-ఎంపీ, ఎమ్మెల్యేల బృందానికి సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
-ఉన్నతస్థాయి కమిటీ వేయాలని సీఎం అడిషనల్ సెక్రటరీకి ఆదేశం
రాజమహేంద్రవరం: రాజమండ్రి పేపరుమిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వబోమని, తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని సీఎం అడిషనల్ సెక్రటరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పేపరు మిల్లు కార్మికుల సమస్య గురించి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
సమస్య ఏమిటని ఇప్పటికి ఎన్ని అగ్రిమెంట్లు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. వైసీపీ హయాంలో వేతన ఒప్పందంపై జాప్యం చేస్తూ వచ్చిందని, గతంలో జేసీఎల్ సమక్షంలో, ప్రజా ప్రతినిధుల సమక్షంలో వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా గత డిసెంబరు 24న జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో రూ 3,500 మించి జీతం పెంపు చేయడం తమ చేతుల్లో లేదని మేనేజ్ మెంట్ తేల్చేసిందని తెలిపారు.అయితే గతంలో చేసిన ఒప్పందంలో పేపరుమిల్లు కార్మికులకు రూ.9 వేలు పెరిగిందని చంద్రబాబుకు వివరిస్తూ, ఈసారి కూడా కార్మికులకు న్యాయం జరిగేలా చూడాల్సి ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ, పేపరు మిల్లు యాజమాన్య తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ, కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని, వారికి న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీ వేయాలని అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు.