November 20, 2026

నేను

నా నుంచి నేను బయటకొస్తాను;
నేను నేనవడానికి ముందుకొస్తాను.

నా మస్తిష్కానికి మనసునిస్తాను;
నా మనసుకు మస్తిష్కాన్నిస్తాను.

నిగ్గు తేల్చుకుంటూ ప్రయాణిస్తాను;
నింగిలో నికేతనం నిర్మించుకుంటాను.

సత్యాల తత్త్వాలతో
నిత్యానుష్ఠానం చేస్తాను;
సర్వథా సన్మయుడినై
సర్వదా తన్మయుడినౌతాను.

ప్రజ్ఞను యజ్ఞోపవీతంగా ధరిస్తాను;
విజ్ఞతా ప్రకరణాలను వివృతం చేస్తాను.

ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తాను;
పరుల కోసమూ పరిమళిస్తాను.

మునుసాగే మునినౌతాను;
కనిపించే ధ్వనినౌతాను.

స్వభావాన్ని ఖడ్గం చేసుకుని
కాలాన్ని కోసుకుంటూ నడుస్తాను;
శరీరం అన్న స్యందనంతో
చేరుకోవలసిన తీరాలను చేరుకుంటాను.

కుశలాల మిసమిసల మసలుతాను;
రస వశమై దశ దిశలా వసిస్తాను.

జననం పల్లవికి
జీవనం చరణాన్ని సంధిస్తాను;
జీవం ఉన్న గీతమై
భావ సంపదతో రవళిస్తాను.

మంత్రంగా మెఱుస్తూంటాను;
నేను మనిషిగా పోతాను!

రోచిష్మాన్
9444012279

Total Visitors: 3,489,948