష్టం చేశారు. సభలో వైయస్సార్‌సీపీ హుందాగా ప్రవర్తించిందని తేల్చి చెప్పారు. ఇక సభా మర్యాదల గురించి చంద్రబాబు మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. ఎన్టీఆర్‌ను దింపేసిన సందర్భంలో శాసనసభలో అప్పటికీ సభానాయకుడుగా ఉన్న ఎన్టీ రామారావుకు కనీసం మైక్‌ కూడా ఇవ్వలేదు. అటువంటి చంద్రబాబు నేడు సభామర్యాదల గురించి మాట్లాడుతున్నారు.

2009–14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శాసనసభలో మైక్‌లు విరిచి, పేపర్లను చింపి అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ మీదికి విసిరేశారు. గత ప్రభుత్వంలో గవర్నర్‌ హరిచందన్‌ ప్రసంగాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అడ్డుకున్నారు, ఆయనను గేలిచేస్తూ, ఎలా కించపర్చారో ప్రజలు మరిచిపోలేదు. ప్లకార్డులు ప్రదర్శించడం, పేపర్లు చించి ముఖాన విసిరేయడం, సభలో విజిల్స్‌ వేయడం చేశారు. అలాంటి వారు ఇప్పుడు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమై పోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారు. మొదట్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత రూ.12 లక్షల కోట్లు అని ఒకసారి, మళ్ళీ రూ.10 లక్షల కోట్లు అని మరోసారి అన్నారు. ఇప్పుడు రూ.9.74 లక్షల కోట్లు అని అంటున్నారు. గత ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ బడ్జెట్‌లో అప్పటికి రాష్ట్ర అప్పును రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. అంటే ఎక్కడ రూ.14 లక్షల కోట్లు? ఎక్కడ రూ.6.46 లక్షల కోట్లు? తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏ ఒక్క పథకం అయినా అమలు చేశారా? మరి ఆ డబ్బంతా ఏమైంది? చంద్రబాబు ఎన్నికలకు ముందు 143 హామీలు ఇచ్చారు. వాటిలో ఎన్ని అమలు చేశారు?

రామాయపట్నం పోర్టు మా హయాంలో దాదాపుగా పూర్తైంది. ఇవికాక మచిలీపట్నం, మూలపేట పోర్టులు పనులు శరవేగంగా నడిచాయి. కాకినాడలో మరో ప్రైవేటు పోర్టు నిర్మాణం పూర్తవుతోంది. వీటితో పాటు మరో 11 ఫిషింగ్‌ హార్బర్‌లు మా హయాంలో వచ్చాయి. వీటిని చంద్రబాబు తనఖాతాలో వేసుకుంటున్నాడు. మరోవైపు వైయస్‌ఆర్‌సీపీ హయాంలో నిర్మించిన పోర్ట్‌లు, ఫిషింగ్‌ హార్బర్లను, కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మా ప్రభుత్వ హయంలో ఒప్పందం చేసుకున్న ఎన్టీపీసీ ప్రాజెక్టు కూడా తన వల్లే అని చంద్రబాబు చెబుతున్నారు. ఈప్రాజెక్టు రావడానికి కారణం జగన్‌. కొత్త తరహా ఇంధన వనరులు తయారీపై ఆయనకున్న దార్శినికతకు నిదర్శనం ఇది. మా హయాంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద భూములు ఇచ్చాం. దీంతోపాటు రామాయపట్నం వద్ద బీపీసీఎస్‌ ప్రాజెక్టుకూడా మా నాయకుడి వల్లే వచ్చింది. వారికి అవసరమైన భూములను మేం దగ్గరుండి చూపించి, రాష్ట్రానికి ఆ ప్రాజెక్టును తీసుకు వచ్చాం. అన్ని రకాలుగా క్లియర్‌చేసిన ఈ ప్రాజెక్టులు ఇప్పుడు తనవల్లే అంటున్నాడు చంద్రబాబు. ఒకరి కష్టాన్ని దోచేయడం ఆయనకు అలవాటు. హైదరాబాద్‌ రింగు రోడ్డు వ్యవహారంలోనైనా, శంషాబాద్‌ విమానాశ్రయం వ్యవహారంలోనైనా ఆయన తీరు ఇంతే.

ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పించారు. దీనిపై శాసనమండలిలో వైయస్సార్‌సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి ప్రశ్నిస్తే, మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ గవర్నర్‌ ప్రసంగం ఇంగ్లీష్‌ వెర్షన్‌ చదవాలని బాధ్యతారహితంగా సమాధానం చెప్పారు. అంటే ఇంగ్లీష్‌లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా ఉద్యోగాల గురించి రాస్తారా?.

మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో వైస్‌ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారని ప్రశ్నిస్తే దీనిపై సమాధానం లేదు. రాత్రికి రాత్రి రాజీనామాలు చేయాలని బెదిరించినట్లు గవర్నర్‌కు సమర్పించిన రాజీనామా పత్రంలో ఒక వీసీ పేర్కొన్న విషయం వాస్తవం కాదా?

తాజాగా గ్రూప్‌–2 నిరుద్యోగులతో పాటు, పెన్షనర్లను, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు. 50 ఏళ్ళకే పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం.. వీటిలో ఏ ఒక్క పథకం అమలు చేయడం లేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మద్యం బాటిళ్ళపై పది రూపాయల చొప్పున పెంచారు. ఏకంగా రూ.15 వేల కోట్లు విద్యుత్‌ ఛార్జీల భారం మోపారు.

పీ–4 పేదరిక నిర్మూలన కోసం ధనికుల నుంచి విరాళాలు సేకరిస్తామని చెబుతున్నారు. ధనవంతులైన 10 శాతం ధనికుల నుంచి విరాళాలు సేకరిస్తారు. దీనిని గొప్ప వ్యూహం అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీన్ని పేదలు నమ్ముతారని వారి నమ్మకం. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కొత్త ప్రాజెక్టులకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేరుతో జరుగుతున్న దందాపై విచారణ జరిపించాలి.

విజయనగరంలో రామతీర్థంలో రాముడి తల తీసేశారని చంద్రబాబు పెద్ద హంగామా చేశారు. అదే కేసులో ముద్దాయికి ఇదే చంద్రబాబు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇచ్చి ఆదుకున్నారు. విజయవాడలో 43 ఆలయాలను ధ్వంసం చేస్తే, వైయస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత ఆ గుడులన్నింటినీ తిరిగి నిర్మించారు.

LEAVE A RESPONSE