వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో భారీ టెక్స్ టైల్ పార్క్

-వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో భారీ టెక్స్ టైల్ పార్క్:పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ 
-పీఎం మిత్ర పార్క్స్ పథకం కింద ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన
-ఢిల్లీలో జరిగిన ‘జాతీయ స్థాయి పీఎం మిత్ర పార్క్స్ సదస్సు’లో టెక్స్ టైల్ పార్కు ప్రతిపాదనపై ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ప్రజంటేషన్

అమరావతి, మే, 05 : వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో భారీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం మిత్ర పార్క్స్ పథకం కింద 1186 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కును స్థాపించే ప్రతిపాదనను కేంద్రం ముందుంచినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు.విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్(వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్ పరిధిలో లేదా వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్(జేఎంఐహెచ్) లో గానీ భారీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కొప్పర్తి కేంద్రంగా పారిశ్రామిక అవసరాలకు కావాలసిన సదుపాయాలను కూడా ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా టెక్స్ టైల్ యూనిట్లకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసి అండగా నిలబడిన విషయాన్ని కరికాల ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం 2020-2023లో వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీ గురించి కూడా ఆయన వివరించారు. వస్త్ర పరిశ్రమకు కీలకమైన పత్తి ఉత్పత్తిలో ఏపీ దేశంలో 7వ స్థానంలో ఉందన్నారు. సిల్క్ ఉత్పత్తిలో 2వ స్థానమన్నారు. రెడిమేడ్ సహా పలు అత్యాధునిక వస్త్రాలు, చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఏపీది కీలక పాత్ర అన్నారు. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి నెలవుగా కరికాల అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా నిలిపే చేనేత , హస్తకళల శిక్షణ కేంద్రం అనంతపురంలో కొలువై ఉందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ నెల్లూరులో ఉందని స్పష్టం చేశారు. నూలు ఉత్పత్తిలోనూ ఏపీ అగ్రపథంలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో టెక్స్ టైల్ క్లస్టర్లు ఉన్నాయని విశాఖపట్నంలోని బ్రాండిక్స్ అపరెల్ సిటీ (బీఐఏసీ), రెడీమేడ్ గార్మెంట్స్ , టెక్నికల్ టెక్స్ టైల్స్, గుంటూరులోని టెక్స్ టైల్ పార్కు, ప్రకాశంలో వీవింగ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, అనంతపురంలో రెడీమేడ్ గార్మెంట్స్ సహా హిందూపూర్ వ్యాపార్ అపరెల్ పార్క్ లిమిటెడ్, నెల్లూరులో తారకేశ్వర టెక్స్ టైల్ పార్కు, ఎంఎఎస్ ఫాబ్రిక్ పార్క్, చిత్తూరులో వీవింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ , ప్రాసెసింగ్ , రెడీమేడ్ గార్మెంట్స్ వంటి వాటికి ఏపీ చిరునామాగా ఉందన్నారు. ఇన్ని సదుపాయాలు, సకల వసతులు ఉన్న ఏపీలో భారీ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రాంతాలు రైలు, రోడ్డు, ఎయిర్ పోర్టు, పోర్టుల కనెక్టివిటీకి అనుసంధానమై టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ఢిల్లీ సదస్సులో ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే జగనన్న మెగా ఇండస్ట్రియల్ పరిధిలోని జమల్ పల్లిలో 400 కిలో వాట్ల విద్యుత్ గ్రిడ్ ను ఏర్పాటు చేశామని, 132 కిలో వాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉపకేంద్రాన్ని కూడా నెలకొల్పినట్లు మౌలిక సదుపాయాల గురించి స్పష్టం చేశారు. బ్రహ్మసాగర్
prese రిజర్వాయర్ నుంచి 46 ఎంఎల్డీ సామర్థ్యం గల నీటిని కూడా కేటాయించినట్లు ఎండీ పేర్కొన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, 13 కిలో మీటర్ల పైన రవాణా మార్గాన్ని అనుసంధానం, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో సహా అత్యాధునిక సదుపాయాలకు నెలవన్నారు. ఈ టెక్స్ టైల్ పార్క్ వస్తే పొరుగు జిల్లాలైన కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని నైపుణ్యం కలిగిన యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఏపీ ప్రభుత్వ నివేదికను అందజేశారు. స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గతంలో ఢిల్లీలో పర్యటించినపుడు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో ఒకటి కొప్పర్తిలో చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎండీ సుబ్రమణ్యం గుర్తు చేసుకున్నారు.

ఏపీకి త్వరలోనే రానున్న కేంద్ర ప్రతినిధుల బృందం
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో కేంద్ర ప్రతినిధుల బృందం పర్యటించనుంది. పీఎం మిత్ర పార్క్స్ పథకానికి సంబంధించి కొప్పర్తిలో ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు గల అవకాశాలను ఆ బృందం పరిశీలించనుంది. మే 6వ తేదీ శుక్రవారం కేంద్ర టెక్స్ టైల్ శాఖ డైరెక్టర్ హెచ్.ఎస్ నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందు కాంత్, టెక్స్ టైల్ కమిషనర్ కార్యాలయ ప్రతినిధితో కూడిన త్రిసభ్య బృందం ఢిల్లీ నుంచి రానున్నట్లు సమాచారం.

Leave a Reply