– విజయసాయిరెడ్డి సవాల్
– విశాఖకు రాజధాని రాకూడదనే దసపల్లా అంటూ “రాము-చందు”(రామోజీ- చంద్రబాబు) విషం
– కుల, పచ్చ ఇంకుతో రామోజీ విషపు రాతలు- కుల మీడియాపై జనం ఉమ్మేసే పరిస్థితి
– దసపల్లా భూముల వల్ల ఎక్కువగా లబ్ధి జరిగింది బాబు సామాజికవర్గానికే
– అప్పుడూ, ఇప్పుడూ నాది అదే మాట.. విశాఖలో ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది
– పచ్చళ్ళు అమ్ముకున్న రామోజీ లక్షల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడు..?
– నా కూతురికి పెళ్ళి అయ్యాక.. వారి కుటుంబ ఆస్తులు నావి అవుతాయా..?
– బాబు కోడలు బ్రాహ్మణి ఆస్తులు కూడా బాలకృష్ణవి అవుతాయా..?
– రామోజీ కోడలు శైలజా కిరణ్ ఆస్తులు.. ఆమె తండ్రివి అవుతాయా..?
– రామోజీకి పోటీగా మీడియా రంగంలోకి వస్తా.. “కుల రాతల” బండారాన్ని బయటపెడతా
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి
విశాఖకు రాజధాని రాకూడదనే..
విశాఖ భూములపై.. చంద్రబాబు, టీడీపీ వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, వ్యక్తిగతంగా నాపైనా తప్పుడు ఆరోపణలతో, విషపురాతలతో, బరితెగించి దుష్ప్రచారం చేస్తున్నాయి. దీనికి రెండే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రాకుండా చేయాలన్నదే చంద్రబాబు-రామోజీరావు ఉద్దేశం. రెండోది… గుంటూరుకు – విజయవాడకు మధ్యన కాకుండా, ఆ రెండు నగరాలకు 30 కిలోమీటర్ల దూరంలో, దానికి అమరావతి అని పేరు పెట్టి, కొన్నివందల, వేల ఎకరాలు టీడీపీ నాయకులు, వారి బినామీలు, వారికి వత్తాసు పలికే మీడియా మిత్రులంతా కలిసి రైతుల దగ్గర చౌకగా కొనుగోలు చేసి, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేసి, తద్వారా లక్షల కోట్లు గడించాలనే దురుద్దేశంతో విశాఖకు రాజధాని రాకుండా వీళ్ళంతా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి దిగజారుడు విధానాలతో టీడీపీ, వారి అనుకూల మీడియా కూడా ప్రయత్నం చేస్తోంది. నేను, ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి ఆ సంస్థల అనైతిక వ్యవహారాల గురించి మాట్లాడటం ఒకరకంగా ఇబ్బందికరంగానే ఉన్నా మాట్లాడాల్సిన పరిస్థితి వారే కల్పించారు. ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక కులం … తమ కులానికి చెందిన ఒక నాయకుడిని రాష్ట్రంలో తిరిగి గెలిపించుకోవడానికి, ఆయన్ని శాశ్వతంగా సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలనే కులపిచ్చితో, అది సాధ్యం కాదని తెలిసి కూడా, దానిని ఒక టాస్క్‌గా, ఒక టార్గెట్‌గా పెట్టుకుని, రాస్తున్న నీచపు రాతలను, వారి దిగజారుడుతనాన్ని ఎండగట్టేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశాం.
కుల, పచ్చ ఇంకుతో రామోజీ విషపు రాతలు
సాధారణంగా మీడియా ప్రతినిధులు తమ ఆర్టికల్స్‌ను, వార్తలను ఇంక్‌తో రాస్తారు. కానీ రాష్ట్రంలో కొన్ని పత్రికలు కులాన్ని ఇంక్ గా ఉపయోగించుకుని, అది కూడా పచ్చ ఇంక్‌ను ఉపయోగించుకోవడం విశేషం. పచ్చ కామెర్లు ఉన్నవాళ్లకు లోకం అంతా ఎలా పచ్చగా కనిపిస్తుందో.. అలాగే ఈ విషపు రాతలకు రాసే మీడియా సంస్థలకు… వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసేదంతా తప్పుగా కనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు చేసేందంతా కరెక్ట్‌గా వారికి కనిపిస్తుంది. ఈనాడు, దాని అనుబంధ కుల పత్రికలు, టీడీపీకి మద్దతు ఇచ్చే అనుబంధ చానల్స్ రకరకాలుగా ఇష్టంవచ్చినట్లు కథనాలు రాస్తున్నాయి.
– ‘దసపల్లా.. రసగుల్లా, సాయిరెడ్డిగారూ.. ఈ భూములు ఎవరివి..?, సాయిరెడ్డిగారూ ఈ భూముల వివరాలు చెబుతారా?’అంటూ ఈనాడు రాతలు చూశాం. ఇంతకీ ఈనాడు ఉద్దేశం ఏంటి?
– రామోజీ పేరు నామకరణంలోనే ఆయనకు ఆయనే జీ అని గౌరవం ఇచ్చుకుంటున్నారు. ఆయనకు, ఆయన రాతలకు ఎటువంటి గౌరవం లేదు కాబట్టి, ఆయనను ‘రాము’అందాం…
– అందుకే రామోజీని ఇకనుంచి రామోజీ అనొద్దు రాము అనండి..!
– ఈ విషపు రాతల ద్వారా కుల రొచ్చులో కొత్తదారులను అన్వేషిస్తూ.. టీడీపీ కుల పత్రికలు, టీవీ చానల్స్ దిగజారుడుతనాన్ని ప్రదర్శించడం శోచనీయం.
సుప్రీం తీర్పును ఈ ప్రభుత్వం అమలు చేస్తే తప్పేంటి?
దసపల్లా భూముల విషయంలో.. భూముల యజమానులు, బిల్డర్లు ఇప్పటికే వివరణ ఇచ్చారు, వాస్తవాలేమిటో మీడియాకు వివరించారు. ఆ భూములకు సంబంధించి, ఎందువల్ల 22ఏ నుంచి తీసేయాలనే ప్రతిపాదన జరిగిందనేది అందరూ తెలుసుకోవాలి. గతంలో ఈ భూములపై కోర్టులో చాలా కేసులు ఉన్నాయి. అధికారుల అందరి మీద కంటెంప్ట్ వేయడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు కూడా ఇప్పటికీ ఈ కేసులకు సంబంధించి కూడా ప్రతివారం కోర్టులకు హాజరు అవుతున్నారు. గత ప్రభుత్వంలో చేయలేనిది, ఈ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన ఘనత ఈ పార్టీకే దక్కుతుంది. దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అలాగే కంటెంప్ట్ కేసుల్లో అధికారులు ఇరుక్కుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రామోజీ(రాము)కు కూడా తెలుసు. అయినప్పటికీ కుల పిచ్చితో ఈ విషపు రాతలు ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నాం.
– మా ప్రభుత్వ నిర్ణయంతో దసపల్లా భూములకు సంబంధించి దాదాపు 400 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వారంతా ఇళ్లు కట్టుకుని ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వాటిని ఇప్పుడు కూలగొట్టగలమా?. ఇది ప్రభుత్వ భూమి కాదు కదా?. అదొక ప్రయివేట్ భూమి. అందుకే 22ఏలో నుంచి తీసేయడంలో ఏం తప్పుందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 400 ఇళ్లు కాకుండా 64మంది ప్లాట్ ఓనర్లు ఉన్నారు. వారిలో 55మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. వాళ్లంతా చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవాళ్ళే. ఇందులో ఎక్కువగా బెనిఫిట్ పొందింది కూడా చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రమే. 64 మందిలో 55మంది వాళ్లే. దీన్నిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. విశాఖలో ఇంచుమించుగా 75 నుంచి 80శాతం భూములు ఆ ఒక్క సామాజికవర్గానికి చెందినవారివే ఉన్నాయి. వాస్తవానికి విశాఖపట్నంలోగానీ, ఉత్తరాంధ్రలోగానీ సామాజికవర్గ పరంగా తీసుకుంటే కాపులు, యాదవులు, వెలమలు, కాళింగులు, మిగతా వెనకబడినవర్గాలవారే ఎక్కువమంది ఉన్నారు. అక్కడ ఎక్కువ ఆస్తులన్నీచంద్రబాబు సామాజికవర్గానికి చెందినవే. జనాభా మాత్రం వేరే సామాజికవర్గానికి చెందినవారు.
– గతంలో ఎప్పుడో ఈ భూముల్ని కొనుగోలు చేసిన వీళ్ళంతా, ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదు, అమరావతే రాజధానిగా ఉండాలి అని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు కానీ, వారి ఆస్తుల విలువలు మాత్రం పెంచుకోవాలనే దురుద్దేశం కనిపిస్తోంది. దానికి కుల మీడియా తోడ్పడుతుంది.
అది బాబు వైఫల్యం- కుల మీడియాపై జనం ఉమ్మేస్తారు
దసపల్లా స్థలంపై వాస్తవానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆయన తీసుకోలేదు. అది చంద్రబాబు- టీడీపీ వైఫల్యం. పత్రికలు, టీవీలు చేతిలో ఉన్నాయని, టీడీపీ కరపత్రం కన్నా దిగజారిపోయి… దారుణంగా ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా చేయాలే ఒకే ఒక ధ్యేయంతో ఇక్కడ భూములకు ఏదో జరిగిపోతుందంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఈనాడు రామోజీ చేస్తున్నఈ ప్రయత్నాలకు ఈ కుల పత్రికలపై జనాలు ఉమ్మేసే పరిస్థితి ఏర్పడిందని వీళ్లు గమనించుకోవాలి.
– ఇంత బరితెగింపా? మార్గదర్శి చిట్‌ఫండ్స్ విషయంలోగానీ, ఉషోదయ పబ్లికేషన్స్ గానీ, రామోజీకి ఎలా వచ్చాయో అందరికి తెలుసు. రామోజీ(రాము) అనే వ్యక్తి ఎలా బతికాడు?. మొదట ఓ కంపెనీలో గుమస్తా ఉద్యోగం చేసుకునేవాడు. ఆయనకు సహకరించింది జీజే రెడ్డి. ఆ కంపెనీలకుపెట్టుబడి పెట్టిందంతా జీజే రెడ్డి. ఆయన ఈ సంస్థలన్నింటికీ వ్యవస్థాపక ప్రమోటర్. ఆయన్ని ఘోరంగా మోసం చేసి, జీజే రెడ్డి కుటుంబసభ్యుల పేర్లు కూడా ఆఖరికి రికార్డుల నుంచి తొలగించారు. వాళ్లకు ఈ సంస్థల్లో ఇప్పుడు కేవలం మైనర్ షేర్లు మాత్రమే ఉంటాయి. అలాంటి దుర్మార్గుడు ఈ రామోజీ.
రామోజీ అన్నం కాకుండా మరేదైనా తింటాడా..?
రామోజీకు నైతిక విలువలు లేవు. పుట్టుకే అనైతికం. ఇక, అతని పత్రికలకు, మీడియాకు ఏమి నైతిక విలువలు ఉంటాయి?. సాయిరెడ్డి గారూ.. మీ భూముల వివరాలు తెలపాలని హెడ్డింగ్ పెడతాడు. నిజంగా అన్నం తినే మనిషే అయితే ఇలాంటి హెడ్డింగ్ పెడతారా? అన్నం కాకుండా మరేదైనా మీరు తింటారా అని ప్రశ్నిస్తున్నాను. నాకు విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఒకే ఒక్క ప్లాట్ ఉంది అని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్లీ అదే చెబుతున్నాను. అంతకు మించి నాకు ఆస్తులు లేవని స్పష్టంగా చెబుతున్నాను.
– నా కూతుర్ని అరబిందో సంస్థల యజమాని కొడుక్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వాళ్ల ఇంటికి వెళ్లాక ఆమె ఇంటి పేరు కూడా మారింది. ఆమె పేరు ఇప్పుడు వేణుంబాక నేహ కాదు. (పెనక నేహారెడ్డి). వాళ్ల కుటుంబంలో సభ్యురాలు ఆమె. వాళ్లు గత 40ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నారు. వాళ్ళు, రామోజీలా భాగస్వామ్యులను మోసం చేసి ఆస్తులు సంపాదించలేదు. మా వియ్యంకుడి కుటుంబం నిజాయితీగా ఫార్మా ఇండస్ట్రీస్, ఎస్‌ఈజెడ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. అనేక వ్యాపార రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
– మా అమ్మాయిని వాళ్లింటికి కోడలుగా పంపిస్తే… వాళ్ల ఆస్తులు అన్నీ నావి అయిపోతాయా?. ఈమాత్రం రామోజీకి కనీస జ్ఞానం కూడా లేదా? అందుకే రామోజీ అన్నం తింటున్నాడా?.. అని సూటిగా ప్రశ్నిస్తున్నా.
– వాళ్ల పేరుతో ఈ భూములు నేనేదో కొన్నట్టుగా, నా మీద, వైయస్సార్ సీపీపైనా బురదచల్లే కార్యక్రమం రామోజీ చేస్తున్నాడు. నేను కొనుగోలుదారు కాదు, అమ్మకందారుకాదు. నా పాత్ర లేకున్నా నా పేరు పెట్టి బ్యానర్ ఐటమ్ ఎందుకు వేశామని రామోజీని ప్రశ్నిస్తున్నాను,. ఎందుకు ఈ రాతలు, జనాల్ని నమ్మించడానికా? ఉత్తరాంధ్రను మోసం చేయడానికా? అని అడుగుతున్నా.
– దసపల్లా భూముల వ్యవహారం ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని మొన్న ఒక సన్నాసిగాడు అంటాడు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి అర్థం తెలుసా అని ప్రశ్నిస్తున్నా.
– అమరావతిలో జరిగింది ఇన్‌సైడర్ ట్రేడింగ్. మరోవైపు విశాఖలో రాజధాని వస్తుందో, రాదో అని కూడా మీరే చెబుతున్నారు?. ఇలాంటి బతుకులు మీకు అవసరమా రామోజీ.. అని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నా?
– రామోజీ.. నువ్వు చేసిన పాపాలు ఏదో ఒకరోజు అనుభవిస్తావు. కచ్చితంగా ఈ జీవితంలోనే అనుభవించి తీరతావు.
బాబు కోడలు బ్రాహ్మణి ఆస్తులు బాలకృష్ణవి అవుతాయా..?
బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌కు చేసుకున్నాడు. తన కోడలు బ్రాహ్మణి పేరుతో చంద్రబాబు ఆదాయం ఆర్జిస్తే అవి బాలకృష్ణ ఆస్తులు అవుతాయా?. బాలకృష్ణ ఆస్తులు బ్రాహ్మణివి అవుతాయా? ఈ ఇంగిత జ్ఞానం అనేది కూడా రామోజీకి ఉండాలి కదా… !. బాలకృష్ణ సినిమాకు వచ్చే పారితోషికం చంద్రబాబువి అవుతాయా?
– కుటుంబ వారసత్వం కింద చూసినా, చట్టప్రకారం తీసుకుంటే ఒక కప్పుకింద, ఒకే ఇంట్లో నివసిస్తుండాలి. కూతుర్ని ఇచ్చినచోట వాళ్లది ఉమ్మడి కుటుబం అయితే వాళ్ల ఆస్తులు, వ్యాపారాలు వేరు అయినప్పుడు చట్టబద్ధంగా తండ్రి కుటుంబానికి ఆపాదించే అవకాశమే లేదనేది రామోజీ గుర్తించాలి.
– శైలజా కిరణ్ విషయాన్నే తీసుకుంటే… మీ అబ్బాయి కిరణ్‌తో ఆమెకు వివాహం అయ్యాక ఆస్తులు కొంటే, అవి ఆమె తండ్రి ఉప్పలపాటి సుందర్రావు ఆస్తులు అవుతాయా? లేక మీ ఆస్తులు అవుతాయా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని రామోజీని డిమాండ్ చేస్తున్నా. శైలజా కిరణ్ తండ్రికి చెందిన బాలజీ హేచరీస్ రామోజీవి అవుతాయా?. బాలజీ హేచరీస్ రామోజీ రసగుల్లా అవుతుందా?
– మా అల్లుడి కంపెనీకి సంబంధించి పలు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఫార్మా రంగంలోనే దేశంలో నెంబర్ ఫైవ్‌గా ఆ కంపెనీ ఉంది. అలాంటివారిపై బురద చల్లాలని అనుకోవడం కులగజ్జితో కాదా అని ప్రశ్నిస్తున్నా.
– దిగజారుడుతనంలో కూడా ఒక పరిధి ఉంటుంది. పక్కనవాళ్లు చేస్తే వ్యభిచారం. అదే రామోజీ చేస్తే సంసారం… అనే నానుడిని ఆయన బలంగా నమ్ముతాడు. ఇలాంటి వ్యక్తి సమాజంలో బతకడం కూడా అనవసరం.
– మా అమ్మాయి పుట్టకముందే అరబిందో సంస్థను ప్రారంభించారు. మా అమ్మాయి పెళ్లయిన తర్వాత వాళ్లు వ్యాపారాలు మొదలుపెట్టలేదు. ఉదాహరణకు భారత్ బయోటెక్ విషయానికే వస్తే… రామోజీ మనవరాలు భారత్ బయోటెక్ సంస్థ వాళ్ల అబ్బాయి భర్త అయినంత మాత్రాన అది రామోజీ కంపెనీ అవుతుందా?. దీనినిబట్టి, రామోజీ వాల్యూ సిస్టమ్ అనేదే వేరు అని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు.
– మా బంధువులు రామోజీలా ప్రజలను మోసం చేసి భూములను సంపాదించుకోలేదు. 2500 ఎకరాల ఫిల్మ్‌సిటీ ఎక్కడ నుంచి వచ్చింది? ఒక్కోక్క ఎకరా రూ.50వేలుకు ఎలా కొనగలిగావు.
– పచ్చళ్లు అమ్ముకునో, చిన్న చిన్న వ్యాపారాలు చేసో లక్షల కోట్లు సంపాదించే స్థాయి ఎలా వచ్చింది అని అడుగుతున్నా. రామోజీ చేసిందంతా అన్యాయాలు, అక్రమాలే. ప్రజలను దోచుకుని సంపాదించిందే కానీ పచ్చళ్లు అమ్ముకుని మాత్రం కాదు.
– మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నీ డిపాజిటర్లు ఎవరు రామోజీ? వాటి లెక్కాపత్రాలను ఏ కోర్టు అడిగినా ఎందుకు ఇవ్వవు. ఆర్‌బీఐ అడిగినా ఇవ్వవు. డిపాజిటర్లకు డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తి రామోజీ.
రామోజీకి, చంద్రబాబుకు సవాల్
ఇటీవల విశాఖలో ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ నేత ఒకరు.. సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరాడు. నేను రామోజీకి, చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. ఆస్తులపై సీబీఐ, ఈడీ, అమెరికాలో ఉన్న ఎఫ్‌బీఐగానీ ఏ విచారణకు అయినా నేను సిద్ధం. రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా? ఈనాడు సంస్థల పెట్టుబడులన్నీ నిజాయితీగానే వచ్చాయా? సీబీఐ విచారణకు నేను సిద్ధం. మీరు కోర్టుకు లేఖ రాయండి. కోర్టులోనే తేల్చుకుందాం. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ తేలుస్తుంది.
– ఉత్తరాంధ్రకు కార్యనిర్వాహక రాజధాని రానివ్వకూడదనేదే రామోజీ దురుద్దేశం. ఆయన ఆస్తులు ఇక్కడ ఉండాలి. అమరావతిలో రాజధాని ఉండాలన్నదే వారి ధ్యేయం. వీరి కుట్రలను ఉత్తరాంధ్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదించకూడదు. పార్టీలు వేరైనా, ప్రజలంతా ఒకే త్రాటిమీద ఉండాలి. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావాలనే టార్గెట్‌తో పని చేద్దాం. రామోజీ దుశ్చర్యలను ఖండిస్తూ అందరం ముందుకు వెళ్లాలి.
– రామోజీరావు ఈనాడు బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని దాన్ని ఖాళీ చేయకుండా ఆ భవనం యజమాని వర్మని ముప్పతిప్పులు పెట్టాడు. ఆ విధంగా చాలా మందిని ఏడిపించి, బెదిరించి దోచుకున్నాడు. రామోజీ అరాచకాలు, అన్యాయాలపై ఒక సీరియల్ రాస్తాను.
మీడియా రంగంలోకి వస్తా..
ఇదంతా రామోజీకు ఒక పత్రిక, టీవీ ఉంది కాబట్టే కదా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇంతవరకూ నేను ఎలాంటి వ్యాపారం చేయలేదు. పత్రికాముఖంగా చెబుతున్నా… రామోజీ.. ఏ మీడియా రంగంలో అయితే ఉన్నాడో అదే రంగంలోకి నేను ఎంటర్ కాబోతున్నాను. చూసుకుందాం రామోజీ..నీ పత్రిక, నీ చానల్స్ ఏవిధంగా పనిచేస్తాయి. నేను పెట్టే టీవీ చానల్ ఏవిధంగా పనిచేస్తుందో చూసుకుందాం.
– ఒక ఛాలెంజ్‌గా తీసుకుని నీ రంగంలోకి నేను ఎంట్రీ ఇస్తున్నా. నువ్వు, నీ తొత్తులు అడిగినట్లే సీబీఐ విచారణకు నేను సిద్ధం. నువ్వు రెడీనా?
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
దసపల్లా భూమికి సంబంధించి ఆక్రమణకు గురైన 400 ఇళ్లు, 64 ప్లాట్లలో 55 ప్లాట్లు చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవే. బాబు ఈ బాధ్యతను నెరవేర్చి ఉండాలి.
వీళ్లంతా ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లినప్పుడు… న్యాయస్థానంలో ఆర్గ్యూ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. ఆ తర్వాత కంటితుడుపు చర్యగా, సమయం దాటిపోయిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్‌ను వేసి కండెమ్ చేయమనే అభ్యర్థన కూడా చేయకుండా, సుప్రీంకోర్టే కొట్టేసేలా చేసిన ఘనత బాబుదే. ఎందుకంటే సామాజిక వర్గం ఇంట్రెస్ట్‌ను ప్రొటెక్ట్ చేయడానికే. మా ప్రభుత్వం వచ్చాక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా నిర్ణయంతో 400 కుటుంబాలు బాగుపడతాయనే, 64మంది ప్లాట్ ఓనర్లు లబ్ధి పడతారనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి కూడా దురుద్దేశం ఆపాదించగలిగిన వ్యక్తులు ఇద్దరే …వారు ఒకరు రామోజీ, రెండు చంద్రబాబు. వీళ్లిద్దరే.
-ఏదైనా భూములు, ఆస్తులు వ్యవహారంలో అమ్మేవారికి, కొనేవారికి జ్ఞానం ఉండాలి. టైటిల్ చూసుకుని చట్టబద్ధంగా ఉందా లేదా అని గమనించుకోవాలి. జాయింట్ వెంచర్‌లో భూ యజమానికి, డెవలపర్స్ కు షేర్ చేసుకునే పర్సంటేజ్ ఉంటుంది. దసపల్లా భూముల్లో 70-30 రేషియాలో డివైడ్ చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విశాఖలో మాత్రమే జాయింట్ వెంచర్ జరుగుతోంది. కూర్మన్నపాలెంలోని ఆ వెంచర్‌కు సంబంధించి బిల్డర్‌కు 99శాతం, ఓనర్‌కు ఒక్కశాతంతో రాసుకున్నారు. సీఏ చేసిన నాకు కూడా అర్థం కాని విషయం అది. అక్కడలేని అబ్జెక్షన్స్.. మీకు ఇక్కడెందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నా.