మనస్సు ద్వారా అభ్యాస యోగం చేయలేనివారు శరీరంతో భగవంతుని కొరకు కర్మలు చేస్తూ క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. మొత్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారితీస్తుంది. ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరాదు. వారివారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను (సాధనలను) చూపితే ఎవరికి కావలసిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు.
అయితే ఇక్కడే ఒక సందేహం. అన్నీ భగవంతుని కొరకే చేస్తుంటే మన పనులు ఎవరు చేస్తారు? మనకోసం కొన్ని పనులు తప్పవు గదా! అని. ఐతే – ‘అన్నీ మన పనులే చేసుకోవాలి’ – అంటే భగవంతుని కోసం పనులు చేయనక్కర్లేదా? అని ఎవరికీ సందేహం రాదు. అన్నీ భగవంతుని కొరకే పనులు చేయండి అంటేనే మరి మన పనులో? అనే సందేహం.
సాధారణంగా మన తిండి తిప్పల కోసం, సుఖం కోసం, భోగాల కోసం, అవసరాల కోసం కొన్ని పనులు చేస్తుంటాం. ఇవి మన కొరకు చేసే పనులు. ఇక సమాజం కోసం సభలు, సమావేశాలు; దేవాలయాలు, కళ్యాణ మండపాలు కట్టించటం, భావులు త్రవ్వించటం, వృద్ధాశ్రమాలు నిర్వహించటం – ఇవన్నీ సమాజం కోసం. ఇక పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, వేదాధ్యయనం మొ॥నవి భగవంతుని కొరకు చేసేవి. ఇలా 3 రకాలుగా చేస్తుంటాం. అయితే భగవంతుడేమో అన్నీ నాకొరకే(మదర్థం) చేయాలి అంటున్నాడు.
ఎలా మరి? మనం చేసే పనులన్నీ మన కోసమైనా, సమాజం కోసమైనా, భగవంతుని కోసమైనా – అన్నింటిని భగవంతుని పనులుగానే చెయ్యాలి. ఎలా? నేను కర్తను, నేనే వీటిని చేస్తున్నాను అనే అహంకారాన్ని – కర్తృత్వ భావాన్ని వదిలి, నా కర్తవ్యం అనుకుంటూ చేస్తే సరి. నావల్లనే ఈ పనులు జరుగుతున్నాయి అనే అహంకారం లేకుండా మనం భగవంతుని చేతిలో పనిముట్టులా చేస్తే అవి అన్నీ భగవత్ కర్మలే అవుతాయి. అన్ని అనర్థాలకు కర్తృత్వమే మూలం.
బల్బులు వెలుగుతున్నాయంటే బల్బుల గొప్పతనం కాదు. కరెంటు గొప్పతనమే. కలం కవిత్వాన్ని వ్రాస్తున్నదంటే కలం గొప్పతనం గాదు. దానిని పట్టుకున్న వాడి గొప్పతనమే. అవయవాలన్నీ పనిచేస్తున్నా యంటే వాటి గొప్పతనం కాదు. వాటికి శక్తినిస్తున్న చైతన్యం యొక్క గొప్పతనమే.
పరిస్థితి ఇదైతే మధ్యలో మనకు లేనిపోని పెత్తనం – అహంకారం ఎందుకు? అహంకారం విడిచిపెడితే ఆత్మప్రాప్తియే.
కనుక కర్మలు చేస్తున్నాం అంటే అవి మనను బంధంలో పడేస్తాయి.కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృత్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే.
మన దృష్టిని భగవంతునిపై నిలిపి ఏరకం కర్మలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ భగవత్పరమైన కర్మలే అవుతాయి.