Suryaa.co.in

Telangana

బీసీలపై ప్రేమ ఉంటే బీసీ సీఎంను చేయండి

– కాంగ్రెస్ డీఎన్ఏలో బీసీ వ్యతిరేకత
– రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీల కొంగజపం
– భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు వారి డీఎన్ఏలో బీసీ వ్యతిరేక పార్టీగానే మిగిలింది. బీసీ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో తుడుచుకుపెట్టుకుపోయింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీల పట్ల కొంగజపం చేస్తున్నారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలపై చేస్తున్న ద్వంద్వ విధానాలను ప్రశ్నిస్తున్నాం. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే పేరిట ప్రమాణం చేసి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ , ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైంది.

రాష్ట్రంలోని బీసీ జనాభా 52 శాతం ఉండగా, దాన్ని కేవలం 46 శాతంగా చూపించి చట్టబద్ధంగా తక్కువ చూపేందుకు కుట్ర చేశారని అనుమానం కలుగుతుంది.

బీసీ గణన వివరాలను ఇప్పటివరకు అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదు? కాంగ్రెస్ పార్టీకి నిజమైన నిబద్ధత ఉంటే, గ్రామాల వారీగా కులగణన వివరాలను అధికారికంగా ప్రకటించాలి. తొలి అసెంబ్లీ సమావేశంలో బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దానికి కార్యరూపం ఇవ్వలేదు.

ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించలేదు. కనీసం ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించలేదు.

బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి, ఆ తర్వాతే బీసీ సంక్షేమంపై మాట్లాడాలని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.

LEAVE A RESPONSE