ఓబీసీ కులగణన జరగాలి

- అప్పుడే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం
- కేటీఆర్ మద్దతు
హైదరాబాద్: ఓబీసీ కుల గణన చేయాలనీ డిమాండ్ చేస్తూ నవంబర్ 28వ తేదీన ఆల్ ఇండియా ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న చలో రామ్లీలా మైదాన్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్స్ జయంత్ యాదవ్, రజినీకాంత్ గౌడ్, మురళీకృష్ణ, చిద్విలాస్, కిరణ్, లోకేష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన సంపూర్ణ మద్దతును తెలుపడం జరిగింది.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. స్థానిక సంస్థలలో బీసీలకు అవకాశాలు కల్పించారు. రాజ్యసభ సభ్యులుగా బీసీలకు అవకాశాలు కల్పించారు. శాసనమండలి మొట్టమొదటి చైర్మన్ గా బీసీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలలో, నామినేటెడ్ పదవులలో బీసీలకు ఎంబీసీలకు అవకాశం కల్పించారు. రాజకీయ చైతన్యం చేయాలన్న తపన కేసీఆర్ కి ఉంది.
రిజర్వేషన్లు అమలు చేయాలంటే కులగణన తప్పకుండా చేయాలి కనుక బిఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంట్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడి, కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. తప్పకుండా ఓబీసీ కులగణన జరగాలి, అప్పుడే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఉంటుంది.
కేసీఆర్ ఆధ్వర్యంలో బీసీలకు బహుజనులకు విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం, కులవృత్తుల అభివృద్ధి, సామాజిక గౌరవం వంటి అనేక రంగాలను పటిష్టం చేయడం జరిగింది. బీసీల అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి అని నమ్మిన నాయకుడు కేసీఆర్. బీసీలకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేసీఆర్ పాలన ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. దాదాపు వెయ్యి గురుకుల విద్యాసంస్థలను విస్తరించి పేద బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం కల్పించారు.
