అలా చూపితే నా పోస్టుకు రిజైన్ చేస్తా

-విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులైన 13 లక్షల మందికి ఏనెల జీతం ఆనెల ఇచ్చినట్లు చూపితే నా పోస్టుకు రిజైన్ చేస్తా
– కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏనెల జీతం ఆనెల ఇచ్చినట్లు చూపలేకపోతే ప్రభుత్వం ఏంచేస్తుందో సమాధానం చెప్పాలి
– ఉద్యోగస్థుల జీతాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం సరికాదు
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులైన 13 లక్షల మందికి ఏనెల జీతం ఆనెల ఇచ్చినట్లు ప్రభుత్వం చూపితే నా పోస్టుకు రిజైన్ చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఛాలెంజ్ విసిరారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు మీ కోసం…!

కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏనెల జీతం ఆనెల ఇచ్చినట్లు చూపలేకపోతే ప్రభుత్వం ఏంచేస్తుందో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల 30 వేల మందికి ఏ నెల జీతం ఆనెల చెల్లించలేదు.
నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా రాష్ట్ర ఉద్యోగులకు 30 శాతం మందికి ఇంతవరకు జీతాలు రాలేదు. పోలీసు, హెల్త్, డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్, గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్లు రాలేదు, ఎప్పుడొస్తాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు లేవు. ఆప్కాస్ పేరుతో 99 వేల మంది ఉద్యోగులు రిజిష్టర్ చేయించుకున్నారు. ఏ ఒక్క నెలలో కూడా ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ నెలకు ఆనెల పూర్తిగా జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

80 శాతం జీతాలు ఇచ్చి 20 శాతం టెక్నికల్ సమస్యలు వచ్చాయని దాటవేస్తూ వస్తున్నారు. రెగ్యులర్ గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. 2022 వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. 2021లో కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. రాష్ట్రం కేవలం అప్పులపై ఆధారపడి నడుస్తోంది. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి.

రాష్ట్రంలోని 4 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్థులు, 4 లక్షల మంది పెన్షనర్లకు, వాలంటీర్లకు మొత్తం 13 లక్షల మందికి జీతాలు ఇవ్వాల్సివుంది. 5,500 కోట్లు జీతాలకు, పెన్షన్లకు ప్రభుత్వం రెడీ చేసుకోవాలి. 17వందల కోట్లు సామాజిక పెన్షన్లకు అవసరమౌతాయి. ప్రతి నెల ఈ అమౌంటు సరిచేసుకోవాలి.

దాదాపు 7,200 కోట్లు 1వ తేదిన ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. వ్యాట్ కలెక్షన్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతోంది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉంది. ఇటీవలే దాదాపు రూ.750 కోట్లు వచ్చింది. పెట్రోల్, లిక్కర్ ధరలు ప్రతి నెల పెరుగుతున్నాయే తప్ప తరగడంలేదు. గతంలో కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఈ యేడాది అలాంటి ఇబ్బందేమీ లేదు.

కేంద్రం ఇచ్చే నిధులు పెరిగాయి. రాష్ట్రంలో వ్యాట్, ఇతరత్రా ఆదాయాలు పెరిగాయి. ఈ సంవత్సరం రాష్ట్రానికి 48 వేల కోట్లు అప్పుల పరిమితి ఉంది. ఇప్పటికే 52 వేల కోట్లు అప్పు చేశారు. ఇంకా 25 వేల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 90 నుంచి లక్ష కోట్లు అప్పు చేసే పరిస్థితి ఉంది. ఈ డబ్బంతా ఏమౌతోందో తెలియడంలేదు. ఇంతవరకు ఒక్క శ్వేత పత్రం కూడా ఇవ్వలేదు. పత్రికలు తప్పు చెబుతున్నాయని ఈ ప్రభుత్వం పత్రికలపై పడి ఏడుస్తోంది. పత్రికలు అపద్దాలు చెబుతుంటే నిజాలు ప్రభుత్వం చెప్పాలి.

ఆర్థిక పరిస్థితికి సంబంధంలేని ఉద్యోగస్థుల జీతాలు ఆపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మావద్దకొచ్చి కొందరు ఉపాధ్యాయులకు జీతాలు రావడంలేదని, జీతాల గురించి ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడాలని కోరారు. ఏ సంఘం రోడ్డుపైకి వచ్చి గొంతు విప్పినా ఆ సంఘంపై కక్ష సాధించే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయ సంఘాలన్నిటికి ఓడీ పరిస్థితి తీసేశారు. కేవలం ప్రభుత్వానికి భజన చేసే ఒకటో, రెండో సంఘాలకు ఓడీ ఫెసిలిటీ కల్పించారు.

90శాతం సామాజిక పెన్షన్ లు ఇచ్చామని గట్టిగా చెప్పే నాయకులు ఉద్యోగస్థుల జీతాలపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడంలేదు? పంచాయతీ సెక్రటీరలను మీరు పెట్టుకున్నారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, వాలంటీర్ వ్యవస్థ ప్రభత్వమే పెట్టుకుంది, వారికి జీతాలేమో సక్రమంగా ఇవ్వడంలేదు. ప్రజల వలన ప్రభుత్వానికి పన్నులు మాత్రం ఒక్క రూపాయి ఆగకుండా వెళ్తున్నాయి. ప్రభుత్వం ఆర్థికపరంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు ఆర్థికపరంగా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే అనుమానం కలుగుతోంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఉద్యోగస్థుల్లో 85 శాతం మంది జీతాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 15 శాతంమంది మాత్రమే ఇంట్లో ఇద్దరు సంపాదిస్తు ఉండి ఒకరిపై ఒకరు ఆధారపడినవారున్నారు. 80 శాతం మంది తమ జీతాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు, మందులు, ఇతరత్రా నిత్యవసర ఖర్చులన్నింటికి జీతాలపైనే ఆధారపడి ఉంటారు. కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగుల పరిస్థితి దారుణం. చిన్న చిన్న ఉద్యోగస్థులకు 3 నెలలుగా జీతాలు రావడంలేదు. ఇంతటి దారుణ పరిస్థితులు రావడానికి కారణం ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణం. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ఆర్థిక మంత్రిని కోరుతున్నాం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎండీజీ నెల నెలా ప్రకటనలు విడుదల చేస్తుంది. అలాగే ప్రభుత్వానికి వచ్చిన అమౌంట్ దేనికి ఎంత ఖర్చు పెట్టారు? స్కీములకు ఇస్తే ఎంత లాభమొచ్చింది? ఎంత పెండింగ్ ఉంది? తెలపాలి. ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ ల లెక్కలు మాత్రమే చెబుతున్నారు, మిగతా ఏ స్కీములకు లెక్కలు లేవు. సీఎం బటన్ నొక్కడం సాక్షి పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వడం తప్ప. స్కూల్ డ్రాపవుట్స్ పై విద్యాశాఖ మంత్రి, సెక్రటరి చెప్పేవాటికి పొంతన లేదు. సెక్రటరి లెక్కే కరెక్టు ఉంటుందని భావించొచ్చు. అవి అఫిషియల్ స్టాటిస్టిక్స్. అవి చూసి చెప్పడంకూడా విద్యాశాఖ మంత్రికి రావడంలేదు.

ఏ లెక్కలు కరెక్టో తెలియడంలేదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ప్రతినెల కరెక్టుగా జీతాల వస్తే తప్ప వారి జీవన విధానం మెరుగుపడదు. ప్రభుత్వం జీతాల విషయంలో అవలంబిస్తు్న్న విధానం సరికాదు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో జీతాల విషయంలో 1వ తేదికి మించేదికాదు. ఉద్యోగస్థులందరూ చాలా ఆనందపడేవారు. ఈ విధానాన్ని నిర్విగ్ఘంగా అమలుచేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిపై ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతోందో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ప్రభుత్వం తరపున టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Leave a Reply