మీ భాష మారకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్..

Spread the love

– పప్పు నాయుడు, ముసలినాయుడు ఇకనైనా మారండి
– ఈ సంస్కృతి మానుకోకపోతే.. అంతకు రెండింతలు గుణపాఠం చెబుతాం
– లోకేష్ కు పుట్టుకతోనే మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది
– బూతుల సంస్కృతిని కుసంస్కారి లోకేషే ప్రారంభించాడు
– కంస మామ అంటూ లోకేష్ జూమ్ మీటింగు పెట్టడం వల్లే వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళారు, తప్పేంటి..?
– పప్పు నాయుడు సవాల్ ను స్వీకరిస్తున్నాం.. ఫేస్ టు ఫేస్ చర్చించడానికి మా పార్టీ సిద్ధం, తండ్రీకొడుకులు సిద్ధమా..?
– మాది ప్రజా ప్రభుత్వం.. 2024లో 175కు 175 స్థానాలూ గెలుస్తాం.
– రెఫరెండం అంటే అర్థం తెలుసా లోకేష్..? మీకు అంత ధైర్యమే ఉంటే ఆత్మకూరులో పోటీ చేయండి
-ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభం
– రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏడాది లోపల పార్టీ సొంత కార్యాలయాలు ప్రారంభిస్తాం
– పార్టీ కార్యాలయం అంటే దేవాలయం అన్న భావన ప్రజల్లో కల్పించాలి
– మంగళగిరిలో రోడ్డును ఆక్రమించి అన్న క్యాంటీన్ పేరుతో టీడీపీ రాజకీయం చేస్తుంది
–వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హెచ్చరిక

నూతనంగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాలో, పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని విజయవాడలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర ఇన్ చార్జ్, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా  వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన పాయింట్స్ః

ఏడాదిలోపే 26 జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలు
‘ఎన్టీఆర్‌ జిల్లాలో వైయస్సార్‌ సీపీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నూతనంగా ఏర్పడ్డ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రస్తుతానికి లేవు. 26 జిల్లాల్లో కూడా పార్టీ సొంత కార్యాలయాలను ఏడాదిలోపే నిర్మించాలని పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించడం జరిగింది. రాబోయే 2023 ఏడాది మే- జూన్‌ నాటికి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయి. పార్టీ కార్యాలయం అంటే అదొక దేవాలయం లాంటిది. సమస్యలను పరిష్కరించడానికి పార్టీ కార్యాలయం ఉందనే భావన ప్రజల్లో కల్పించాలి. అప్పుడే పార్టీ పట్ల విశ్వసనీయత ప్రజల్లో పెరుగుతుంది. పార్టీ శాసనసభ్యులు, మంత్రులు అంతా ఈ విషయాన్ని గుర్తించి పాటిస్తారు. కేంద్ర కార్యాలయంతో పాటు, జిల్లా కార్యాలయాల్లో కూడా పార్టీ పెద్దలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

లోకేష్ కు మాన్యు ఫ్యాక్చరింగ్ డిఫెక్ట్
ఈ మధ్యకాలంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక కుసంస్కారమైన పద్ధతిని అవలంభిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలాలతో తిట్టడం, అవమానకర రీతిలో మాట్లాడటం వారికి ఒక అలవాటు అయింది. బహుశా ఇది లోకేష్‌ ఏర్పాటు చేసిన కొత్త సంప్రదాయంగా చెప్పుకోవాలి. లోకేష్‌కు ఇది పుట్టుకతోనే వచ్చిన మాన్యు ఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌. నిన్నటికి నిన్న లోకేష్‌ పదో తరగతి ఫలితాలపై పిల్లల తల్లిదండ్రులు, పార్టీ నాయకులతో జూమ్‌ కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమానికి కంసమామ జగన్‌ అని పేరు పెట్టాడు. పప్పునాయుడు లోకేష్ దురుద్దేశం ఏమిటో, ఆ పేరు పెట్టడంలోనే ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకే, జూమ్ మీటింగ్‌లోకి మా పార్టీ నేతలు ఎంటర్‌ అయి, పిల్లలతో రాజకీయాలు ఏంటని వారి తప్పులను ఎత్తి చూపాం. చంద్రబాబు నాయుడు ఒక ముసలి నక్క. ఆయన కుమారుడు ఎందుకూ పనికిరాని, పనికిమాలిన వారసుడు. వాళ్లిద్దరూ ఒక పక్కా ప్లాన్ తో తప్పుడు సమాచారాన్ని క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఇలాంటి అసభ్యపదజాలం వాడటం అనేది రాజకీయాల్లో సంప్రదాయం కాదు.

ఇది ఆరంభం మాత్రమే..
ముసలినాయుడు, పప్పునాయుడు చేసే దుశ్చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి. లేకుంటే మీకంటే రెండింతలు ఎక్కువగా వాడగలిగిన సామర్థ్యం మాకు ఉంది. నిన్నటి మీ చర్యను తిప్పికొట్టాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ దుష్ట సంప్రదాయాన్ని ఆపకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. పదో తరగతి పరీక్షల్లో పాస్‌ శాతం తగ్గడానికి కొవిడే కారణం. ఇంటర్‌లో నేను కూడా ఫెయిల్‌ అయ్యాను. చదవకనో, ఆరోగ్యం బాగోలేకనో, పరీక్షలు సరిగా రాయలేకపోతేనో ఫెయిల్‌ అయ్యాను. కోవిడ్‌ వల్ల పర్సంటేజ్‌ తగ్గిన మాట వాస్తవం. కానీ దాన్ని కూడా రాజకీయం చేసి, ముఖ్యమంత్రిగారిని దూషించడం కుసంస్కారి పప్పు నాయుడుకే చెల్లింది.

– ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం మీద పోరాడాలే తప్ప, ఇలాంటి తప్పుడు పనులు, పిల్లల్న రెచ్చగొట్టే పనులు తగవని హితవు పలుకుతున్నాం. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజాస్వామ్యబద్దంగా నిర్మాణాత్మకంగా విమర్శించాలి. గ్రీష్మ, అనిత, పట్టాభి, అయ్యన్నపాత్రుడి లాంటి వాళ్ళను పెట్టుకుని కుసంస్కారంగా మా పార్టీ అధ్యక్షుడు, నాయకులను దూషిస్తే సహించేది లేదు. మీరు ఒకటి అంటే… మేము పది అంటాం. ఇప్పటికైనా ముసలినాయుడు, పప్పునాయుడు వాళ్ల విధివిధానాలు మార్చుకుంటే మంచిది. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, మేము దాన్ని ఆహ్వానిస్తాం. అంతేకానీ అడ్డగోలుగా అసభ్యపదజాలంతో విమర్శిస్తే సహించేది లేదు.

లోకేష్ సవాల్ ను స్వీకరిస్తున్నాం, చర్చించేందుకు తండ్రీకొడుకులు రండి
పప్పునాయుడు లోకేష్ .. నిన్న చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. చర్చించేందుకు మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. నీకు ధైర్యం ఉంటే ముఖాముఖిగా మాట్లాడు. మేము చెప్పాల్సింది మేము చెబుతాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ ఛాలెంజ్‌ను చంద్రబాబు కూడా స్వీకరించాలి. జూమ్‌లో మేము అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పలేక నువ్వు పారిపోవడం సమాధానం కాదు. మాది ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వం చేసే ప్రతి పని, కార్యక్రమం ప్రజలకు మేలు చేసేదే. ముఖ్యంగా పేదలకు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రకులంలోని పేదలకు కూడా లబ్ధి చేకూరేలా చేస్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీ కడుపుమంట.

రెఫరెండం కావాలంటే.. ఆత్మకూరులో పోటీ చేయండి
2024 ఎన్నికల్లో మాకు 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయని మా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో కూడా వారి పని అయిపోయిందని. రెఫరెండం అంటే అర్థం తెలియని పప్పునాయుడు కూడా రెఫరెండం అడుగుతున్నాడు. నిజంగా రెఫరెండం కావాలనుకుంటుంటే ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదు? నిజంగా మీకు ధైర్యం ఉంటే ఆత్మకూరులో పోటీ చేసి దాన్నే రిఫరెండంగా భావించవచ్చు కదా? మా మంత్రులను, శాసనసభ్యుల్ని రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు మీకులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి తప్ప, అసభ్య పదజాలంతో దూషణలు చేస్తే సహించం. హద్దులు మీరి ప్రవర్తిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తుప్పు నాయుడు, పప్పునాయుడులను హెచ్చరిస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ…
– మంగళగిరిలో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి, అన్న క్యాంటిన్ పేరుతో రాజకీయం చేయడం తగదు. ఏదైనా పబ్లిక్‌ పర్పస్‌కు వాడాలనుకుంటే, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడం సముచితం కాదు.

– రాష్ట్ర బీజేపీ నాయకుల విమర్శలపై సమాధానం చెబుతూ.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కేంద్ర పన్నుల రూపేణా, రాష్ట్రానికి రావాల్సిన 41 శాతమే వాటా ఇచ్చారా… అదనంగా ఏమైనా ఇచ్చారా..? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.

– రాష్ట్రానికి సంబంధించి.. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెరవేర్చింది. వాటి గురించి ఎందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడరు.
– విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చారా..
– వైజాగ్- చెన్నై కారిడార్ ఇచ్చారా
– స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇచ్చారా.. పోలవరం నిధులు ఇచ్చారా.. ఇవేమీ ఇవ్వకుండా, గురివింద గింజ సామెతగా స్థానిక బీజేపీ నేతలు మాట్లాడవద్దు. కేంద్ర నాయకత్వానికి ఈ విషయాలన్నీ తెలుసు. కానీ, రాష్ట్ర బీజేపీ నాయకులే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

– 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తలు, నాయకుల కృషి వల్లే. కార్యకర్తల సేవలు ఏరోజుకీ మరచిపోం. కార్యకర్తలకు దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వనన్ని పదవులు ఇచ్చాం. కార్యకర్తల్ని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాం. రాబోయే రెండేళ్ళలో కూడా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ పార్టీ కార్యకర్తలను విస్మరించడం అన్నది జరగదు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి  తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పార్టీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply