Suryaa.co.in

Education Features

ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలంటే..

నూతన తరాలకు బాల్యం నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదువు నేర్పడం మంచిది కాదు అని మా లాంటి వారు అనగానే మమ్ములను ఇంగ్లీషు భాషా ద్వేషులుగా ఆరోపించిన వారున్నారు. మేము ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని ఎప్పుడు నిరసించలేదు. కానీ దాన్ని నేర్పటానికి సులువైన పద్ధతులు ఉండాలని కోరుకునే వాళ్ళo మేము. ఏ తెలియని విషయమయినా తెలిసిన జ్ఞానంపై ఆధారపడి నేర్వటమే అందరికీ తెలుసు కానీ, భాషా బోధనకు దానిని ఎలా అన్వయించుకోవాలో తెలియకపోవడమే నేటి దుస్థితి.దీనిని అర్థం చేసుకుని పరిష్కరించుకోవడం ఎలా ? ఆలోచనకు దోహదం చేసే ఈ క్రింది వ్యాసం చూడండి.

రోజూ మనం చూసే ఉదయాస్తమయాల ప్రకృతిదృశ్యం ప్రకారం సూర్యుడు తూర్పు సముద్రం నుండి పొంగి పడమటి కొండలలో కుంగుతుంటాడు. భూమి చుట్టూ సూర్యుడు రోజుకొక్కతూరి ప్రదక్షిణం చేస్తున్నట్టు మన కంటికగుపిస్తూ వుంటుంది. సాధారణ అనుభవ జ్ఞానానికిదే సత్యంలా అనిపిస్తుంది.ఇటీవల అమెరికాకు పోయి డాలర్ల సంచులు మూటలు గట్టుకుంటున్న వారంతా ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు, స్కూళ్లల్లో చదివినవారు కనుక, అమెరికాకు పోవాలంటే, డాలర్లు సంపాదించాలంటే ఇంగ్లీషు బాగా రావాలి. అందుకై ఇంగ్లీషు మీడియంలోనే చదువుకోవాలి అనే అభిప్రాయం కూడా సరిగ్గా ఇలాంటిదే. అది ఒక గుడ్డి అనుకరణను, వేలంవెర్రిని, అమెరికా కలలను పెంచటంతోపాటు, చదువంటే డాలర్ల సంపాదన అనే భావజాలాన్ని సంస్కృతి స్థాయిలో పాదుకునేట్టు చేస్తుంది. చివరికి ఇంగ్లీషు మాధ్యమంలో చదువు అనేది విద్యను విజ్ఞానాన్ని గడించడానికి కాకుండా అమెరికా వీసా సంపాదించడానికి తప్పనిసరైన ముందస్తు పాస్‌పోర్టు అవుతుంది.

ఇంగ్లీషే కాదు, మాతృభాష కాని ఏ యితర భాషైనా బాగా రావాలంటే తప్పనిసరిగా రెండో భాష యొక్క పదజాలం, దాని వాక్య నిర్మాణ పద్ధతి, వ్యాకరణ సూత్రాలూ మొదలైనవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ మాతృభాష ద్వారా సముపార్జించిన విషయ పరిజ్ఞానపు అనువాదంగానే వుంటాయి.మాతృభాషలో అక్షరాలు రాయటం రానివారు కూడా వాక్య నిర్మాణంలో వ్యాకరణ దోషాలు లేకుండా తమ భాషలో శుద్ధంగా మాట్లాడగలుగుతారు. పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించినవారు కూడా అనివార్యంగా ఇంగ్లీషులో తడుముకుంటారు. వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడలేరు.

ఇక రాయటం విషయాని కొస్తే ఇంగ్లీషు అక్షరాలు 26 మాత్రమే అవటం వల్ల అది నేర్వటం సులభం అంటారు. (మేము హై స్కూల్లో చేరిన సంవత్సరంలో నాలుగు బడులకు కలిపి 104 అక్షరాలు నేర్పితే ఇప్పటి వారికి 52 అక్షరాలు అనగా ఒకటో బడి, రెండో బడి వరకు నేర్పుతున్నారు.) ఇంగ్లీషులో తక్కువ అక్షరాలు అయినందువల్ల కావచ్చునేమో, దానిలో స్పెల్లింగ్‌ (అక్షరక్రమం) సమస్య చాలా పెద్దది. ఇంగ్లీషే మాతృభాషగా గలిగిన వారికి కూడా ఈ సమస్య వుంటుంది. మనం తెలుగును ఉచ్చారణ కనువుగా రాసేసు కోవచ్చు. ప్రాంతీయ యాస, ధ్వని కూడా రాత ద్వారా ఒక మేరకు వ్యక్తం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఉచ్చారణే ప్రధానం కానీ ఇంగ్లీషుకది కాదు. PUT(పుట్) , BUT(బట్) ఒకే రకంగా రాసినా ఒకే రకంగా ఉచ్చరించటానికి కుదరదు. కనుక అక్కడ ప్రతి పదాన్ని ఉచ్చరించటం నేర్చుకోగానే సరిపోదు. దాన్ని ఏ ఏ అక్షరాలతో కలిపి రాయాలో కూడా తెలుసుకు తీరాలి. ఈ స్పెల్లింగ్‌ సమస్య పరభాషీయులమైన మనల్నే కాదు; ఇంగ్లీషు మాతృభాషగా గలవారిని కూడా పట్టి పీడిస్తుంటుంది. ఎందుకంటే , ఉచ్చారణకు, దాన్ని అక్షరాలుగా రాయటానికి మనకున్నంత సూటి సంబంధం ఇంగ్లీషు భాషకు లేదు.
మునిమాణిక్యం అన్నట్టు చింత పండైతే ఏమిటి?
సిందబండైతేనేమిటి? దాని పులుపు తగ్గిందా? ధర మారిందా? అని అనుకుందామన్మ నకది కేవలం ఉచ్చారణ సమస్య. కానీ, ఏది ఉచ్చరిస్తే దాన్నే రాసుకోగలిగే సౌలభ్యం తెలుగు భాషకున్నట్టుగా ఇంగ్లీషు భాషకు లేదు. ఇంగ్లీషు భాష యొక్క ప్రతి పదనిర్మాణాన్ని అక్షరక్రమంతో రాయటం నేర్చుకు తీరవలసిందే.
ఉదాహరణకు..
ఒకే క్రియా పదానికి చెందిన డు(DO ); డజ్‌(DOES );
డోన్ట్‌ ( DONT).. అనేవి తీసుకోండి. రెండవ అక్షరమైన
ఒ అనే అచ్చు ఒకచోట ఉ గాను, మరొకచోట
ఇ తో కలిసి అ గానూ వేరొకచోట ఒ గానూ ఉచ్చరింపబడుతున్నది. ఇది పనిగట్టుకు నేర్చుకుంటే గానీ తెలుసుకోలేని విషయం. అలాగే
డెడ్‌ (DEAD); డీల్‌ (DEAL ); డియర్ (DEAR )అనే నాలుగక్షరాల పదాలలో చివరి అక్షరం ఒక్కటే తేడాగావున్నా, మొదటి మూడక్షరాలు కలిపి పలకటంలో దేనికవే విడివిడి (సిలబిల్స్‌) స్వరాలవుతాయి. ఇంగ్లీషులో ఎన్ని వేల, లక్షల పదాలుంటే అన్నిటికీ స్పెల్లింగ్‌ తెలుసుకు తీరవలసిందే.
అదే మనకు అచ్చులు, హల్లులు, గుణింతాలూ, సంయుక్త ద్విత్వాక్షరాలూ నేర్చేసుకున్నామంటే ఏ పదాన్నైనా ఉచ్చారణ ప్రకారం రాసేసుకుపోయే సౌలభ్యం వుంది. ఒక రచనా భాషగా ఖచ్చితంగా యింగ్లీషు కంటె తెలుగు సులభమైనదిగా దీన్నిబట్టి మనం గ్రహించ గలుగుతాం.

ఏ మాతృభాషైనా పరాయి భాష కంటే విషయ పరిజ్ఞానానికి, సులభగ్రాహ్యతకు, వ్యక్తీకరణకు, ఊహా చింతనకు, సృజనశీలతకూ… సులువయినదిగా వుంటుంది.నారా చంద్రబాబునాయుడు హిందీలో ప్రసంగించాల్సి వచ్చినపుడు తెలుగులో రాసుకుని చదివేవాడని… పత్రికలు రాశాయి. అలాగే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆగస్టు 15 హిందీ ప్రసంగ పాఠాన్ని పర్షియన్‌ స్ర్కిప్టు (ఉర్దూ భాషా లిపి)లో రాసుకుంటారని కూడా పత్రికలు రాశాయి. ఇదేదీ తప్పు కాదు. మాతృభాషకుండే సుళువుకు ఉదాహరణలు మాత్రమే.ఎవరైనా బాల్యంలో తమ వెలుపలి ప్రకృతిని, చుట్టూ పరిసరాలను, జీవించే సమాజాన్ని, వాటి నడుమ వుండే సంబంధాలను, వైవిధ్యాలను… తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ద్వారా గ్రహించి మెదడులో నిక్షిప్తం చేసుకునేది మాతృభాష లోనే!వాక్య నిర్మాణానికి అవసరమైన కర్త.. కర్మ,..క్రియలను, ఏకవచన, బహువచనాలను, భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలను, లింగభేదాలను, సూక్ష్మ పదజాలాలను (గోరుముద్ద, కాలిగిట్ట, బట్టతడుపు, వెంట్రుకవాసి లాంటివనేకం) మాతృభాషలో ఆటపాటల ద్వారా హాయిగా పిల్లలు బడికెళ్లే వయసుకే నేర్చేసుకోగలుగుతారు. చకచకా మాట్లాడగలుగుతారు. కథల్నీ, కాకరకాయల్నీ తమదైన ఊహ, కల్పన, అనుకరణలతో చెప్ప గలుగుతారు. ప్రశ్నించగలుగుతారు. తమకు ఏమి కావాలో స్పష్టంగా అడగగలుగుతారు.

ఈ కార్యకలాపమంతా వ్యాకరణ దోషాలు లేకుండానే చేయగలుగుతారు. తమ అనుభూతుల్ని స్పష్టంగా వ్యక్తం చేస్తారు. అనేక కొత్త పదాలను అతిసులువుగా గ్రహించి, జ్ఞాపకం పెట్టుకుని సందర్భోచితంగా వాక్యంలో యిమిడ్చి వినిమయంలోకి తెచ్చుకో గలుగుతారు. వారి వాక్య నిర్మాణాల్లో దోషాలుంటే కుటుంబం, సమాజం, స్నేహితులు సరిదిద్దుతారు. దిద్దుబాటు కూడా సులువుగా జరిగిపోతుంది.విషయ పరిజ్ఞానాన్ని పొందటం, దానిని వ్యక్తీకరించటం అనే క్రమంలోనే హేతుబద్ధమైన భావనిర్మాణ కౌశలం కలిగి, దోషరహితమైన వాక్య నిర్మాణం రూపొందుతుంది. సహజ వ్యాకరణ సూత్రాలను ప్రత్యేకంగా నేర్వకుండానే వంటికి పట్టించుకోగలుగుతారు.అదే పరాయి భాషనయితే మాతృభాషతో పోల్చుకుంటూ, తర్జుమా చేసుకుంటూ, వ్యాకరణ సూత్రాలను పట్టుపట్టి పాటిస్తూ తప్ప నేర్వలేరు. హాయిగా వ్యక్తీకరించలేరు. దీనిని బోధనా మాధ్యమం ద్వారా ఒక్క గెంతుతో అధిగమించ వచ్చు ననేది మిథ్య. అది తలకిందుల ఆలోచన. అమెరికా పరుగెడుతున్న వారందరూ బోధనా మాధ్యమం వల్లనే వెళ్లగలుగుతున్నారనుకోటం తప్పు. అదే నిజమైతే తెలుగు మాధ్యమంలో హైస్కూలు విద్య దాకా చదువుకున్నవారెవరూ అమెరికా వెళ్లలేకపోయి వుండాలి. వెళ్లినా అక్కడి వ్యవహారాలు పట్టుబడక విఫలమయిపోయి వుండాలి.

హైస్కూలు దాకా ఇంగ్లీషు మాధ్యమంలో చదువులొద్దనే వారందరూ ఇంగ్లీషు భాషాద్వేషంతో ఆ మాట అనటంలేదు. కాకపోగా ఇంగ్లీషు బాగా నేర్వాలంటే మాతృభాషలో ఎంత ఎక్కువ విషయ పరిజ్ఞానం, పాఠశాల ద్వారానూ,వెలుపలి సమాజం ద్వారాను పొందగలిగితే ఇంగ్లీషును నేర్చుకోవటం, దానిలో భావవ్యక్తీకరణం అంత సులువవుతుంది. మాతృభాష ద్వారా ఇంగ్లీషు భాషను నేర్పటం, నేర్వడం అనే ప్రక్రియ ఎలాగనే శాస్త్రీయ చింతన వైపు మన వాళ్లు కించిత్తు ఆలోచన కూడా పెట్టక, రొడ్డ కొట్టుడు బట్టీయాల్నే నేర్పుతున్నారు.

25 సంవత్సరాల క్రితంవరకు అన్ని బళ్లలోనూ అమలు జరిపిన త్రిభాషా సూత్రంలోని మంచి – చెడులను తర్కించుకుని, మాతృభాష ద్వారా అన్యభాషలను నేర్పటంలోని సౌలభ్యాలను పిల్లలకు అందించే ప్రక్రియను అభివృద్ధి
చేసుకోవలసిందిపోయి తల్లకిందుల ఇంగ్లీషు మాధ్యమం నడకను నేర్పుతున్నారు. ఇంటిభాష, బడి భాష, సమాజపు భాష (వైవిధ్యాలున్నప్పటికీ) ఒకటే అయినందువల్ల మాతృభాష అనే కాళ్లతో పరుగులు తీసి , కళ్ళతో ప్రపంచాన్ని చూసి, చెవులతో సమాజాన్ని విని ఎంతో వేగంగా ప్రాథమిక విషయ పరిజ్ఞానాన్ని 12 ఏళ్ల వయసుకే పిల్లలు తగినంత పొందగలుగుతారు.
అప్పటికే హిందీ, ఇంగ్లీషులను కూడా, ప్రత్యేక పాఠ్యాంశాలుగా ఒక మేరకు పరిచయం చేసివుంటే… 8, 9, 10 తరగతులలో మూడు భాషలకు (కనీసం తెలుగు, ఇంగ్లీషులకు) కలిపి ఒకే వ్యాకరణం నేర్పే విధానం అమలు చేసుకోగలిగితే… మాతృభాష ద్వారా, మన సందర్భంలో తెలుగు వాక్యనిర్మాణం, వ్యాకరణ సూత్రాల ద్వారా ఇంగ్లీషు, హిందీ వ్యాకరణాల్ని విద్యార్థులు సులువుగా వంటపట్టించుకోగలుగుతారు. ఇంగ్లీషు, తెలుగు వాక్యాల నిర్మాణాల్లో కర్త, కర్మ, క్రియలు వచ్చే వరుసక్రమానికి స్పష్టంగా తేడాలున్నప్పటికీ (ఉదా॥ ఐ డోంట్‌ థింక్‌ సో – నేను లేదు అనుకోవటం అలా) వ్యాకరణ సూత్రాలలో సామ్యాలు ఏ రెండు భాషలకైనా తగినన్ని తప్పక వుంటాయి. భాషా భాగాలు, క్రియా పదాలు, కాలాలు, వచనాలు, లింగాలు లేని భాషే వుండదు. ఈ సామ్యాలను, భేదాలను మూడు సంవత్సరాలపాటు (8,9,10 తరగతు లలో) నేర్పే విధానం గురించి విద్యా భాషావేత్తలు ఆలోచించాలి. ఇంగ్లీషు తెలుగు భాషల నడుమ సామ్యాలు భేదాలు ఎంత బాగా అర్ధం చేసుకుంటే అంతసులువుగా విద్యార్థులు ఇంగ్లీషును అర్థం చేసుకోగలుగుతారు. ఇంగ్లీషు, హిందీలను వినియోగిస్తూనే, పాఠoలోని కీలకాల్ని తెలుగులో బోధిస్తే విద్యార్థులు పరాయి భాషను కూడా అపుడు సులువుగా అర్ధం చేసుకుంటారు.

కృతకమైన భట్టీలను వదిలి హేతుబద్ధ చింతనతో పరీక్షలు రాయగలుగుతారు. ఏ యితర భాషైనా మాతృభాషా మూలాల ద్వారా, పోలికల ద్వారా, సామెతలు, పలుకుబడులు, ఆలంకారిక వ్యక్తీకరణల ద్వారా , విద్యార్థుల నిత్య జీవిత అనుభవం ద్వారా, జాతీయ సంస్కృతి ద్వారా తెలుసుకోవటమే అన్నిటికంటే సులువయిన, హాయైన మార్గం.అయితే యిది ప్రజల్ని వేలంవెర్రితో బులిపించి ఓట్లు గుంజుకోవటానికి, కోట్లు గడించడానికి ఉపయోగపడే మార్గం లాంటిది కాకపోవచ్చు.ప్రపంచ వాణిజ్యసంస్థ వారి కోరిక మేరకు, ప్రపంచపు సంతకు కావలసిన చౌక కూలీలకు అవసరమైన ‘తట్ట బేరగాళ్ల భాష’ వరకే యిది పరిమితం కాకపోవచ్చు. పరీక్షల, మార్కుల, భట్టీయం చదువుల కొరకే కాకుండా సామాజిక జిజ్ఞాసను, వైజ్ఞానిక తృష్ణను, దేశభక్తినీ యిది పెంపొందించవచ్చు.

మాతృభాష అంటే, మనదైన జీవితం నుండి పుట్టిన జీవజలం లాంటిది. అది అమృత ప్రాయమైనది. జాతీయ సంస్కృతిని నేర్పేది. మానవ సంబంధాలను గాఢతరం గావించేది. అందుకే మాతృభాష ద్వారా ఇంగ్లీషు విద్య అనేది ఎంత శాస్త్రీయమైనదైనా యిది ప్రపంచ బ్యాంకుకు వారి వందిమాగధులకు సరిపడటం లేదు. మాతృభాష ద్వారా పరిజ్ఞానం ఎంత ఎక్కున
పొందితే ఇంగ్లీషు భాష నేర్వడం అంత సులువవుతుంది.

సంస్కృతికి అనుకరణం అనే జబ్బుంది. అది ఎక్కువలో ఎక్కువ గుడ్డిది. జాతీయ ప్రజాస్వామికశక్తులు సాపేక్షంగా బలహీన పడ్డప్పుడు, ఆధిపత్యశక్తుల ఆకర్షణ, పెత్తనం, అణచివేత పెరిగిపోతూ సమాజాన్ని క్షీణ విలువలవైపు గుంజుకు పోతుంటాయి.అందులో భాగంగానే ప్రస్తుతం ఇంగ్లీషు వేలంవెర్రి సమాజాన్ని పట్టి పీడిస్తోంది. ఈ వేలంవెర్రి ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా లబ్ది పొందాలని పొంచుకు కూర్చున్న వారికి భవిష్యత్తరాలపట్ల,వర్తమాన సమాజం పట్ల కొంచెమైనా బాధ్యతగానీ, ఓపికతో కూడిన విధాన నిర్ణయాలుగానీ లేవు.ప్రస్తుతం మన మెదుర్కొంటున్న ఈ తీవ్ర వత్తిడి నుండి బయటపడాలంటే లోతైన ఆలోచన , బలమైన ప్రత్యామ్నాయ ఉద్యమం తప్పనిసరి.

– దివికుమార్
తెలుగుజాతి పత్రిక,
నడుస్తున్న చరిత్ర,
అక్టోబరు 2008

LEAVE A RESPONSE