Suryaa.co.in

National

ఎస్సీ,ఎస్టీ యాక్టు కింద కేసు నమోదయినా..సివిల్ కేసులైతే కోట్టేయవచ్చు

– రాజ్యాంగంలోని 142వ అధికరణ ప్రకారం కోర్టులకు ఆ విశేషాధికారం
– సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు
– మధ్యప్రదేశ్‌లో భూ వివాదం కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టివేత
న్యూఢిల్లీ: ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ..ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా చేయని నేరమైతే.. ఇరు పక్షాలు రాజీకొచ్చి, కోర్టు సంతృప్తి చెందితే దానిపై చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులకు ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు.. వారికి రెండింతల రక్షణనందించేందుకు రాజ్యాంగంలోని 15, 17, 21 అధికరణలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని రూపొందించిన వాస్తవాన్ని కోర్టులు గుర్తుంచుకోవాలని సుప్రీం సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దోషిగా గుర్తించిన వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరుగుపొరుగు కుటుంబాల మధ్య భూతగాదా వచ్చింది. దీనిపై జరిగిన ఘర్షణలో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అవతలి కుటుంబానికి చెందిన మహిళపై రాయి విసిరి, ఆమెను కులం పేరుతో దూషించారంటూ కేసు నమోదైంది.
ఈ కేసులో వారికి కింది కోర్టు ఆరునెలల జైలు శిక్ష, రూ.100 జరిమానా పడింది. దీంతో వారిలో ఒక వ్యక్తి మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అతడి అప్పీలును తిరస్కరించింది. దీనిపై అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందినవారు వేధింపులకు, అవమానాలకు, అమర్యాదకు గురికాకుండా నిరోధించే సదుద్దేశంతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను ప్రత్యేకంగా రూపొందించారని.. అయినప్పటికీ వారు అగ్రవర్ణాలవారి చేతుల్లో పలు దుర్మార్గాలకు గురవుతున్నారని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఎస్సీ, ఎస్టీలు సమాజంలో బలహీనమైన వర్గాలకు చెందినవారు కావడంతో.. నిర్బంధాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువని, వారికి ఎక్కువ రక్షణ అవసరమని అభిప్రాయపడింది. కాబట్టి ఇలాంటి కేసుల విషయంలో నిందితులు ఏమాత్రం బలవంతానికి పాల్పడినట్టు గుర్తించినా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం కల్పించకూడదని తేల్చిచెప్పింది. అయితే, ప్రస్తుతం తాము విచారిస్తున్న కేసులో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిందని, ఫిర్యాదుదారు రాజీ కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేసింది. కక్షిదారులిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారని.. ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి శత్రుత్వం లేదని, నిందితుల తరఫు న్యాయవాది పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తుచేసింది.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారిని కేవలం వారి కులం ఆధారంగా కించపరచడాన్ని, అవమానించడాన్ని, బెదిరించడాన్ని నిరోధించడమే ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3(1)(ఎక్స్‌) లక్ష్యమని వివరించిన ధర్మాసనం.. ప్రస్తుత కేసులో ఇరువర్గాల మధ్య భూ తగాదా ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఆ కోపంలో, అసహనంలో తిట్టిన తిట్లేనని అప్పీలుదారు మొదటి నుంచీ చెబుతున్నారని.. ఈ కేసుకు మూలం సివిల్‌/ఆస్తి వివాదమేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో.. దోషులకు శిక్ష పడనంతమాత్రాన ఎస్సీ, ఎస్టీ చట్టం ఉద్దేశం నీరుగారలేదని కోర్టు సంతృప్తి చెందిన పక్షంలో, రాజ్యాంగంలోని 142వ అధికరణ తమకు కల్పించిన విశిష్ట అధికారాన్ని ఉపయోగించుకుని కేసును కొట్టేయవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత కేసు విషయంలో వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. ఆ అధికారాలతోనే క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.

LEAVE A RESPONSE