ఇలాగైతే గిరిజనుల బతుకు మారేదెలా?

-చెంచుల కులదేవత చెంచు లక్ష్మి.. కానీ చెంచుల జీవితంలో జగన్ ప్రభుత్వం లక్ష్మి లేకుండా చేసింది
– శ్రీశైలానికి పేదలకోసం మోదీప్రభుత్వం 6,400 ఇళ్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం 1,240 ఇళ్లు మాత్రమే నిర్మించింది
– గిరిజనులపై జగన్ ప్రభుత్వ వివక్ష
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

శ్రీశైల : వనదేవత స్వరూపులు.. ప్రకృతికి, ప్రజలకు మధ్య వారధులు చెంచులు.. వన దేవతకు ప్రతిరూపమైన చెంచు తల్లులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సిద్ధ పురుషులు, ధర్మ గురువుల మధ్య చెంచు సంక్రాంతిలో పాల్గొనడం నా అదృష్టం. సమస్త లోకాధిపతి, సమస్త కోటి జీవులకు రక్షకుడు, ఆ మహా శివుడు. ముష్కరుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆయన చెంచుల సాయం కోరాడంటే.. వారికి ఆయన ఎంతటి సమున్నత స్థానం కల్పించాడో మనందరం అర్థం చేసుకోవచ్చు.

ఆ నాడు శ్రీ రాముడు శబరి ఎంగిలి పండ్లు తిని గిరిజన జాతికి ఎలా గౌరవం కల్పించారో.. ఆ శ్రీరామ చంద్రుడిని ప్రేరణగా తీసుకుని, ఆయననే ఆరాధ్య దేవుడిగా భావించే ప్రధాని మోదీ ఆ గిరిజన సమాజానికి చెందిన ఒక తల్లిని ఈ దేశానికి రాజ్యాధినేతను చేశారు. గిరిజన మహిళలకు, ఆదివాసీలకు కల్పించాల్సిన గౌరవం కోసం ఇన్నాళ్ల తర్వాత ఆయన ఆలోచించారు.

గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టి గౌరవం కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలను తీసుకొచ్చింది. వన బంధు కల్యాణ్, ఏకలవ్య స్కూళ్లు, జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఇలా ఎన్నో పథకాలు తెచ్చారు.

డెవలప్మెంట్ యక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కింద గిరిజనుల అభివృద్ధికి లక్షా 18 వేల కోట్లను ఖర్చు చేశారు. తద్వారా గిరిజనుల సామాజిక అభివృద్ధే తమ ధ్యేయమని మోదీ నిరూపించారు. గిరిజనుల జీవితాలు మారాలంటే.. వారి బతుకుల్లో వెలుగులు నిండాలంటే ప్రభుత్వాలు తమ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రధాని మోదీ ఇది గుర్తించి నడుచుకుంటున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన గిరిజనుల్లో చైతన్యం తెచ్చి, అక్షరాస్యత పెంచి వారిని మైదాన ప్రాంతంలోని వారితో సమానంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకలవ్య మోడల్ స్కూల్స్ను తెచ్చింది. 50శాతం గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది. గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు.. అంటే వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం, ల్యాబులు వంటివి సమకూర్చడానికి ఒక్కో ఏకలవ్య స్కూల్కు రూ.38 కోట్ల నుంచి రూ.48 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 740 ఏకలవ్య స్కూల్స్ కట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 28 స్కూల్స్ ఇచ్చింది. ఏకలవ్య స్కూల్స్లో ఒక్కో విద్యార్థికి ఏడాది చదువుకు సుమారు లక్షా పదివేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఏకలవ్య స్కూల్స్లో సుమారు 4లక్షల మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు.

దుర్భల స్థితిలో ఉన్న ఆదివాసీలు, గిరిజనుల ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆయుష్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యం బాగోగులు చూస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఎనిమిది వేల కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి కిలోమీటరుకు కోటి రూపాయలు చొప్పున కేటాయిస్తోంది. అలాగే ఒక్కో ఇంటికి 2లక్షల40వేల చొప్పున కేటాయించి పక్కా ఇళ్లు కట్టిస్తోంది.

అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ఒక్కో హాస్టల్ను 2కోట్ల 75 లక్షల రూపాయలతో 500 హాస్టల్స్ కేటాయించింది. ఒక్కోటీ 50లక్షల రూపాయలతో 60 ఒకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్ యూనిట్స్, ఒక్కో అంగన్వాడీ సెంటర్కు 12లక్షల రూపాయల చొప్పున 2500 అంగన్వాడీ సెంటర్లు కేటాయించింది. ఒక్కోటీ 60లక్షల రూపాయలతో వెయ్యి మల్టీపర్పస్ సెంటర్లు కేటాయించింది. ఇవే కాక మంచినీటి సౌకర్యం, విద్యుత్, టెలికాం టవర్ల కోసం రూ.కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ఇంత చేస్తున్నా.. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఇప్పటికీ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోంది. చెంచుల కులదేవత చెంచు లక్ష్మి.. కానీ చెంచుల జీవితంలో మాత్రం లక్ష్మి లేకుండా చేసింది జగన్ ప్రభుత్వం..

గిరిజనుల అభివృద్ధి కోసం రూ.35 వేల 600 కోట్లు కేటాయించామని ఆర్భాటంగా చెప్పుకున్న జగన్ సర్కార్.. అందులో రూ.18 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి గిరిజనులపై తన వివక్షను చాటుకుంది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించింది. కనీసం వారికి ఇళ్లను కూడా నిర్మించలేదు. వారిని పేదరికంలోకి తోసేసింది.

అభివృద్ధికి దూరమై.. ఆదుకునే వారు లేక గిరిజనుల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అమాయకత్వం మేళవించిన గిరిజన చెంచుల మోముల్లో అనారోగ్యం నిండేలా చేసింది జగన్ ప్రభుత్వం.. శ్రీశైలానికి పేదలకోసం మోదీప్రభుత్వం 6,400 ఇళ్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం 1,240 ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు నిర్మించింది. కేంద్రం తన బాధ్యతను నెరవేరుస్తోంది. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంది. కానీ దానిని పట్టించుకోకుండా ఆయన పాలన సాగిస్తున్నారు. ఇలాగైతే గిరిజనుల బతుకు మారేదెలా? వారు ఇతర కులాలతో సమానంగా ఎదిగేది ఎలా? ఇప్పటికైనా వారి జీవితాల్లో వెలుగులు నిండేలా.. వారి బతుకులు మారేలా చేయాలి.

తదంతరం విల్లంబు ముగ్గులపొటిలను సత్యకుమార్ ప్రారంభించారు. చెంచు మహిళలతో సహపంక్తి భోజనం చేశారు. మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుని, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మృతి మందిరాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అనేక పీఠాల అధిపతులతో పాటు బీజేపీ నాయకులు కగ్గోలు హరీష్, భూమా కిషోర్ రెడ్డి, డా బుడ్డ శ్రీకాంత్ రెడ్డి, అరవింద్ రెడ్డి, మల్లిఖార్జున, వెంకటేశ్వర్లు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply