ముద్రగడ పద్మనాభం చేరికకు ఏమైంది?

తమకు విద్య, ఉపాధి రంగాలలో తగిన రిజెర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు కులస్థులు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన నేతగా ప్రసిద్ధులైన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ లో చేరడానికి సిద్ధమై పోయిన విషయం తెలిసిందే. ఈ దశగా, వైసీపీ నేతలు చంద్రశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కిర్లంపూడి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వాటి ఫలితంగా, ఈ నెల 14 వ తేదీ, అంటే… శుక్రవారం…. తన ఇంటివద్ద ఉదయం 8 గంటలకు (బహుశా ముహూర్తం కావచ్చు ) బయలుదేరి, ఏ ఏ ఊళ్ల మీదుగా తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ లో చేరనున్నదీ సవివరంగా ఆయన ఒక లేఖ విడుదల చేశారు.

అలాగే, తనతో విజయవాడ తమ తమ వాహనాలలో ఫాలో అయ్యేవారు మంచినీరు, ఆహార పదార్ధాలు వారే తెచ్చుకోవాలి అని కూడా పద్మనాభం, తన అభిమాన… అనుచర లోకానికి విజ్ఞప్తి చేశారు. పద్మనాభం పిలుపు అందుకుని, దాదాపు వెయ్యి వాహనాలలో ఆయనను అనుసరించడానికి ఆయన అభిమానులు సిద్ధం అయినట్టు సమాచారం.

అయితే, ఇంతమంది వస్తే, తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో తీవ్ర తొక్కిసలాట జరిగే ప్రమాదాన్ని పద్మనాభం ముందుగానే పసిగట్టి, తన అనుచరులు ఎవరూ తనను అనుసరించి తాడేపల్లి రావద్దని ; తాను ఒక్కడినే వెళ్లి…. వైసీపీ లో చేరతాను అని ముద్రగడ మరో లేఖ లో తన అభిమాన లోకానికి విజ్ఞప్తి చేశారు.

అయితే, ఇక్కడ రెండు… మూడు ట్విస్ట్ లు లేక పోలేదు. తాను, వైసీపీ లో చేరడానికి గాను తన ఇంటి నుంచి ఉదయం 8గంటలకు బయలు దేరుతున్నానని ముద్రగడ, తన మొదటి లేఖలో పేర్కొన్నారు. అంటే, చేరిక కార్యక్రమం మొత్తం ఫిక్స్ అయితేనే కదా, ఈ రకం గా ఆయన ప్రకటించి ఉండేది. మరి, 14 వ తేదీ షెడ్యూల్ ఎందుకు మారిందో…. ఆయన వివరించలేదు. పదిహేనో…. పదహారునో…. తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి, ముఖ్యమంత్రి జగన్ సమక్షం లో వైసీపీ లో చేరుతాను అని రెండో లేఖలో ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి తో సంబంధం కలిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి ఇంత అస్పష్టత ఉంటుందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయం గా పాల్గొనే కార్యక్రమం అనేది తేదీలు, గంటలు, నిముషాలతో సహా ముందుగానే ఖరారవ్వదా? ఈ చేరిక పండుగకు కేవలం ఒక్కరోజే సమయం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు అనే స్పష్టత లేకపోవడం ఏమిటనే ఆశ్చర్యం… ఆయన అభిమాన లోకం లో చక్కర్లు కొడుతున్నదని కాకినాడ లో చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి, వైసీపీ లో ముద్రగడ చేరికకు బ్రేకులు ఏమైనా పడ్డాయా అనే అనుమానాలు బయలు దేరుతున్నాయి.

చంద్రబాబు అమలు చేయలేకపోయిన కాపు రిజర్వేషన్లు జగన్ అమలు చేస్తారని వైసీపీ తరఫున ముద్రగడకు హామీ ఏదో లభించినందునే, వైసీపీ లో చేరడానికి ఆయన బయలు దేరుతున్నారని ఆయన అభిమాని ఒకరు చెప్పారు. ఆయనకు, స్వీయ రాజకీయ ప్రయోజనాల కంటే, కాపు జాతి ప్రయోజనాలే ముఖ్యం అనే సంగతి తెలిసిందే.

నిజానికి, ముద్రగడతో డీల్ చేయవలసిన పరిస్థితి ఎదురైన ఏ నాయకుడు అయినా, కిర్లంపూడి రావడం రివాజు. గతం లో చంద్రబాబు నాయుడు వెళ్లారు. రాజశేఖర రెడ్డి వెళ్లారు. కోట్ల విజయభాస్కర రెడ్డి వెళ్లారు. కాపు ఉద్యమ కాలం లో బోలెడంతమంది టీడీపీ మంత్రులు వెళ్లారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా వెడతారు అని వార్తలు వచ్చాయి. అదీ పద్మనాభం లెవెలు.

కానీ, ఈ సారి మాత్రం, ఇంకో పార్టీ లో చేరడానికి ఆయనే ఇంటి నుంచి బయలు దేరి వెళ్లడం విశేషమే. కాపు జాతి సంక్షేమం దృష్టి లో పెట్టుకుని, ఆయనే ఒక మెట్టు దిగి ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు ఆఫీస్ కు వెళ్ళి, వైసీపీ లో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు.

అయితే, ఇది కూడా సవ్యం గా జరగడం లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. గతం లో ఒకసారి, ఒక కాపు నేతకు ఇలాగే జరిగింది. బీజేపీ లో అప్పుడు అసహనం గా ఉన్న ఇప్పటి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ లో చేరాలి అని డిసైడ్ అయిపోయారు. చేరిక ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఫ్లెక్సీ లు వెలిశాయి. కానీ, చేరలేదు. చివరి నిముషం లో ఆయన ఆస్పత్రి లో చేరిపోయారు.

కన్నా ను వైసీపీ లో చేర్చుకోవద్దని కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీ పెద్దలకు చెప్పారని ; దానితో కన్నా చేరికకు బ్రేకులు పడ్డాయని అప్పుడు వార్తా కథనాలు షికార్లు చేశాయి. ఇప్పుడు కూడా, అటువంటి బ్రేకులు పద్మనాభం చేరికకు అడ్డం పడుతున్నాయేమో అనే విషయంలో స్పష్టత లేదు.

లేకపోతే, పదిహేనునో…. పదహారునో….. అని పద్మనాభం ఎందుకు అంటారు? అంటే, తాను ఎప్పుడు చేరుతానో ఆయనకే స్పష్టత లేదు అనేగదా , ఆయన రెండో లేఖలోని అంతరార్ధం!? పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తే ; వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేయాలని ముద్రగడ ఉత్సాహం గా ఉన్నారని కాకినాడ వార్తలు సూచిస్తున్నాయి.

అప్పుడు, ఎలా తనను గెలిపించాలనే విషయం వైసీపీ నాయకత్వం, కాకినాడ ఎం ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చూసుకుంటారు అనే ధీమా లో పద్మనాభం ఉన్నారని కూడా చెబుతున్నారు. బాగానే ఉన్నది కానీ, పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజక వర్గం నుంచి ముద్రగడకు వైసీపీ టికెట్ ఇవ్వవద్దు అని బీజేపీ ఢిల్లీ పెద్దలు చెబితే….!?

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

Leave a Reply