Suryaa.co.in

Andhra Pradesh

కూటమి నుంచే పోటీ చేస్తా

– దమ్ముంటే అడ్డుకో జగన్!
– కూటమి ఏర్పాటుకాకుండా జగన్ మోకాలడ్డు

– నాకు టికెట్ వస్తే జగన్‌కు కడుపుమంట ఎందుకో
-నాకు టికెట్ రాకుండా బీజేపీ ముసుగులోని వైసీపీ ఫ్యాన్స్‌తో జగన్ కుట్రలు
– విష్ణువర్దన్‌రెడ్డి ద్వారా జగన్నాటకం
– కూటమి ముందు నీ కుట్రలు చెల్లవు జగన్
– నీ కల కల్లే… జగన్మోహన్ రెడ్డి!
– నేను ప్రజావాణిని.. నన్ను ఆపడం కష్టం జగన్‌రెడ్డీ
– రజనీ, సజ్జలను ఎదిరించిన రాజేష్‌ను వైకాపేయులు ఆదర్శంగా తీసుకోండి
– సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్
( ఢిల్లీ- సూర్య ప్రతినిధి)

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల, కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. నరసాపురం స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దరువు, పిడి టీవీ, సాక్షి మీడియా, నీలి చానల్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసి, కుట్రలను పన్ని, నన్ను తప్పించే ప్రయత్నాలు చేసినా నేను నరసాపురం లోక్ సభ స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు .

నేను ప్రజలలో నుంచి వచ్చిన నాయకుడిని…ప్రజాభిమానం కలిగిన నాయకుడిని… జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత మీడియా, నీలి చానల్స్, డబ్బా వెబ్సైట్స్, బిజెపి ముసుగు లో ఉన్న వైకాపా నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే జరిగితే, ప్రజలు ఉన్నారు. అయినా నీ కాసులకు అమ్ముడుపోయే నాయకులు ఎవరు కూడా కూటమిలో లేరని తెలుసుకుంటే మంచిది. అయినా నీ లుచ్చా ప్రయత్నాలను నువ్వు చేస్తూనే ఉన్నావు. ఈ ప్రయత్నంలో నువ్వు కచ్చితంగా ఓడిపోతావు గుర్తుంచుకోమంటూ జగన్మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

బిజెపితో టిడిపికి పొత్తు లేకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి
బిజెపితో టిడిపికి పొత్తు లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారన్న విషయం అందరికీ తెలిసిందేనని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు. పొత్తుకు నాలుగు రోజుల ముందు కూడా, పొత్తు పెట్టుకోవద్దు అంటూ బిజెపి నాయకత్వాన్ని బ్రతిమాలరని, కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నరసాపురం స్థానాన్ని రఘురామకృష్ణం రాజుకు ఇవ్వవద్దంటూ జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బిజెపి తీసుకొని, రఘురామకృష్ణం రాజుకు సీటు ఇవ్వవద్దనేదే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం.

పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీ తీసుకుంటే, టీడీపీ, జనసేనకు సీటు అనేది ఉండదని, అప్పుడు తన మనుషులను పెట్టుకోవచ్చు నని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగా కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించినట్లు తెలిసిందన్నారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. నాకు అదనపు సమాచారం ఏమీ లేదు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన ఆరు స్థానాలలో నరసాపురం కూడా ఉన్నట్లు, అభ్యర్థిగా దాదాపు నా పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నరసాపురం స్థానం నుండి అభ్యర్థిగా నేను పోటీలో ఉండడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి, దరువు అనే యూట్యూబ్ ఛానల్, పిల్ల సజ్జల ఆధ్వర్యంలో నిర్వహించే పిడి టీవీ, సీనియర్ జర్నలిస్ట్ సాయి, 30 నుంచి 40 డబ్బా యూట్యూబ్ ఛానళ్ల తో నాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేనంటే ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నారని, నాకు టికెట్ వస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటన్నది జనం కోణంలో విశ్లేషిస్తూ గుంటూరు చెందిన ఒక వ్యక్తి నాకు లేఖ రాశాడు.

175 కు 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 24 పార్లమెంటు స్థానాలను గెలుస్తానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి, వచ్చే నష్టం ఏమిటంటే… జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తూ, ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ, ఈ ప్రభుత్వం ద్వారా రాజద్రోహిగా చిత్రీకరించబడి, చావు దెబ్బలు తిని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దయవల్ల, మరొక పెద్ద మనిషి సహకారంతో ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి బిజెపి నాయకత్వం సీటు ఇవ్వలేదంటే, జగన్మోహన్ రెడ్డి, బిజెపి ఇంకా కలిసే ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకుంటారనే భావనతో, తన శక్తి యుక్తులనన్ని ఉపయోగించి, రఘురామకృష్ణం రాజుకు నరసాపురం స్థానం నుంచి టికెట్ దక్కకుండా చేయాలని తన జగన్మాయని ప్రయోగిస్తున్నారన్నారు.

రఘురామకృష్ణం రాజుకు నరసాపురం టికెట్ ఇవ్వవద్దని రాయలసీమ ప్రాంతం కదిరి కి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం చెప్పడం వెనుక జగన్ మాయ ఉందన్నారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఒక మృదుభాషి, రఘురామకృష్ణంరాజు పార్టీలోకి వస్తే ఒప్పుకునేది లేదనడం వెనక కూడా జగన్ మాయ పనిచేసినట్టుంది. కడప నుంచి కొంతమంది వైకాపా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల ముసుగులో వచ్చారు. ప్రతి దానిలోనూ మంచిని చూడాలనుకునే వ్యక్తిని నేను.

నరసాపురం పార్లమెంటు స్థానానికి నా పేరు ఖరారు అవుతుందనే భయం వారికి వచ్చి ఉండవచ్చు. అందుకే, వారు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఒక అభ్యర్థి పేరును ప్రతిపాదించారని, ఒక వేళ ఆయన కే సీటు ఇచ్చారనుకుందాం. బిజెపి నాయకుడు జీవీఎల్ కు టికెట్ ఇవ్వలేదని సాక్షి దినపత్రిక ఫస్ట్ పేజీలో న్యూస్ రాసినప్పుడు, నాలుగేళ్లుగా ప్రభుత్వానికి, ఈ దుర్మార్గమైన పాలకుడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాకు టికెట్ ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవచ్చు నన్నారు.

20 శాతం మంది రాజకీయ అభిమానులు ఉన్న నాయకుడిని నేను
రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మంది రాజకీయ అభిమానులు ఉన్న నాయకుడనని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతం చేశానని చెప్పారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎంత పనికిమాలిన వాడో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాను. ఏ పొలిటికల్ పార్టీలో లేకపోయినా నాకు లక్షల సంఖ్యలో పొలిటికల్ అభిమానులు ఉన్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు.

ఈ మూడు పార్టీలు కలిసి రఘు రామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వకుండా ఆయన గొంతు కోశారని ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించడం ద్వారా, నాకున్న లక్షలాది మంది రాజకీయ అభిమానులు నోటా, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జై భారత్, జై భీమ్ వంటి పార్టీలకు ఓట్లు వేస్తారన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన. రఘురామ కృష్ణంరాజుకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటు వేయరని తద్వారా, తన పార్టీ అభ్యర్థికి ఓటు వేయించుకొని గెలిపించుకోవచ్చునని జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఊహిస్తున్నట్టుగా ఈ కూటమికి ఎటువంటి అప్రతిష్టరాదు.

ఎందుకంటే, నరసాపురం పార్లమెంట్ టికెట్ నాకే కేటాయించనున్నారు. రఘురామకృష్ణం రాజుకు నరసాపురం టికెట్ రాదని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుబంధ చానల్స్, నీలి మీడియా కు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రఘురామ కృష్ణంరాజుకు టికెట్ రానివ్వకుండా చేస్తే, మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నప్పుడు… కూటమి నాయకులకు ఆ మాత్రం లాజిక్ ఉండదా? అని నిలదీశారు. పొత్తుల గురించి మాట్లాడేది రాష్ట్ర స్థాయిలో బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి, జాతీయస్థాయిలో అధ్యక్షులు జేపీ నడ్డా తో పాటు ఇతర ప్రముఖులని, కొంతమంది పనిగట్టుకొని పొత్తుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

బిజెపికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామంటేనే పొత్తు అని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. పొత్తులను తెగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి విష్ణు అస్త్రాన్ని ప్రయోగించారు. నా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావించే జగన్ మాయతో విష్ణు అస్త్రాన్ని సంధించారు. సీట్లను కేటాయించేది జాతీయస్థాయిలో బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, రాష్ట్రస్థాయిలో అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ఇతర ప్రముఖ నాయకులని గుర్తు చేశారు. ఈ లోపు గానే వీరు బట్టలు చింపేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘు రామ కృష్ణంరాజు నిలదీశారు.

పొత్తుల గురించి చర్చల కోసం కూటమి నాయకులతో కలిసి నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు, నన్ను ఇంట్లోకి రానివ్వలేదన్నట్లుగా కొన్ని పనికిమాలిన చానల్స్ కథనాలను ప్రసారం చేశాయి. ఇలా అసత్యాలను ప్రసారం చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి గీతాంజలి ని అని అనుకుంటున్నారా? అని ప్రశ్నించిన ఆయన, ఐ వి ఆర్ ఎస్ మెసేజ్ కాల్స్ ద్వారా నన్ను బండ బూతులు తిడుతున్నారని, అటువంటి వారి తిత్తి తీస్తానని హెచ్చరించారు.

వైఎస్ కూతురే కాదని షర్మిలారెడ్డి ని వైకాపా నేతలు అవమానించారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డిని ఆయన కూతురే కాదని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వైకాపా నేత ఘోరంగా అవమానించారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఒక కూతురును ఆమె తండ్రికి పుట్టలేదని పేర్కొనడం కంటే దారుణం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. లండన్ లో నివసించే స్వాతి రెడ్డి ని ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించారు.

సొంత బాబాయిని హత్య చేయించాడని తెలిసి కూడా న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి, ఏనాడు కూడా నోరు తెరిచి ఈ హత్య మా అన్నయ్య చేయించాడని చెప్పకపోయినా, భారతీ రెడ్డి పి ఏ ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఈ నాలుగేళ్ల నుంచి సోషల్ మీడియా వేదికగా నన్ను ఎంతగా ట్రోల్ చేస్తున్నారో, గత ఐదు రోజుల నుంచి ఐ వి ఆర్ ఎస్ మెసేజ్ కాల్స్ ద్వారా బండ బూతులు తిడుతూ హింసిస్తున్నారు. అయినా నేను భయపడేది లేదు. వైకాపా సర్వనాశనం అయ్యేవరకు నిద్రపోను. మరో 70 రోజుల వ్యవధిలో వైకాపా ఫినిష్ కావడం ఖాయం. ఐ విల్ ఫినిష్ ఇట్… అందులో ఎటువంటి అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి అంటూ రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు.

ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లే గీతాంజలి బ్యాగును వెంట తీసుకు వెళుతుందా?
సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న గీతాంజలి, భుజాన బ్యాగు ఉండడం పలు అనుమానాలకు తావు ఇస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేవారు ఎవరైనా భుజాన బ్యాగ్ వేసుకొని వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రమాదం వల్లనైనా, మరే ఇతర కారణాలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు. సోషల్ మీడియాలో కామెంట్లు సర్వసాధారణం. సోషల్ మీడియా కామెంట్లు ఆధారంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది అమాయకత్వమే.

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను ఎంజాయ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. నన్ను పేటీఎం కూలీలు ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తారని, అంతమాత్రానికే నేను ఆత్మహత్య చేసుకుంటానా? అంటూ ప్రశ్నించారు. గీతాంజలి ఆత్మహత్య అనంతరం హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు, పోలీసులు రంగప్రవేశం చేసి సోషల్ మీడియాలో ఎవరెవరు కామెంట్లు చేశారోనని ఆరా తీస్తున్నారు.

వైకాపా వాళ్లే గీతాంజలి హత్య చేసి, ట్రోల్ చేస్తున్న వారి ఖాతాలో ఖర్చు రాసి ఉంటారు. ఎందుకంటే గతంలో వైకాపా ఎంపీ ఒకరు నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. నేను కూడా అతనిపై తిరగబడి చేయి చేసుకొని ఉంటే నా ఖాతాలో అతని ఖర్చు రాసేయ్యాలన్నది వైకాపా నాయకత్వం ప్లాన్. ఈ విషయం ముందే తెలిసి నేను జాగ్రత్త పడ్డాను. దానితో ఆ ఎంపీ బ్రతికి బయటపడగా, నేను జైలుకు వెళ్లే ప్రమాదం తప్పిందని రఘురామకృష్ణం రాజు వివరించారు.

రాజేష్ నాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎన్నికల్లో టికెట్ల కోసం ఎంతోమంది వద్ద వైకాపా నాయకత్వం డబ్బులను వసూలు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైకాపా నాయకత్వానికి డబ్బులు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులను రాబట్టుకోవాలంటే రాజేష్ నాయుడు ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రి విడుదల రజిని గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా రాజేష్ నాయుడు ని నియమించారు. రానున్న ఎన్నికల్లో , టికెట్ కోసం ఆరున్నర కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా రాజేష్ నాయుడు మీడియా ముందు వాపోయారు.

ఆరున్నర కోట్ల రూపాయలలో నుంచి పెద్ద మనసు చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి మూడు కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చాడట. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయి. టికెట్ల కోసం డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు, తమ సగం డబ్బులనైనా రాబట్టుకోవాలంటే రాజేష్ నాయుడు తరహాలో మీడియా ముందుకు వెళ్తామని చెప్పాలి. ఈ వార్త అన్ని చానళ్ల లో, పేపర్లను ప్రముఖంగా వచ్చినప్పటికీ, సాక్షి దినపత్రిక లో మాత్రం కనిపించలేదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE