Suryaa.co.in

Devotional Places

శ్రీ భద్రకాళి ఆలయం

ఈ దేవీ ఆలయము చాలా ప్రాచీనమైన ఆలయమని తెలియుచున్నది. ఈ ఆలయమును రెండువ పులకేశి చక్రవర్తి నిర్మింపజేసి అందు భద్రకాళిమాతను ప్రతిష్ట చేశారు అని చెప్పుచుందురు. ఆ తరువాత ఆ దేవిని కాకతీయుల ఆరాధించారు. కాకతియ గణపతిదేవుడు ఆలయమును ఆనుకొని పెద్ద చెరువు నొకదానిని త్రవ్వించి, ఆలయ నిర్వహణ కోసం కొంత భూమిని కూడా దానంగా ఇచ్చియున్నాడు. రుద్రమదేవి ఆమెనారాధించనిదే భోజనము చేసేది కాదని ప్రతీతి. ఆ విధంగా కాకతీయ రాజుల మన్ననలందుకొన్ని భద్రకాళిమాత, తరువాత కాకతీయ రాజ్యపతనంతో కొంతకాలం చిన్నబోయి ఉన్నది. తిరిగి విజయనగర రాజుల కాలంలో ఈ దేవి పూర్వ వైభవము అనుభవించినది.

ఆ విజయనగర సామ్రాజ్యం 1565లో పతనమగుటతో భద్రకాళి ప్రభావం కూడా అంతరించినది. ఆమె కొంతకాలం మరుగున పడిపోయినది. ఈ విధంగా మహావైభవముననుభవించినా ఆలయ భూములు అన్యాక్రాంతములైనవి. పూజా పునస్కారాలు వెనుకంజవేశాయి. ఈ విధంగా స్వతంత్ర భారత మేర్పడేంతవరకు ఈ దేవి మరుగున పడిపోయినది. అనంతరం ఆమె తన భక్తుడైన శ్రీమగన్లాల్ సమాజ్కు కలలో కన్పించి తనను పునర్మించుమని కోరినదట! ఆమె కోరిక ననుసరించి, అతడాయాలయానికి 1950లో సంప్రోక్షణాదులు జరిపించి పునరుద్ధరించాడు. ఈ విధంగా అలయం 1950 తరువాత తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొని, అరుదైన రూపంలో తీర్చిదిద్దబడినది. ఈ దేవాలయంలో దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం… ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి… 8 చేతులతో ఉంటారు.

అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెరువు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది. మహామండపంలో దక్షిణంవైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి.

వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో, పవిత్ర శ్లోకాలు అత్యంత భక్తితో ఉచ్చరించబడినప్పుడు దేవత తన త్రిపుర సుందరి అవతారంగా రూపాంతరం చెందుతుంది. త్రిపుర సుందరి అంటే అందం, ప్రకృతి మరియు సంతానోత్పత్తి యొక్క అన్ని స్త్రీ శక్తికి ఒక శక్తివంతమైన జీవిగా పరాకాష్ట అని అర్ధం. ప్రతి నిత్యము జరిగే ధూపదీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢమాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని “శాకంభరి”గా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిది.

ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించబడి పూజింపబడుతుంది (గోప్త్రీ గోవింద రూపిణీ – “లలితా సహస్రనామం”).
వైశాఖ శుద్ధ పంచమి “శంకర జయంతి” రోజున శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) దేదీప్యమానంగా జరుగుతాయి.
1940లో జరిగిన సంప్రోక్షణకు పూర్వం ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారని ప్రతీతి. కాని ప్రస్తుతం దక్షిణాచార సంప్రదాయం ప్రకారం – ఉషకాలార్చన, అభిషేకం, ఆవరణార్చన, చతుషష్ఠి ఉపచార పూజ, సహస్రనామం, అష్టోత్తర శతనామ పూజలు మొదలైనవి వేదోక్తంగా జరుగుతున్నాయి.

ఈ ఆలయం లో చిలుకూరు బాలాజీ ఆలయం మాదిరి ఏదైనా కోరిక కోరి 9 లేదా 18 ప్రదక్షిణలు చేస్తే….కోరిన కోరికలు తీరుతాయి అంటారు. కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారు.
దర్శనం సమయం ఉదయం 5:30 నుండి మద్యాహ్నం 1:00 వరకు తిరిగి 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు.
వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలోఉంది.

LEAVE A RESPONSE