Suryaa.co.in

Andhra Pradesh

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… ప్రతిపక్షానిదే విజయం

– మార్చి, ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు?
– ప్రతిపక్షాలకు 115 స్థానాలు… పాలకపక్షానికి 60 మాత్రమే
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేలోని వెల్లడైన నిజం ఇది
– గడపగడపకు ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్యేలు వెళ్తారు?
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షానికి 115 స్థానాలు, పాలకపక్షానికి 60 సీట్లు మాత్రమే వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేయించుకున్న సర్వేలో వెల్లడైందని తనకు తెలిసిందని నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

డిసెంబర్ లో శాసనసభ రద్దు చేస్తే, మార్చి, ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించకుండా, కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, సలహాదారుల తో మాత్రమే నిర్వహించారన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం మాత్రమే పాస్ అయితే, ఎమ్మెల్యేలు ఎలా ఫెయిల్ అయినట్టు అని ఆయన ప్రశ్నించారు.

151 మంది ఎమ్మెల్యేల లో, 150 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయితే, ఈ ప్రభుత్వం ఎలా పాస్ అయిందని ముఖ్యమంత్రి పేర్కొంటున్నారో, తనకు అర్థం కావడం లేదని రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క గడప తొక్కని, బస్ స్టాండ్ కూడా నిర్మించని ఎమ్మెల్యే పాస్ అయితే… మిగతావారు ఎలా ఫెయిల్ అయినట్టు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఒక్కరోజు తిరిగితే చాలని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మిగతా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో 20 రోజులు తిరగాల్సిన అవసరం లేదన్నారు.

గడపగడపకు కార్యక్రమానికై, ప్రజల మధ్యకు వెళ్ళిన శాసనసభ్యులను మౌలిక వసతులను కల్పించాలంటూ స్థానికులు నిలదీస్తున్నారని చెప్పారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ… రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి వసతిని కల్పించాలని స్థానికులు కోరుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వేల మంది అర్హులకు అమ్మ ఒడి పథకాన్ని ఎగ్గొట్టారని, తాను గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యకు ఎలా వెళ్లాలని ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లు తెలిసిందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

అయితే, ఇంటి వైశాల్యం వెయ్యి చదరపు అడుగులకు మించిన, విద్యుత్ చార్జీలు అధికంగా వచ్చిన అమ్మ ఒడి పథకానికి అనర్హులని ముఖ్యమంత్రి పేర్కొనడంతో… రెండేళ్లలో ఇంటి వైశాల్యం పెరగదు కదా అని బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పినట్లు తెలిసిందన్నారు.. బాలినేని ప్రశ్నకు ముఖ్యమంత్రి కూడా సమయస్ఫూర్తితో స్పందిస్తూ రెండేళ్లు ఇచ్చిన అమ్మ ఒడి పథకము డబ్బులను వెనక్కి తీసుకోవాలని అన్నారన్నారు. అయితే ఇది నిజంగా చమత్కారమా?, లేకపోతే మరేదైనా స్కీమా?? అంటూ రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు.

పింఛన్ల డబ్బులను వెనక్కి ఇవ్వండి… లేదంటే మీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు చేస్తారేమోనని, ఎందుకంటే ఇటీవల రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే లక్షల్లో ప్రజలకు డబ్బులు ఇస్తున్నామని, వేలల్లో పన్నులు కట్టలేరా? అని ప్రశ్నించినట్లు తెలిసిందన్నారు. రానున్న ఎనిమిది నెలల పాటు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గడపగడపకు ఎమ్మెల్యేలు తిరగాల్సి ఉందన్నారు.. అయినా ముఖ్యమంత్రి తీసుకువచ్చిన తుగ్లక్ వాలంటీర్ వ్యవస్థ అనంతరం ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య సంబంధాలు ఎక్కడ ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టి, పింఛన్ డబ్బులు పంచేందుకు వాలంటీర్ వ్యవస్థ ను తీసుకు వచ్చిన తరువాత ఇక ఎమ్మెల్యేల మాట ఎవరు వింటారని అన్నారు.

విఫల సినిమాకు విజయ యాత్ర లాగా ఉంది వ్యవహారం
గతంలో ఉన్న సంక్షేమ పథకాల కే, పేర్లు మార్చి , జగన్ ప్రభుత్వం అమలు చేసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. పాత సినిమా కు కొత్త టైటిల్ పెట్టి రిలీజ్ చేసినట్లుగా, పాత సంక్షేమ కార్యక్రమాలనే , కొత్త పేర్లతో అమలు చేశారన్నారు. అమ్మ ఒడి తప్ప కొత్త సంక్షేమ కార్యక్రమం టూ ఏదీ లేదన్నారు. ఫ్లాప్ అయిన సినిమాకు విజయ యాత్ర లాగా, బీసీ, ఎస్సీ, ఎస్ టి, మైనార్టీ మంత్రులతో విజయ యాత్ర ను చేయించారని అపహాస్యం చేశారు. రాష్ట్రములో పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇవ్వలేదని, రెండు లక్షల మంది పెళ్లిళ్లు చేసుకుంటే అంటే వారందరికీ ఎగగొట్టిందని రఘు రామ అన్నారు..

ఈసారి గెలిస్తే చాలట..
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిస్తే గెలిస్తే చాలని, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు, ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావుకు వయస్సు అయిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈసారి గెలిస్తే ఆ తర్వాత ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించేవారు ఉండరని దీని అర్థమా అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బి ఆర్ నాయుడు వంటివారు… నిజాలే మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికల సర్కులేషన్ కరోనా సమయమున కాసింత తగ్గినా, ఇప్పుడు మళ్లీ పుంజుకుందని కానీ సాక్షి దినపత్రిక సర్కులేషన్ సగానికిపైగా పడిపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేసిందని, దాన్ని కేంద్ర నిధుల ద్వారా మరింత మెరుగు పరుచుకుందామని తాను గతంలో చెప్పానని పేర్కొన్నారు. అయితే వేలకోట్ల స్కీమ్ లకు ప్రణాళికా రచనలు చేసి రాష్ట్రంలో మౌలిక వసతుల పరిస్థితిని అధోగతికి తీసుకువచ్చారని మండిపడ్డారు.

120 మంది మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగరు
రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చు తానని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్న , అసలు 120 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ టికెట్ అడిగే పరిస్థితి లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. తానే ఎన్నికల ఖర్చుల నిమిత్తం డబ్బు సహాయం చేస్తానంటే తప్ప అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో 175 స్థానాలు మనకు ఎందుకు రావని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన, ఇప్పుడేదో మళ్లీ 151 స్థానాలు గెలిచే వాడిలాగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కుప్పం మున్సిపాలిటీ గెలిచిన స్ఫూర్తితో పని చేయాలని జగన్మోహన్ రెడ్డి చెబుతూ, రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు కుల మత ప్రాంతాలకతీతంగా , అన్ని సౌకర్యాలు అందించామని పేర్కొనడం తో, ఎమ్మెల్యే లు ఇక ఏమి సమాధానం చెప్పగలరని ప్రశ్నించారు.. నోరులేని ఎమ్మెల్యేలు, విషాద వదనాలతో విరహగీతాలు పాడుకోవడం మినహా చేసేదేమీ లేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇక మన బొమ్మ అయిపోయిందని అర్థం అయింది అన్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా, కొత్త ముఖాలను చూసి ఓటేయమని అడగాలని అనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందన్నారు.

బాబు హయాంలో 94 శాతం ఉత్తీర్ణత… మరి ఇప్పుడో?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో పదవ తరగతి విద్యార్థులు 94 శాతం ఉత్తీర్ణత సాధించగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో 68 శాతానికి ఉత్తీర్ణత శాతం పడిపోయిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు బిట్ ప్రశ్నలు తొలగించడం వల్ల తీవ్రంగా నష్టపోయారని, అయినా విద్యార్థుల మేధస్సును పరీక్షించేలా ప్రశ్నపత్రాలు ఉండాలన్నారు. పదవ తరగతి పరీక్షల ఫలితాల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్కటి సూచనలు చేశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు కలుపాలని, అలాగే ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద నుంచి, మళ్లీ పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని కోరితే… ఆయనపై ఒకరిద్దరు వ్యక్తులతో వ్యక్తిగత విమర్శలు చేయించడం ఏమిటని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అంటే విరోధులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదని, ఇంకా అభిమానులు పెరుగుతారని, వచ్చే నష్టం అంతా మన పార్టీకేనంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 8 నెలల తరువాత రానున్న ఎన్నికలపై సమీక్షించిన జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థ, కోనసీమ అల్లర్లపై సమీక్షించ కపోవడం.హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలోని రైతుల పొలాల్లో కరెంటు మీటర్లను బిగిస్తున్నట్లుగా తనకు కొంతమంది రైతులు ఫోన్ చేసి చెప్పారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అయితే, రైతుల పొలాల్లో కరెంటు మీటర్లను బిగిస్తామని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల గ్రాంటును పొందిందన్నారు. కరెంటు మీటర్ల భూతం నుంచి రాష్ట్ర రైతాంగం తప్పించుకో లేదన్న ఆయన, బ్యాంకు ఖాతాల భూతము నుంచి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డిస్కమ్లకు నిధులు బదిలీ చేయాలని, రైతుల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ ఖాతాలో కి బదిలీ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని గడపగడపకు కార్యక్రమం కోసం తమ వద్దకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించి, బ్యాంకు ఖాతాల భూతం నుంచి రైతాంగం తప్పించుకోవాలని సూచించారు.

వివేకా హత్య కేసు విచారణ వేగవంతం చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సి బి సి ఐ డి వేగవంతం చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందడంపై రఘు రామ స్పందిస్తూ… కేసు విచారణ ఆలస్యమైతే, ఇలాగే సాక్షుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలం గడిచే కొద్దీ ఎవరైనా శివ సాన్నిధ్యాన్ని చేరుకోవాల్సిందే నని, అందుకే కే సాక్షి దినపత్రిక సర్కులేషన్ మాదిరిగా సాక్షులు తగ్గి పోకముందే విచారణను పూర్తి చేసి దోషులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సి.బి.ఐ తన దర్యాప్తులో భాగంగా 14 చోట్ల ఫోటోలను తీసుకున్నట్లు తెలిసిందన్నారు. వివేక హత్య అనంతరం దోషులు ఎలా పారిపోయారన్నదానిపై సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE