-రామోజీరావుకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రజలంతా అండగా ఉండాలి
-తమ ఇసుక కుంభకోణాన్ని తమంతట తామే బయట పెట్టుకున్న ప్రభుత్వం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మన ఓట్లను మనం రక్షించుకుంటూ, దొంగ ఓట్లను నిర్మూలిస్తే రానున్న ఎన్నికల్లో మా పార్టీ అవుటని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దొంగ ఓట్లపై ఆధారపడే మా పార్టీ నాయకులు విజయం పై ఒకింత నమ్మకాన్ని పెట్టుకున్నారు. దొంగ ఓట్ల నిర్మూలనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరూ అధికారులను సస్పెండ్ చేసిన శుభవార్త విన్నాము. రానున్న రోజుల్లో మరిన్ని ఇదే తరహా శుభవార్తలను వింటామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్గదర్శి సంస్థపై గత ఐదు రోజులుగా జమోరె దిశా నిర్దేశంతో కొనసాగుతున్న వేధింపు దాడులపై కోర్టు మధ్యంతర స్టే విధిస్తూ, రెండు రోజులపాటు బ్రేక్ వేసింది. మధ్యంతర స్టే ఇచ్చిన న్యాయస్థానం, రెండు రోజుల అనంతరం శాశ్వత స్టే ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. గతంలోనూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరించి, చందాదారులను ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేసి, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
దొంగ ఫిర్యాదులు ఇవ్వమని చందాదారులపై అనేక ఒత్తిళ్లు చేసినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన కేసులు న్యాయస్థానం ముందు నిలబడలేదు. తాజాగా నమోదు చేసిన కేసులోనూ బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయినా న్యాయస్థానం నిరాకరించింది. బుద్ధి ఉన్నవారు ఎవరు ఒప్పుకోరు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మరో మారు స్పష్టం అయ్యింది. పోలీసు వ్యవస్థను ఈ పాలకులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు.
ఒక రాజకీయ నాయకుడు చెప్పాడని, ఐపీఎస్ పాస్ అయిన అధికారులు కూడా తింగరి చేష్టలకు పాల్పడుతున్నందుకు సిగ్గుపడాలి. వీరు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో అర్థం కావడం లేదు. ఐపీఎస్ అధికారులు కూడా కనీసం చట్టంలోని నిబంధనలు పాటించకపోవడం దుర్మార్గం. ఇటువంటి వెధవ పనుల్లో పాలుపంచుకుంటున్నందుకు తమను చూసి తామే సదరు అధికారులు సిగ్గుపడాలన్నారు..
ప్రభుత్వ తప్పులు, మోసాలను పతాక శీర్షికల ద్వారా ఎండగడుతున్న రామోజీరావు
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను, తప్పులను ఈనాడు దినపత్రిక ద్వారా పతాక శీర్షికలతో ఎండగడుతున్నారనే అక్కసుతోనే రామోజీరావును వేధిస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు . రామోజీరావు వ్యాపార సంస్థలపై కొనసాగుతున్న ఈ దుర్మార్గపు, దుష్ట దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వి ఆర్ విత్ యు రామోజీరావు అంటూ నినదించాలి. ప్రస్తుతం వి ఆర్ విత్ యు రామోజీరావు అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు నినదిస్తున్న నినాదం ట్విట్టర్ లో ఆల్ ఇండియా ట్రెండింగులో కొనసాగుతోంది. ఈ తింగరి వేషాలను ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే, ఇదే ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి వార్తలు రాస్తున్న ఈనాడు దినపత్రిక, తమ సాక్షి దినపత్రికకు అడ్డుగా ఉన్నదని, రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి సంస్థ పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదేపదే దాడులు నిర్వహిస్తోంది.. మార్గదర్శి సంస్థ ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఆ సంస్థ శాఖలు నిర్వహిస్తున్న భవంతుల, భవన నిర్మాణ అనుమతులను పరిశీలించడం, సక్రమంగా ఉన్నాయా లేదా అని వేధించడం, ఇంటి పన్ను సకాలంలో చెల్లించారా అని ప్రశ్నించి వేధించడం, అగ్నిమాపక దళ శాఖ అనుమతులన్నీ ఉన్నాయా అంటూ భవన యజమానులను సంబంధిత శాఖల అధికారులు ప్రశ్నించే వేధింపులకు దిగడం దారుణం.
ఇన్ని నెలలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మార్గదర్శి సంస్థ ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశాలు లేకపోవడంతో , చందాదారుల ఇంటికి వెళ్లి వారిని బ్రతిమాలి ఫిర్యాదులను చేయించుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .
ముఖ్యమంత్రికి ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమో…!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమోనని ప్రజలు భావిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జేపీ అనే సంస్థకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టుని అప్పగించగా, మే 9వ తేదీనే కాంట్రాక్టు గడువు కాలం ముగిసింది. ఆ సంస్థ కాంట్రాక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినా టర్న్ కి అనే సంస్థ పేరిట రసీదులను కట్ చేస్తూ, జిల్లాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల అనధికారిక ప్రయివేట్ బిడ్ ద్వారా ఇసుక తవ్వకాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు యదేచ్చగా కొనసాగిస్తున్నారు.
ఇసుక తవ్వకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు ప్రతినెల 250 నుంచి 300 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆదాయం వెళ్తోందని, ప్రైవేట్ బిడ్ ఈ రేంజ్ లో ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎన్ జి టి తో పాటు , న్యాయస్థానాలలో కేసులు వేయగా, చిత్తూరు జిల్లాలోని 10 ఇసుక ర్యాంపులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఇసుకతవ్వకాలను ఆపాలని ఆదేశించడం జరిగింది. ఎన్జీటీలో కేసు వేసిన వ్యక్తిపై, మరో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే గౌరవం లేదు.
పోనీ జేపీ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ రెన్యువల్ చేశారా అంటే అది లేదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టతను ఇవ్వదు. ఇసుక అక్రమ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే… ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని ఎదురు దాడి చేస్తూ, చెత్త చెత్త మాటలను ప్రభుత్వ పెద్దలు మాట్లాడిస్తున్నారు.
విష్ణు పాదాలు ఉన్న కొండపై మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కన్నేసినట్లు తెలిసింది. విద్యాలయాలు స్థాపించడానికి ఆ కొండకు కూడా గుండు కొట్టనున్నారట. రాష్ట్రంలోని ఇసుక మట్టి దోచేశారు. చెత్త సరుకుతో ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నారు. కాసింత స్తోమత ఉన్నవారు రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే… కేసులు పెట్టి వేధిస్తున్నారు.
అయినా సరే, రామోజీరావు, రాధాకృష్ణ, రాజగోపాల్ నాయుడు వంటి వారు ఈ ప్రభుత్వ దమన కాండను ప్రశ్నిస్తే సూటి పోటి మాటలు అంటున్నారు. అయినా( రామోజీరావు )ఆర్, (రాధాకృష్ణ ) ఆర్, (రాజగోపాల నాయుడు )ఆర్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ అయిన నేను కూడా తగ్గేదేలే అంటుంటే, ఏదోరకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నాలను ఈ ప్రభుత్వం చేస్తుంది. జేపీ సంస్థ కాంట్రాక్ట్ గడువు కాలం ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాల పేరిట దోచుకుంటున్నారంటే, గత మూడున్నర ఏళ్లు గా ఎంత దోచుకున్నారో ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇసుక తవ్వకాల ద్వారా తాము దోచుకుంటున్నామని ప్రజలకు స్పష్టంగా తెలియజేసిన ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్నీ అభినందించాలి. ఇది బరితెగింపు కాకపోతే మరేమిటి అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
కేశవ్ స్ఫూర్తితో దొంగ ఓట్ల నిర్మూలనకు కృషి చేయండి
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్ఫూర్తితో దొంగ ఓట్ల నిర్మూలనకు ప్రతిపక్ష పార్టీల నేతలు అంతా కృషి చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.. ఉరవకొండలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ వ్యవహారాన్ని పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నేను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు నివేదించాను. దాదాపు 6 నుంచి పదివేల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తించి నిర్మూలించారు . ఈ దారుణానికి పాల్పడ్డ పక్షపాత అధికారి సుబ్బారెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అటువంటి అధికారిని సస్పెన్షన్ చేయడం కాదు, సర్వీసు నుంచి తొలగించాలి. గతంలో జెడ్పి సీఈఓ గా పనిచేసిన స్వరూపారాణి దొంగ ఓట్ల నమోదుకు అంకురార్పణ చేశారట. ఆమెను కూడా సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనితో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పుడు పనులు చేసే అధికారులు ఎవరికైనా ఇదే శిక్ష తప్పదు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారడం ఖాయం. దుష్టులతో సావాసం చేసే అధికారులకు తిప్పలు తప్పవు. ఓట్ల నమోదు ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఫ్రాడ్ చేసిందో స్పష్టంగా తేటతెల్లమయిందని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు.
పయ్యావుల కేశవును స్ఫూర్తిగా తీసుకొని దొంగ ఓట్ల నమోదుపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు ఇవ్వండి. అలాగే నాకు ఒక కాపీ ఇస్తే, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుతానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.