– పదే పదే కోర్టు ఆదేశాలు భేఖాతర్ చేస్తున్న పోలీసులు
– వరుసగా మొట్టికాయలు వేస్తున్నా తీరు మార్చుకోవడం లేదు
– వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి
తాడేపల్లి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, నకిలీ మద్యం కేసులతో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం దానిపై ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై అక్రమ కేసులు నమోదు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి వెళ్లకుండా చేయొచ్చన్న కుట్రతో సాక్షిపై అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ లిక్కర్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాల్లో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని, దానిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక వార్తలు రాసిన జర్నలిస్టులపైనే నకిలీ లిక్కర్ తయారు చేశారని అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతులను ఎంతోకాలం నొక్కలేరని స్పష్టం చేశారు.