బీజేపీకి తప్పని రైల్వే జోన్‌ రగడ

– మోదీ వచ్చేది అభివృద్ధి కార్యక్రమాలకే
– రైల్వేజోన్‌ ఆఫీసు శంకుస్థాపన చేస్తారని వైసీపీ ప్రచారం
– దానితో బీజేపీకి రైల్వేజోన్‌ పితలాటకం
– ఇంకా భూసేకరణ చేయని రైల్వే
– 150 ఎకరాల్లో రైల్వేజోన్‌ ఆఫీసుకు ప్రణాళిక
– అందులో జోన్‌ ఆఫీసు, స్టాఫ్‌ క్వార్టర్ల ప్రతిపాదన
– విజయసాయిరెడ్డి ట్వీట్‌తో గందరగోళం
-దానితో రైల్వేజోన్‌ వస్తోందంటూ వైసీపీ నేతల పబ్లిసిటీ
– వైసీపీ ప్రచారంతో బీజేపీ ఇరకాటం
– ఉత్తరాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబడతామన్న ఆందోళన
– రైల్వేజోన్‌ ప్రస్తావన లేదని తాజాగా జీవీఎల్‌ వెల్లడి
( మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. ఫలితంగా బీజేపీ మెడకు రైల్వే జొన్‌ వ్యవహారం మరోసారి గుదిబండగా మారింది. వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీకి పితలాటకంగా మారింది. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ.. ఉత్తరాంధ్రవాసుల చిరకాల వాంఛితమైన రైల్వేజోన్‌ కార్యాలయానికి సైతం, శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం విస్తృంగా జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా, వైసీపీ నేతలు సైతం ప్రధాని రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేస్తారని ప్రచారం చేశారు. దీనితో రైల్వే జోన్‌పై ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురించాయి.

అయితే ప్రధాని కేవలం.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసమే, విశాఖలో ఒకటిన్నర రోజులు గడిపేందుకు వస్తున్నట్లు స్పష్టమయింది. ఆ మేరకు ప్రధాని టూర్‌ షెడ్యూల్‌ కూడా విడుదలయింది. ఫలితంగా రైల్వేజోన్‌పై మళ్లీ నిరాశ అలుముకుంది. జోన్‌పై ఇప్పటిదాకా జరిగిన ప్రచారంతో, బీజేపీ ఇరుకునపడింది. తమకంటే వైసీపీ నేతలే రైల్వేజోన్‌పై ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించి, తమ పార్టీని సంకటస్థితిలో పడేయడాన్ని కమలదళాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

modi-pmప్రధాని టూర్‌ షెడ్యూల్‌లో అసలు రైల్వేజోన్‌ ప్రస్తావనే లేనప్పుడు, దానిగురించి ప్రస్తావించడం ఎందుకన్నది బీజేపీ సీనియర్ల ప్రశ్న. ప్రధాని వచ్చినా.. రైల్వేజోన్‌ శంకుస్థాపన చేయడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే, పార్టీ మరింత నష్టపోతుందన్నది ఆ పార్టీ నేతల ఆందోళన. అసలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని సంప్రదించి, ప్రధాని రైల్వేజోన్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రకటించారని బీజేపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం రైల్వేజోన్‌ ప్రకటించిందే తప్ప, శంకుస్థాపనపై ఎలాంటి ప్రకటన చేయలేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి రైల్వేజోన్‌ కార్యాలయానికి సంబంధించి రైల్వే శాఖ ఇంకా భూసేకరణ చేయలేదు. దానికోసం 150 ఎకరాలు అవసరం ఉందని అంచనా వేశారు. పరిపాలనా భవన కార్యాలయం, ఉద్యోగులకు క్వార్టర్స్‌ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. అందుకోసం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసింది. దాని నివేదిక రావలసి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత రైల్వే శాఖ భూసేకరణ చేసి, ఆఫీసు-ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మిస్తుంది. ఇవేమీ తెలియని వైసీపీ నేతలు.. రైల్వేజోన్‌ వచ్చేసిందని, ప్రధాని దానికి శంకుస్థాపన చేస్తారంటూ, ఇప్పటివరకూ వైసీపీ నేతలు చేసిన ప్రచారం, తమకు తీరని నష్టం కలిగించిందని బీజేపీ నేతలు వాపోతున్నారు.

నిజానికి 28 అక్టోబర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌.. ఈ గందరగోళానికి కారణమంటూ, కమలదళాలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ‘‘ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయంvzg-vijayasai-tweet వచ్చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు ప్రధాని మోదీగారు, సిఎం జగన్‌గారితో కలసి నవంబర్‌ 12న శంకుస్థాపన చేయనున్నారు’’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విశాఖ వైసీపీ నేతలు కూడా దానిని అందుకుని, రైల్వేజోన్‌ వచ్చేస్తోందని, అది తమ ఘనతేనన్న ప్రచారానికి తెరలేపారు.

అయితే అసలు రైల్వేజోన్‌ ప్రక్రియ ప్రారంభం కావడం, కమిటీ నివేదిక కూడా రాని నేపథ్యంలో ప్రధాని శంకుస్థాపన చేస్తే, మరిన్ని విమర్శలకు గురికావలసి వస్తుందని బీజేపీ వర్గాలు కలవరపడ్డాయి. ఒకవేళ ప్రధాని రైల్వేజోన్‌ శంకుస్థాపన జరగకపోతే.. ఉత్తరాంధ్ర ప్రజల ముందు, పార్టీ దోషిగా నిలబడాల్సి వస్తుందని బీజేపీ నేతలు ఆందోళన చెందారు. దానిని విపక్షాలు అస్త్రంగా సంధిస్తే, ఎదురుదాడి చేయడం అసాధ్యమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. దానితో ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన బీజేపీ నేతలకు.. రైల్వేజోన్‌ శంకుస్థాపన లేదన్న సమాచారం వచ్చింది. అసలు విజయసాయిరెడ్డి ఎవరి అనుమతితో, రైల్వేజోన్‌పై ట్వీట్‌ చేశారని బీజేపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం తమ పార్టీని అప్రతిష్ఠ పాలుచేసేందుకే.. విజయసాయిరెడ్డి రైల్వేజోన్‌పై ట్వీట్‌ చేసి, ప్రజల్లో తమను ముద్దాయిగా నిలబెట్టారని కమలదళాలు రగిలిపోతున్నాయి. అసలు ప్రధాని టూర్‌ షెడ్యూల్‌ ఖరారు కాకముందే, విజయసాయిరె డ్డి ముందుగానే రైల్వేజోన్‌పై, ఎలా ట్వీట్‌ చేస్తారని బీజేపీ దళాలు గుర్రుమంటున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీని వ్యూహాత్మకంగా భ్రష్టు పట్టించే వ్యూహమేనని కమలదళాలు కనెర్ర చేస్తున్నాయి. రేపు రైల్వేజోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయకపోతే.. మోదీ ప్రత్యర్ధులు దానిని అవకాశంగా తీసుకుని, బీజేపీని ఉత్తరాంధ్ర ప్రజల ముందు ముద్దాయిగా నిలబెడతారన్న ఆందోళన వ్యక్తమయింది.

ఇప్పటికే విశాఖస్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, అమరావతి రాజధాని అంశంపై ప్రజలు తమపై గుర్రుగా ఉన్నారని బీజేపీ నేతలు గుర్తుచే స్తున్నారు. అదిచాలదన్నట్లు రైల్వేజోన్‌పై బీజేపీ ఇచ్చినమాట తప్పిందన్న.. సంబంధం లేని మరో కొత్త అపవాదుకు, విజయసాయి ట్వీట్‌ కారణమయిందన్న ఆగ్రహం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

దీనితో దిద్దుబాటకు దిగిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు శనివారం ఆగమేఘాలమీద ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ప్రధాని మోదీ టూర్‌ షెడ్యూల్‌లో, రైల్వేజోన్‌ లేదని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌, అమరావతి రాజధాని అంశాలు కూడా ప్రస్తావించరని జీవీఎల్‌ స్పష్టం చేశారు. 9 ప్రాజెక్టుల శంకుస్థాపనలకే మోదీ టూర్‌ పరిమితమని వెల్లడించారు. జరిగిన నష్టాన్ని గ్రహించి, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నష్టనివారణకు దిగినప్పటికీ.. అప్పటికే ప్రధాని రైల్వేజోన్‌ శంకుస్థాపన చేస్తారంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఉత్తరాంధ్ర ప్రజల్లోకి వెళ్లింది. దానిని వైసీపీ నేతలు, క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు. ఫలితంగా జీవీఎల్‌ కష్టం పెద్దగా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు.