Suryaa.co.in

Telangana

కేసు పెట్టాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డిపై పెట్టాలి

– రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ తో రాత్రి బీజేపీతో సంసారం
– రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు..అడుగువేస్తే మోసాలు
– కాంగ్రెస్ నాయకులు ఏసీబీ ని ప్రభావితం చేస్తున్నారా ? డైరెక్ట్ చేస్తున్నారా?
– మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారు
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 13 నెలల కాలంలో రేవంత్ రెడ్డి తీరు నోరు తెరిస్తే అబద్దాలు..అడుగువేస్తే మోసాలు. సోనియాగాంధీ గొప్ప నాయకురాలు అని ఇవాళ ఢిల్లీలో అంటున్న రేవంత్ రెడ్డి… గతంలో బలిదేవత అన్న సంగతి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు.

2004 లో హామీ ఇచ్చి తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసి, వేలాది తెలంగాణ బిడ్డల చావుకు సోనియాగాంధీ కారణం అని రేవంత్ రెడ్డి గతంలో విమర్శించారు. రాహుల్ గాంధీ నాలుగు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, రాహుల్ గాంధీ దృష్టిలో పడటానికి ఇవాళ రేవంత్ సోనియాను పొగుడుతున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 400 రోజులైనా నెరవేరలేదు ..ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు.

మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదు,అందుకే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ని ఓడించారు. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారు. మహిళలకు నెలకు 2500,తులం బంగారం,నిరుద్యోగ భృతి,స్టూడెంట్ కార్డు ఇలా ఇచ్చిన ఏ హామీలు అమలు కాలేదు. మేము తెలంగాణ లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము అని ఢిల్లీ లో చెబుతున్న రేవంత్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చూపాలి.

రుణమాఫీ అన్నావు 30 శాతం అమలు కాలేదు. రైతు భరోసా ఊసే లేదు..సంక్రాంతికి అన్నారు సంక్రాంతి కూడా అయిపోయింది. రాష్ట్రం లో రేవంత్ రెడ్డిని నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని గమనించాలని ఢిల్లీ ప్రజలను కోరుతున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా,బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లారు. ఇది అక్రమ కేసు ఇందులో నయా పైసా అవినీతి జరగలేదని కేటీఆర్ మొదట్నుంచీ చెప్తున్నారు.

రేవంత్ రెడ్డి కక్షతో అక్రమ కేసు బనాయించి ఇబ్బంది పెట్టినా ..విచారణ సంస్థలకు కేటీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాకుండా, చట్టానికి లోబడి పని చేయండి. లేకుంటే అన్ని రోజులు ఒకేలా ఉండవని సూచిస్తున్నా.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కేటీఆర్ పై రేవంత్ రెడ్డి కక్ష తో పెట్టిన ఒక అక్రమ కేసు. హైదరాబాద్ ప్రతిష్ఠ కోసం ఫార్ములా-ఈ రేసు విషయంలో కేటీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్ రేస్ లో ప్రతి రూపాయికి లెక్క ఉంది ఎక్కడ అవినీతి జరుగలేదు.42 కోట్లు ప్రభుత్వ ఖాతా నుండి బదిలీ అయ్యాయి. ఎందరో ప్రముఖులు ఈ రేసు ను ప్రశంసించారు.ఈ మోబిలిటి రంగంలో ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్శించింది.

రెండో సారి రేసు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయడంతో రాష్ట్రానికి నష్టం జరిగింది. కేసు పెట్టాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి. ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రిని విచారణ చేయాలి. మొదట్నుంచీ చెబుతున్నట్లే కాంగ్రెస్, బీజేపీ నేతల అసలు రంగు బయట పడుతోంది. కేటీఆర్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకే రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బిజెపి ఒకరినొకరు ప్రేమించు కుంటున్నారు .వారిది అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ.

కేటీఆర్ పై ACB అక్రమ కేసు బనాయించగానే కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ ఆయన్ని అరెస్ట్ చేయాలని అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏసీబీ ని ప్రభావితం చేస్తున్నారా ? డైరెక్ట్ చేస్తున్నారా ? కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దారిలోనే బిజెపి నాయకులు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయాలని అంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,బిజెపి ఎంపీలు ఈడీని ప్రభావితం చేస్తున్నారా?

రేవంత్ రెడ్డి పగలు అంతా కాంగ్రెస్ తో రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నాడు. బీజేపీ కార్యాలయంపై దాడి విషయంలో వెంటనే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు… బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడుల గురించి ఎందుకు స్పందించడం లేదు? పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగంలో ఉన్న ప్రతి అవకాశాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అధికారికంగా ప్రకటించారు. సంజయ్ పై సభాపతి ప్రసాద్ కుమార్ అనర్హత వేటు వేయాలి.

రేవంత్ రెడ్డికి తన పాత మూలాలను మర్చిపోలేక పోతున్నారు, పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. కేటీఆర్ ఉద్యమ కారుడు, ఉద్యమ కారుని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ,పోరాట పటిమ కల నాయకత్వం కలవాడు. మీరెన్ని కేసులు పెట్టినా మీ పిట్ట బెదిరింపులకు కేటీఆర్ భయపడే రకం కాదు. మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది మీ కుట్రలను ఛేదించుకొని కడిగిన ముత్యం లా కేటీఆర్ బయటకు వస్తారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు,13 హామీలు 420 వాగ్దానాలు అమలు అయ్యేదాక తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ సైనికులుగా కేటీఆర్,మేము పోరాడుతూనే ఉంటాం..మీ వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతూనే ఉంటాము.

LEAVE A RESPONSE